Suryaa.co.in

Andhra Pradesh

మార్గదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలి

– రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మెడికల్‌ సీట్లు వద్దనడం దారుణం
– కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలు హేయం
– ఇది రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి తీరని నష్టం
– కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై లోక్‌సభలో మాట్లాడిన వైయస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత పీ.వీ.మిథున్‌రెడ్డి

న్యూఢిల్లీ: ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త మెడికల్‌ సీట్లపై ప్రకటన చేసింది. వచ్చే 5 ఏళ్లలో దేశంలో కొత్తగా 75 వేల మెడికల్‌ సీట్లు అందుబాటులోకి తెస్తామని, ఈ ఏడాది 10 వేల సీట్లు వచ్చేలా చూస్తామని చెప్పింది. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం తమకు కొత్త మెడికల్‌ సీట్లు వద్దంటూ లేఖ రాసింది. ఇది చాలా దారుణం.

ఆం«ధ్రప్రదేశ్‌లో మెరుగైన వైద్య సదుపాయాలు లేవు. కరోనా సమయంలో వైద్యం కోసం రాష్ట్ర ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చింది. ఆ పరిస్థితిని మార్చడానికి ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఒకేసారి కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణం మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీలను గత ఏడాదే ప్రారంభించడం జరిగింది.

కానీ, ప్రభుత్వం మారడంతో, ఆ మెడికల్‌ కాలేజీలకు గ్రహణం పట్టింది. కాలేజీల పనులు ఆపేయడమే కాకుండా.. పీపీపీ విధానంలో ౖప్రైవేటుపరం చేసే పని మొదలు పెట్టారు. కేవలం గత ప్రభుత్వం వాటిని చేపట్టింది కాబట్టి, వాటిని పూర్తి చేయకపోవడం, ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించడం అత్యంత దారుణం.

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం చేస్తుంది. ఆ నిర్ణయం ఎవరిది? ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే నిర్మిస్తామని చెబుతున్నారు. దీని వల్ల ప్రాజెక్టు సామర్థ్యం సగానికి పైగా తగ్గిపోతుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కడుతుందని, విభజన చట్టంలో చెప్పారు. ఆ ప్రాజెక్టుకు రూ.30 వేల కోట్ల వ్యయం అవుతుంది. కానీ మొత్తంగా రూ.30 వేల కోట్లు మాత్రమే ఇస్తామంటున్నారు. మరి మిగిలిన నిధుల సంగతి ఏమిటి?.ఆ నిధుల్లో కూడా ప్రాజెక్టు కోసం ఈ ఏడాది రూ.5 వేల కోట్లు, వచ్చే ఏడాది మరో రూ.5 వేల కోట్లు ఇస్తామంటున్నారు. దీని వల్ల పనులెలా సాగుతాయి?

లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భందా కేంద్ర ఆర్థిక మంత్రి సహారా సంస్థ గురించి మాట్లాడారు. ఆ సంస్థ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి, దాన్ని ఇతర మార్గాల్లోకి మళ్లించిందని ఆమె వెల్లడించారు. సహారా సంస్థ ఎంతో మంది డిపాజిటర్లను మోసం చేసిందని, అందుకే సహారాపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇది మంచిదే. మరి మార్గదర్శి సంస్థను ఎందుకు విడిచిపెట్టారు. దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు. మార్గదర్శి కూడా చట్ట విరుద్ధంగా ఏకంగా రూ.2,600 కోట్ల డిపాజిట్లు సేకరించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి, ఆ ని«ధులను ఇతర మార్గాల్లోకి మళ్లించింది.

ఆ మేరకు ఆర్బీఐ కోర్టులో అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది. మార్గదర్శి వసూలు చేసిన డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ కూడా కేసు నమోదు చేసి, రూ.1000 కోట్ల ఫైన్‌ వేస్తే, దానిపై వారు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఇది చాలా పెద్ద నేరం. చట్టం అందరికీ సమానమే. మార్గదర్శి సంస్థకు మీడియా ఉంది కాబట్టి, వారిని ఉపేక్షించడం ఏ మాత్రం సరికాదు.

నేను ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తున్నందుకు, నాపై రోజు ఆ మీడియాలో కథనాలు రాస్తున్నారు. అయినా నేను భయపడబోను. వెనక్కు తగ్గబోను. మార్గదర్శి వల్ల చాలా మంది డిపాజిటర్లు నష్టపోయారు. వారికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగబోదు. ఈ విషయంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన మాట ఏమైంది? ఈడీ దర్యాప్తు ఏమైంది? అంత పెద్ద నేరం గురించి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు?.

సభలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. ‘గూగుల్‌ సెర్చ్‌లోకి వెళ్లి మార్గదర్శి అని కొట్టండి. మొత్తం చరిత్ర వస్తుంది. ఆ సంస్థ యజమాని ఒక బంగారు కుర్చీలో కూర్చుని ఉంటే, మంత్రులు ఆయన ముందు మోకరిల్లి ఉంటారు.ఆ విధంగా ఒక స్కామ్‌ చేసిన సంస్థను కాపాడుతున్నారు. ఆ సంస్థ ప్రజాధనాన్ని మళ్లించింది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది. కాబట్టి, తప్పనిసరిగా గట్టి చర్య తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం వెంటనే కఠిన చర్య తీసుకోవాలి.

ఇక క్యాపిటల్‌ అమరావతికి సంబంధించి రూ.15 వేల కోట్లు రుణ రూపంలో ఇస్తున్నారు. కానీ, గ్రాంట్‌ లేదు. ఇది ఎంత వరకు న్యాయం?. రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చినా కూడా, 10 ఏళ్ల తర్వాత విశాఖకు రైల్వే జోన్‌ ఇచ్చారు. కానీ, ఇక్కడా అన్యాయం చేశారు. వాల్తేరు డివిజన్‌ను రెండుగా విభజించి ఇచ్చారు. ఇది అన్యాయం. కాబట్టి వాల్తేరు డివిజన్‌ మొత్తాన్ని జోన్‌లో చేర్చాలి.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటి? నేను మంత్రిని సూటిగా అడుగుతున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కొనసాగిస్తారా? లేక ప్రైవేటుపరం చేయబోతున్నారా? సమాధానం చెప్పండి.మేము విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి మంత్రిగారు దీనిపై ప్రకటన చేయాలి.

మా రాష్ట్ర సీఎం గొప్పగా చెబుతారు. తమ 16 మంది ఎంపీల మద్దతుతో ప్రభుత్వం సాగుతోందని, ప్రభుత్వంలో తమది కీలకపాత్ర అంటారు. మరి 12 మంది ఎంపీలు ఉన్న బీహార్‌ కేంద్రం నుంచి ఎన్నో పొందుతోంది. అంత కంటే ఎక్కువ మంది ఎంపీలు ఉన్న, మా రాష్ట్రానికి మాత్రం అన్యాయం చేస్తున్నారు. పోలవరంకు నిధులు ఇవ్వడం లేదు. రైల్వే జోన్‌లోనూ అన్యాయం చేశారు. కాబట్టి వీటన్నింటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

LEAVE A RESPONSE