Suryaa.co.in

Political News

అబద్దాలు చెప్పడంలో ఆరితేరారు

రెప్పలార్పకుండా అబద్ధాలాడటం గొప్ప కళ. అది మోడీ, నిర్మల సీతారామన్, అమిత్ షా లాంటివారికి మాత్రమే సాధ్యమైన విద్య. ప్రకృతి వైపరీత్యాలు, వైరస్ లాంటి కారణాలతో పంటలు దెబ్బతింటే రైతులు నష్టపోకుండా ఆదుకునే పధకం ఫసల్ బీమా యోజన. ఈ పధకాన్ని మోడీ సొంతరాష్ట్రం గుజరాత్ లోనే అమలు చెయ్యడం లేదు. తెలంగాణాలో అమలు చెయ్యడం లేదంటూ నిన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కళ్ళెర్ర చెయ్యడం చూస్తుంటే.. కొన్ని ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీల దాష్టీకానికి, దోపిడీకి, దానికి వత్తాసు పలుకుతున్న కేంద్రసర్కారుకు తెలంగాణ తలవంచడమే లేదనే అక్కసు మాత్రమే కనిపిస్తుంది. 2016 లో కేంద్రం ప్రారంభించిన ఈ పధకంలో కేంద్రం చేసిన కొన్ని మార్పుల కారణంగా ఈ పధకం నుంచి చాలా బీమా కంపెనీలు తప్పుకున్నాయి.

తెలంగాణాలో అంతకన్నా గొప్పగా రైతు బీమా పధకాలు అమలు అవుతున్నాయి. పంటలకు నష్టపరిహారం చెల్లించడమే కాక ప్రతి ఎకరానికి పదివేల రూపాయల పంటసాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. దురదృష్టం కొద్దీ రైతు మరణిస్తే వారం రోజులల్లోగా అయిదు లక్షల రూపాయల బీమా సొమ్మును ప్రభుత్వం అందిస్తుంది. అందుకు ప్రీమియం కూడా రైతుల తరపున ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఇక నిర్మల సీతారామన్ ఆర్ధికమంత్రి పదవి అందుకోవడానికి ఆమెకున్న ఏకైక అర్హత పచ్చి అబద్ధాలు చెప్పే విద్య కావచ్చు. ఆయుష్మాన్ భవ పధకంలో తెలంగాణ చేరలేదని చెప్పడం చూస్తుంటే ఆమెకున్న నాలెజ్ ఏపాటిదో తెలుస్తుంది. తెలంగాణలో అంతకన్నా గొప్పగా ఆరోగ్యశ్రీ అమలవుతున్నప్పటికీ ఏడాదిన్నర క్రితమే తెలంగాణ కూడా ఆ పధకంలో చేరిన విషయం, ఆ పధకం కింద కేంద్రప్రభుత్వం తెలంగాణకు నూట యాభై కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన విషయం కూడా ఆర్థికమంత్రికి తెలియదంటే ఆమె కలెక్టర్ ను రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని ప్రశ్నించడానికి అర్హురాలేనా?

అదొక్కటే కాదు..నిన్న ఆమె చెప్పిన ప్రతివిషయమూ పచ్చి అబద్ధమే. తెలంగాణ అప్పుల విషయం, అప్పుల పరిమితి విషయం, రైతుల ఆత్మహత్యల విషయం…ప్రతిదీ అబద్ధమే. కేంద్రమంత్రి హోదాలో ఉండీ అన్ని అబద్ధాలు ఎలా చెబుతారో ఆశ్చర్యం.

ఇక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకోసం తెలంగాణ సర్కార్ ఇంటికి ఎనిమిది లక్షలు ఖర్చుపెడుతుంటే కేంద్రం ఇస్తున్నది కేవలం లక్షన్నర. ఆ మాత్రానికి మోడీ ఫోటోలు పెట్టేయాలా? కేంద్రం నిధులు ఇవ్వకమునుపే కేసీఆర్ ఆ పధకాన్ని ప్రకటించారు. తెలంగాణాలో కేసీఆర్ అమలుచేస్తున్న రైతుబంధు, గృహనిర్మాణం లాంటి పధకాలను కాపీకొట్టిన విషయాన్ని మాత్రం నిర్మలమ్మ కానీ, మోడీ కానీ చెప్పరు!

