• వయోధికుల అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించేదిశగా ప్రైవేటు రంగం కృషిచేయాలి
• పెద్దలకు సంబంధించిన హెల్ప్‌లైన్, ఎస్ఏసీఆర్ఈడీ పోర్టల్‌ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
• సాంకేతిక ఉపకరణాల వినియోగాన్ని పెంచడం చాలా అవసరం. ఈ దిశగా యువకులు చొరవతీసుకుని చుట్టుపక్కల వారికి ఈ ఉపకరణాల వినియోగంపై చైతన్యం తీసుకురావాలి
అక్టోబర్ 1, 2021, న్యూఢిల్లీ:సమాజంలో వయోధికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వయోధికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషికి కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ మహత్కార్యంలో భాగస్వాములయ్యేందుకు అంకుర సంస్థలు వినూత్నమైన విధానాలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోధికుల దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన ‘వయోశ్రేష్ఠ సమ్మాన్ – 2021’ అవార్డుల ప్రదానోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దలను వృద్ధులు అని సంబోధించడం వారిని అగౌరవపరచడమేనన్నారు. ఉమ్మడి కుటుంబాల్లో పెద్దల అపారమైన అనుభవం కారణంగా పిల్లల్లో సృజనాత్మకత పెరిగేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
వయోధికులకు ప్రైవేటు రంగంలో ఉపాధికల్పించేందుకు ఉద్దేశించిన ఎస్ఏసీఆర్ఈడీ (సీనియర్ ఏబుల్ సిటిజెన్స్ ఫర్ రీ-ఎంప్లాయ్‌మెంట్) పోర్టల్‌ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆర్థిక స్వాతంత్ర్యం అవసరమని.. ఇందుకోసం వారి అనుభవానికి తగినట్లుగా ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రైవేటు రంగం ముందుకు రావాలని ఆయన సూచించారు.
వయోధికుల కోసం జాతీయ హెల్ప్‌లైన్ (14567)ను కూడా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా పెద్దలు తమ సమస్యలను చెప్పుకోవడం, వాటికి పరిష్కారాలు అందించేందుకు వీలవుతుందన్నారు. ఈ ప్రయత్నానికి సంపూర్ణ సహకారం అందిస్తున్న టాటా ట్రస్ట్ ప్రతినిధిని ఉపరాష్ట్రపతి అభినందించారు. రోజుకు 12 గంటలపాటు పనిచేసే ఈ హెల్ప్ లైన్ నెంబరు వివిధ భాషల్లో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ దిశగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ రూపొందించిన సేజ్ (సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్) పోర్టల్ ను కూడా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.
అనంతరం వయోశ్రేష్ఠ సమ్మాన్ అవార్డులను కూడా ఉపరాష్ట్రపతి అందించారు. తమ వయోభారంతో సంబంధం లేకుండా సమాజం కోసం పనిచేస్తున్న వారిని ఆయన అభినందించారు. కరోనా సమయంలో వయోధికులు తీవ్రంగా ప్రభావితమయ్యారని.. కేంద్ర ప్రభుత్వం టీకాకరణ కార్యక్రమంలో వారికే మొదటి ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
2036 నాటికి భారతదేశంలో సంఖ్య 14.9 శాతంగా ఉండొచ్చన్న అంచనాలను ప్రస్తావిస్తూ.. వారిని తగు రీతిలో గౌరవించుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ డాక్టర్ వీరేంద్ర కుమార్, సహాయ మంత్రులు ప్రతిమ భౌమిక్, రాందాస్ అఠావలే, శాఖ కార్యదర్శి ఆర్ సుబ్రమణ్యం, మంత్రిత్వ శాఖ అధికారులు, టాటా, టైమ్స్ గ్రూపుల ప్రతినిధులు, అవార్డు గ్రహీతలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.