తురకపాలెం ఘటనపై అధ్యయనం అవసరం

– ‘సర్వైలెన్స్’ వ్యవస్థను పటిష్ఠం చేయాలి
– తురకపాలెం మ‌ర‌ణాల‌పై మంత్రి స‌మీక్ష‌
– ఉన్నతాధికారులకు మంత్రి సత్యకుమార్ ఆదేశాలు

అమరావతి: తురకపాలెంలోని మరణాలకు దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సాధార‌ణ స‌ర‌ళికి భిన్నంగా జులై నుంచి సెప్టెంబరు 3వ తేదీ మధ్య 23 మరణాలు జరిగినప్పుడు.. అప్రమత్తం కావడంలో వెన‌కబడకూడదన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి ముందు తురకపాలెంలో మరణాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డీఎంఈ డాక్టర్ రఘునందన్ ల‌తో మంత్రి సమీక్ష జరిపారు.

గుంటూరు ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ ల్యాబ్ నుంచి వచ్చే బాధితుల రక్త నమూనాల పరీక్షల ఫలితాలకు అనుగుణంగా త్వ‌ర‌లో త‌గు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని ప్ర‌జ‌లంద‌రికీ  కిడ్నీల పనితీరు పరీక్షలు, హెచ్బీఎ1సీ(షుగర్), బీపీ టెస్టులు నిర్వ‌హించాల‌ని మంత్రి ఆదేశించారు.

తురకపాలెం ఘటన నేపథ్యంలో సర్వైలెన్స్ వ్యవస్థలో తగిన మార్పులు చేయాలన్నారు.
సమాచార సేకరణలో లోపం ఉండకూడదన్నారు. తురకపాలెంలో ఎక్కువ‌గా న‌మోదైన మ‌ర‌ణాలను ముందుగా గ‌మ‌నించి, విశ్లేషించ‌డంలో జాప్యం జరిగిందని అధికారులు మంత్రికి వివరణ ఇచ్చారు. ప్ర‌స్తుత వ్య‌వ‌స్థ‌లో క్షేత్ర‌స్థాయిలో వైద్య సిబ్బంది మ‌ర‌ణాల వివ‌రాలు, త‌గు కార‌ణాల విశ్లేష‌ణ‌కు చేపట్టే ఏర్పాటు లేనందున త‌గు స‌మ‌యంలో ప‌సిగ‌ట్ట‌లేక‌పోయార‌ని అధికారులు వివ‌రించారు.

సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ క్షేత్ర‌స్థాయిలో మ‌ర‌ణాల వివ‌రాలు, కార‌ణాల న‌మోదుకు చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. తురకపాలెంలో క్షేత్రస్థాయి పర్యటన ద్వారా గుర్తించిన అంశాలను మంత్రికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ జి.రఘునందన్ వివరించారు. జులైలో 10, ఆగస్టులో 10, సెప్టెంబరు 3వ తేదీ వరకు ముగ్గురు ప్రాణాలు విడిచారన్నారు.

తురకపాలెంలోని బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. తురకపాలెంలోని పరిస్థితులు అదుపులో ఉన్నాయని తెలిపారు. మంత్రి ఆదేశాల మేర‌కు డీఎంఈ డాక్ట‌ర్ ర‌ఘునంద‌న్ తో పాటు ఇత‌ర వైద్యుల బృందం బుధ‌వారం తుర‌క‌పాలెం గ్రామంలో ప‌ర్య‌టించి ప‌రిస్థితిని సమీక్షించారు.

Leave a Reply