స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ గ్రాండ్ సక్సెస్

-లక్ష్యాన్ని అధిగమించి రికార్డ్ స్రుష్టించిన బీజేపీ
-అధికార పార్టీ దాడులు, పోలీసుల ఆంక్షలను అధిగమించి మీటింగ్స్ నిర్వహణ
-స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ భేష్ అంటూ అమిత్ షా అభినందనలు

భారతీయ జనతా పార్టీ ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో రాష్ట్రంలోని శక్తి కేంద్రాల్లో నిర్వహిస్తున్న ‘‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. పార్టీ నాయకత్వం విధించిన లక్ష్యాన్ని మించి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించి పార్టీ నాయకులు సరికొత్త రికార్డు సృష్టించారు . రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతోపాటు కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని తయారు చేయడం, ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు మంచి స్పందన లభిస్తుండటంతో పార్టీ నాయకుల్లో నూతనోత్సాహం కన్పిస్తోంది. ఈనెల 10 నుండి ప్రారంభమైన స్ట్రీట్ కార్నర్ మీటింగులు ఈరోజుతో (ఈనెల 28 వరకు) పూర్తయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నేతల ముందు లక్ష్యాన్ని విధించగా… అంతకంటే ఎక్కువగానే అంటే 11 వేల 123 స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల సక్సెస్ కావడంపట్ల సంత్రుప్తి వ్యక్తం చేసింది. ఈరోజు రాష్ట్ర కోర్ కమిటీ నాయకులతో కేంద్ర హోంమంత్రి శాఖ మంత్రి అమిత్ ‌షా సమావేశమైన సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ మీటింగ్ లకు సంబంధించి వివరాలు తెలుసుకున్న అమిత్ షా ‘‘భేష్’’ అంటూ అభినందించారు.

మరోవైపు స్ట్రీట్ కార్నర్ మీటింగులు జరగకుండా అధికార పార్టీ నుండి పలుచోట్ల దాడులు ఎదురయ్యాయి. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ సహా కొడంగల్, వరంగల్, హైదరాబాద్, మహబూబాబాద్, బోధన్, సత్తుపల్లి సహ అనేక చోట్ల బీఆర్ఎస్ నాయకులు స్ట్రీట్ కార్నర్ మీటింగులను అడ్డుకునేందుకు యత్నించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో పోలీసులు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల విషయంలో పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. వీటన్నింటినీ అధిగమిస్తూనే లక్ష్యాన్ని చేధించడం విశేషం.

ఇదే విషయంపై పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ‘ప్రజా గోస – జనం భరోసా’ ఇంఛార్జీ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ కార్నర్ మీటింగ్ లకు వస్తున్న అనూహ్య స్పందనను చూసి ఓర్వలేని బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు దాడులకు పాల్పడ్డప్పటికీ, పోలీసుల ఆంక్షలు విధించినప్పటికీ అధిగమించి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు సక్సెస్ కావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు చర్చకు వచ్చాయని, మద్యం ఏరులై పారిస్తుండటంవల్ల గ్రామాల్లో కుటుంబాలు చిన్నాభిన్నమైతున్న అంశం కూడా తమ ద్రుష్టికి వచ్చిందన్నారు.

ఈ సమావేశాల ద్వారా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యంతో అందించడంతోపాటు పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తామనే హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగామన్నారు. అట్లాగే పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా ద్వారా పంట నష్టపరిహారం అందిస్తామనే హామీ కూడా రైతుల్లోకి తీసుకెళ్లగలిగామని పేర్కొన్నారు.

Leave a Reply