Suryaa.co.in

Features International

అందాల “శ్రీలంక” ఆగమై పోతుంది…

ఆధునిక ప్రపంచం లో నేను చూసిన మొదటిది వెనెజులా సంక్షోభం. ఒకప్పుడు వెనెజులా దేశం లోని రైల్వే స్టేషన్ లేదా విమానాశ్రయం లో వజ్రాలు పెట్టి మర్చిపోయినా అవి అక్కడే ఉండేవి నెల తర్వాత అయినా. వెనెజులా ని మించిన అందమైన దేశం కానీ, ప్రజలు కానీ, అంత సంపన్నమైన దేశం కానీ భూ ప్రపంచం లో లేదు. ఇప్పుడు చినిగిపోయిన కట్ డ్రాయర్ దండం మీద నుంచి బయట పడిపోయినా దానికోసం కొట్టుకు చస్తూ ప్రపంచం లోనే అత్యంత ఎక్కువ క్రైం రేట్ ఉంది.

ప్రధాన కారణం ఉచిత పథకాలు. ఎన్నికల్లో గెలవటం కోసం అధ్యక్షుడు అన్నీ ఫ్రీ గా ఇస్తూ పోయాడు. ప్రపంచ ఆయిల్ మార్కెట్ చిన్న కుదుపు కి లోనయ్యి వెనెజులా ఆదాయం తగ్గినా ప్రభుత్వ అసమర్ధత, ఉచిత పథకాల వలన ఈ రోజు అత్యంత పేద దేశం గా మారింది – ఈ 20 సంవత్సరాల కాలం లోనే.

ప్రస్తుతం నేను చూస్తున్న రెండవది శ్రీ లంక సంక్షోభం. ప్రస్తుతం కొన్ని రోజులు ఎమర్జన్సీ కూడా విధించారు. దేశం అంతా అల్ల కల్లోలంగా ఉంది. కనీసం సముద్రం లోకి పోయి చేపలు పట్టే బోట్లకి కూడా ఇంధనం లేదు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రధాన కారణం “ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ”.
మనకి నెలకి లక్ష రూపాయల జీతం వస్తుంటే 30 లక్షల లోన్ పెట్టి చిన్న ప్లాట్ తీసుకొని మనకి వచ్చే లక్ష లో నెలకి 30 వేలు లోను ఎమౌంట్ కడితే మిగిలిన 70 వేల తో సంతోషం గా బతకొచ్చు, ఇక్కడ లోన్ తీసుకోవటం తప్పు కాదు.
అదే మనకి వచ్చేదే నెలకి 30 వేలు అయి నెలకి లోన్ ఎమౌంట్ 70 వేలు కట్టాల్సి వస్తే ఏమి జరుగుతుంది..? ఆత్మహత్య చేసుకోవాలి లేదా అరాచకాలు చేయాలి లేదా మళ్ళీ ఇంకో లోన్ తీసుకోవాలి. శ్రీ లంక అదే చేసింది అప్పు తీర్చటానికి మళ్ళీ అప్పు చేసింది (చేతకాని అసమర్ధ నాయకుల వలన)
సాధారణం గా ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి, జపాన్ బ్యాంక్, సింగపూర్ బ్యాంక్ లాంటివి వివిధ దేశాలకి అప్పు ఇస్తుంటాయి. అవి 1% మాత్రమే వడ్డీ వసూల్ చేస్తాయి మరియూ 30 నుంచి 50 సంవత్సరాల కాలం లో అప్పుని తీర్చవచ్చు. ఇది ఎవరైనా తీసుకోవచ్చు & మంచి రూట్.

శ్రీ లంక నాయకులు చేసే దుబారా ఖర్చు కి కమర్షియల్ బ్యాంక్ ల నుంచి, కమర్షియల్ దేశాల నుంచి కూడా అప్పులు తీసుకున్నారు. వీళ్ళ వడ్డీ 6% పైగానే ఉంటుంది మరియూ అతి తక్కువ కాలం లో తీర్చాలి. దీనికి తోడు నెల నెలా వడ్డీ మిస్ కాకుండా కట్టాలి. అప్పులు కట్టటానికి తగిన నిల్వలు లేక రేట్లు విపరీతం గా పెంచాల్సి వచ్చింది. కరోనా వలన వ్యాపారాలు సరిగ్గా నడవక ప్రజలకీ, ప్రభుత్వాలకి ఆదాయం తగ్గింది.

నిజానికి శ్రీ లంక ప్రధాన ఆదాయ వనరు టూరిజం (పర్యాటకం), రబ్బరు, తేయాకు మొదలగునవి.

కరోనా వలన టూరిజం తగ్గింది. దీనికి తోడు ప్రపంచంలోనే దేశం అంతా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న దేశం గా పేరు తెచ్చుకోవాలని ఎచ్చులకి పోయి కెమికల్స్ దిగుమతి ఆపేసి (2019- 20 ప్రాంతం అనుకుంట) అందర్నీ ఆర్గానిక్ వ్యవసాయం చేయమన్నారు, దిగుమతి ఆసాంతం తగ్గింది.

వడ్డీలు కట్టటానికి, నిత్యావసర వస్తువుల దిగుమతి కోసం డబ్బులు లేక ధరలు విపరీతం గా పెంచటం వలన దేశం అంతా అశాంతి, అల్లర్లు, హింస తో చెలరేగిపోతున్నారు కొన్ని చోట్ల. కనీసం వంట గ్యాస్, ఇంధనం కూడా దొరకట్లేదు చాలా చోట్ల. రోజులో అత్యధిక సమయం 13 గంటల కి పైగా కరెంట్ కోతలు. దీని వలన ఇంకా మరిన్ని సమస్యలు.

శ్రీ లంక జనాభా నిన్నటికి 2 కోట్ల 15 లక్షలు. జనాభా తక్కువ కాబట్టి ముకేష్ అంబానీ లాంటోడు పల్లీలు తినటం ఆపి ఆ డబ్బు సాయం చేసినా శ్రీ లంక గట్టెక్కుతుంది. కొంచెం పెద్ద దేశాలు మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తే కనీసం 100 సంవత్సరాలకి పైగా అత్యంత పేద దేశం గా మారిపోతాయి.

వెనెజులా నుంచి ప్రపంచం ఏ పాఠం నేర్చుకుందో తెలియదు కానీ శ్రీ లంక నుంచి మాత్రం ప్రతి దేశం, మన దేశం లో ఉన్న ప్రతి రాష్ట్రం పాఠం నేర్చుకోవాల్సిందే…!
అందుకే మన తెలుగు రాష్ట్రాలు అలాగే ఒట్లకోసం free అనే రాష్ట్రాలు గుర్తుస్తే దేశం బాగుపడుతుంది.

– జీ.ఎన్.ఆర్

LEAVE A RESPONSE