ఐటీ మంత్రి కేటీఆర్ కూడా నిర్మలమ్మకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రం నుంచి మూడు లక్షల 3 .65 లక్షల కోట్లు తీసుకుని తిరిగి ఇచ్చింది కేవలం 1 .68 లక్షల కోట్లు మాత్రమేనని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. కేంద్రమే దేశం మొత్తంలో ఉన్న రేషన్ షాపుల్లో థాంక్స్ తో తెలంగాణ అని బోర్డులు పెట్టాలి అని కేటీఆర్ సూచించారు. కేద్రాన్ని ఆర్ధికంగా ఆదుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణది నాలుగో స్థానం అని కేటీఆర్ నిర్మలమ్మకు గుర్తు చేశారు.

తాను చెప్పిన విషయాల్లో ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తానని రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆ సాహసం నిర్మలమ్మ చెయ్యగలరా? దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తామంటే గజగజ వణుకుతున్న అధికార, ప్రతిపక్షాల నాయకులను చూస్తూ గర్వంతో నవ్వుకుంటున్న బీజేపీకి తెలంగాణాలో ఎదురైన ప్రతిఘటన చూసి కంగు తిన్నారని చెప్పుకుంటున్నారు.

నిర్మల అబద్ధాలపై తెలంగాణ సమాజం విరుచుకుపడింది. ముఖ్యంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా ఒక్కసారిగా భగ్గుమనడం, కేసీఆర్ కు ప్రజాదరణ ఆవగింజంత కూడా తగ్గలేదని స్పష్టం చేసింది. మేధావులు, విశ్లేషకులు సైతం కేసీఆర్ కు అండగా నిలబడటంతో బీజేపీ షాక్ కు గురైంది. ఫలితం నిన్నటి పత్రికాసమావేశాన్ని రద్దుచేసుకుని పారిపోవడం! మరి ఆ దిగ్భ్రమ నుంచి తేరుకుని మరొకసారి మీడియా ముందుకు వస్తుందేమో చూడాలి!

సంస్కారం లేని ఆర్ధికమంత్రి
సిడి దేశముఖ్, సి సుబ్రహ్మణ్యం, మురార్జీ దేశాయ్, వైబి చవాన్, హెచ్ ఎం పటేల్, ఆర్ వెంకట్రామన్, ప్రణబ్ ముఖర్జీ, మధు దండావతే, చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్ లాంటి శిఖరసమానులైన ఆర్థికమంత్రులను చూసిన కళ్ళతో అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నిర్మలాసీతారామన్ లాంటి దౌర్భాగ్యులను చూడాల్సి రావడం ఈ దేశం చేసుకున్న ఖర్మ.

కేంద్ర ఆర్ధికమంత్రి అంటే ఎంతో హుందాగా, గౌరవంగా నడుచుకుంటారు. పైన ప్రస్తావించిన వారిలో ఏ ఒక్కరైనా రేషన్ షాపులకెళ్లి అక్కడి ఫోటోలను చూడటం, కలెక్టర్లను తిట్టడం ఎవరైనా చూశారా?

కేసీఆర్ ఏ పర్యటనకు వెళ్లినా, అక్కడ ముందుగా అభినందించేది ఆ జిల్లా కలెక్టరును. ఇటీవల కలెక్టరేట్లను ప్రారంభించిన తరువాత తాను స్వయంగా కలెక్టర్ చేతులు పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టి ఆయన కుర్చీ పక్కన తాను నిలబడటం అందరూ గమనించి ఉంటారు. సంస్కారం, సభ్యత అంటే అదీ! సృగాలము ఎన్ని వాతలు పెట్టుకున్నా శార్దూలమగునా?

– మురళీమోహన్‌రావు ఇలపవలూరి

LEAVE A RESPONSE