మురళీమోహనుడి
అవతార విశేష
సంక్షిప్త చిత్రరాజం..
సమగ్ర దృశ్య సమాహారం
శ్రీకృష్ణావతారం..!
ఎన్నిమార్లు ఆలకించినా
తనివితీరనిది రామకథ..
ఎన్నిసార్లు తిలకించినా
ప్రతిసారీ అబ్బురమనిపంచే
ఎన్టీఆర్ శ్రీకృష్ణ
సమ్మోహనరూపం!
పురాణ పురుషుడి జననం
మొదలు నిష్క్రమణ వరకు
చూసినోళ్ళకు చూసినంత..
ఆస్వాదించినోళ్లకు అందినంత
మహానటుల మేళా..
తెలుగు సినిమా కుంభమేళా..!
అన్నట్టు…
బాలకృష్ణుడిగా హరికృష్ణ
అప్పట్లో అచ్చం నాన్నలా..
బొద్దుగా..ముద్దుగా..
కళ్ళ కదలికలు..
మూతివిరుపులు
అంతా..మనో’హర’మే!
కన్నయ్య లీలలు..
కంసవధ..గోకుల కృష్ణుని
కల్యాణ పరంపర..
కన్నుల పండువగా
కుచేల సత్కారం..
కళ్ళు చెమరే బృహత్కార్యం
దర్శకుడు కమలాకరుడికి
ఓ పెద్ద నమస్కారం..!
ఇక నటీనట
ఘటనాఘట సామర్ధ్యం..
అగ్రపూజ మళ్లీ నందమూరికే..
ఒక నటుడు ఒకే పాత్ర ఇన్నిసార్లు పోషిస్తే మామూలుగా అయితే బోరు
కాని రామారావు
కృష్ణుడి వేషం..
ప్రతిసారి ఓ విశేషం..
అది ఆ పాత్రలో మహిమ..
తారక రామారావు
అభినయ పటిమ
మొత్తంగా దిగ్భ్రమ!
కృష్ణుడి సాయం కోసం
సుయోధనుడు
అర్జనుడు రాక..
బావా ఎప్పుడు వచ్చితీవు..
మొదలుకుని రాయబారం పద్యాలు..అన్నీ హృద్యాలు..
చివరగా రారాజు వధ..
గాంధారి వ్యధ…
ధృతరాష్ట్ర కౌగిలి..
ముసలం పుట్టుక..
బలదేవుని నిర్వేదం..
పరాకాష్టగా మహాభినిష్క్రమణం..
ఆదిదేవుడు
మరణంలోనూ చిద్విలాసం..
అప్పుడూ సమ్మోహనంగా ఎన్టీఆర్..
అవతార పరిసమాప్తం..
ఆదిశేషువు పునారావిర్భావం..
శంఖుచక్రాల యధాస్థానం..
శ్రీమహావిష్ణువు పాదాల
చెంతకు ఆదిలక్ష్మి..
కథ కంచికి..
తన్మయంతో మనం ఇంటికి..!
శ్రీకృష్ణావతారం విడుదలై
56 సంవత్సరాలు..
12.10.1967..
ఓ అవలోకనం..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286