– గత ప్రభుత్వ బకాయిల్ని చెల్లించడంతో ప్రభుత్వాసుపత్రుల్లో మారనున్న పరిస్థితి
– మందుల సరఫరా అంశాన్ని సమీక్షించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
– వివిధ ఆసుపత్రుల అవసరాల మేరకు మందులు సరఫరా చేసేలా మార్పులు చేయాలన్న మంత్రి
– స్థానిక అవసరాల మేరకు మందులు కొనుగోలు చేసుకునేలా ఆసుపత్రులకు అధికారాలు
అమరావతి: గత పలు నెలలుగా వివిధ ప్రభుత్వాసుపత్రుల అవసరాల మేరకు మందులు, సర్జికల్ పనిముట్ల సరఫరా కాకపోవడంతో నెలకొన్న ఆందోళనకు త్వరలో తెరపడనుంది. గత రాష్ట్ర ప్రభుత్వం చివరి సంవత్సరం పాటు మందులు, పరికరాలు సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంతో వారు సరఫరాను తగ్గించివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. గత రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.900 కోట్ల మేరకు చెల్లింపులు బకాయి పడడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఈ సమస్యపై రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారంనాడు సంబంధిత ఉన్నతాధికారులతో వివరంగా సమీక్షించారు. మందులు, ఇతర పరికరాల సరఫరాలో అంతరాయం ఏర్పడడానికి గల కారణాల్ని వారు మంత్రికి వివరించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు మందులు, పరికరాలకు సంబంధించిన చేసిన వ్యయంపై ఆయన ఆరా తీశారు.
పరిస్థితి ఎప్పటికి మెరుగుపడుతుందని సత్యకుమార్ యాదవ్ వాకబు చేశారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పేరుకుపోయిన రూ.900 కోట్ల బకాయిలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సగానికి పైగా చెల్లింపులు చేయడంతో, సరఫరాదారులు సాధారణ స్థితిని నెలకొల్పడానికి ముందుకొచ్చారని అధికారులు మంత్రికి వివరించారు. బకాయిల చెల్లింపు గురించి ఆర్థిక శాఖాధికారులతో తాను కూడా చర్చించిన విషయాన్ని మంత్రి వివరించారు.
సమీక్ష సందర్భంగా మందుల సేకరణ, సరఫరా వ్యవస్థలో మార్పులు తెచ్చి యాంత్రిక విధానంలో కాకుండా ఆయా ఆసుపత్రుల అవసరాల మేరకు సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. ఐదేళ్ల క్రితం రూపొందించబడిన ఎసెన్షియల్ సర్జికల్స్ లిస్ట్ ను సమీక్షించి కాలానుగుణంగా తగు మార్పుల్ని చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
ఎముకలకు సంబంధించిన సమస్యలకు గురైన రోగులు ఎక్కువ స్థాయిలో ఇంప్లాంట్ప్ కోరుకుంటున్నారని, వాటిని వివిధ ఆసుపత్రులకు ఎపిఎంఎస్ ఐడిసి ద్వారా సరఫరా చేయించాలని వివిధ వైద్య శాఖాధిపతులు కోరగా, ఈ దిశగా తగు చర్యల్ని చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
గతంలో ఎపిఎంఎస్ ఐడిసి ద్వారా జరిగే సరఫరాకు అదనంగా అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అవసరాల మేరకు మందులు, సర్జికల్ పరికరాల్ని కొనుగోలు చేసుకొనే వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
ఈ మేరకు ప్రభుత్వ సర్వజనాసుపత్రులు (జిజిహెచ్‌లు) తమకు కేటాయించబడిన బడ్జెట్లో 20 శాతం మేరకు, ఇతర ఆసుపత్రులు 10 శాతం మేరకు కొనుగోళ్లు చేసుకోవచ్చు. తరచుగా సరఫరా లోపంతో సమస్యల్ని సృష్టించే రియేజెంట్లను కూడా ఈ నిధుల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ కొనుగోళ్లు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల ద్వారా జరుగుతాయి.
ఎపిఎంఎస్ ఐడిసి పనితీరుపై సమీక్ష
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎంఎస్ ఐడిసి) పనితీరును కూడా గురువారం నాడు మంత్రి సమీక్షించారు. ఆరోగ్య శాఖకు పలు సేవలందించి తద్వారా వచ్చే అడ్మినిస్ట్రేటివ్ ఫీజు ప్రధాన ఆదాయంగా ప్రభుత్వ బడ్జెట్ పై ఆధారపడకుండా పనిచేస్తున్న ఈ సంస్థ గురించి ఆయన పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత కొన్నేళ్లుగా ఈ సంస్థ చేపట్టిన నిర్మాణాలు, మున్ముందు చేపట్టనున్న పనుల గురించి మంత్రి ఆరా తీశారు.
ఈ సంస్థ స్వయంచోదితంగా భవిష్యత్తులో పనిచేయడానికి రానున్న ఐదేళ్లలో ఇప్పటికే నిర్ధారితమై చేపట్టనున్న నిర్మాణ పనులు, అదనంగా దక్కనున్న అవకాశాలపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. సిబ్బందిపై ఈ సంస్థ నెలకు దాదాపు రూ.8 కోట్లు వ్యయం చేస్తోంది. ఎపిఎంఎస్ ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీషా , డిహెచ్ డాక్టర్ పద్మావతి, డిఎంఇ అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు