-పీఎస్సార్ సహా ఆ ఇద్దరిపై కూటమి మళ్లీ ఫిర్యాదు
-కర్నూలు ఎస్పీపైనా వేటు తప్పదా?
-ఇన్చార్జి డీజీపీతో ఎన్నికలు ఎలా జరిపిస్తారు?
-డీజీపీగా ద్వారకా తిరుమల, సీఎస్‌గా నీరబ్?
-మరికొందరు కలెక్టర్లు, ఎస్పీలపైనా వేటు
-రెండవ దశలో మరికొందరు డీఎస్పీలు?
( అన్వేష్)
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి, ఇంటలిజన్స్ ఏడీజీ పీఎస్సార్ ఆంజనేయులపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఎన్డీఏ కూటమి.. కేంద్ర ఎన్నికల సంఘానికి వరసగా ఫిర్యాదులు పంపడంతోపాటు, ఆ మేరకు ఒత్తిడి పెంచుతున్నాయి. దానితో ఆ ముగ్గురిపై వేటు తప్పకపోవచ్చని, ఆ మేరకు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ముగ్గురు కీలక అధికారులపై సీరియస్‌గా దృష్టి సారించింది. పాలనా పగ్గాలు చేతిలో ఉన్న సీఎస్ జవహర్‌రెడ్డి, పోలీసు పగ్గాలు చేతిలో ఉన్న డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి, తెరవెనుక చక్రం తిప్పే నిఘా దళపతి పీఎస్సార్ ఆంజనేయులును ఆ స్థానాల నుంచి ఎన్నికల వరకూ తప్పించడాన్ని ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ మేరకు ఇప్పటికి వారిపై మూడుసార్లు ఫిర్యాదు చేయటం ప్రస్తావనార్హం.
ఇన్చార్జి డీజీపీగా వ్యవహరిస్తున్న రాజేంద్రనాథ్‌రెడ్డి 1992 బ్యాచ్‌లో, ఇప్పటి నిఘా దళపతి పీఎస్సార్ కంటే కింద వరసలో ఉన్నారు. నిజానికి 89 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐపిఎస్ ద్వారకా తిరుమలరావు, 1990 బ్యాచ్‌కు చెందిన అంజనాసిన్హా, 1991 బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ సీనియారిటీ లిస్టులో ఉన్నారు. ఇక 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌గుప్త, పీఎస్సార్ ఆంజనేయులు, కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు. వీరిలో అత్యంత సీనియర్ ద్వారకా ఒక్కరే. ఆయన బ్యాచ్‌కే చెందిన ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నప్పటికీ ఆయన సస్పెన్షన్‌లో ఉండి, న్యాయపోరాటం చేస్తున్నారు. కాబట్టి ఆయనను పరిగణనలోకి తీసుకోవడం కష్టం.
అయితే అందరికంటే సీనియర్, వివాదరహితుడైన ద్వారకా తిరుమలరావును పక్కనపెట్టి, తన కడప జిల్లాకు చెందిన రాజేంద్రనాధ్‌రెడ్డిని, ఇన్చార్జి డీ జీపీగా నియమించడంపై అప్పుడే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన వైసీపీ కార్యకర్తలు కూడా ఈర్ష్యపడే స్థాయిలో జగన్‌కు సేవలందిస్తున్నారని టీడీపీ ఎద్దేవా చేసింది. తాజాగా ఆయనను సైతం మార్చాలని ఎన్డీఏ కూటమి ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఇన్చార్జి డీజీపీ హయాంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. దానితో ఆయనపై వేటు ఖాయంగా కనిపిస్తోంది. ఇక తమ ఫోన్లు ట్యాపింగు చేస్తున్నారంటూ నిఘా దళపతి పీఎస్సార్‌పై ఆరోపించిన కూటమి, ఆయనను కూడా తప్పించమని కోరింది. ఒకవేళ రాజేంద్రనాధ్‌రెడ్డిని తప్పిస్తే, ఆయన స్థానంలో ద్వారకా తిరుమలరావును నియమించవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇక సీఎస్ జవహర్‌రెడ్డిపై కూటమి ఆరోపణల వర్షం కురిపిస్తోంది. సామాజిక పెన్షన్ల వ్యవహారాన్ని వైసీపీకి అనుకూలంగా మలిచే కుట్రలో జవహర్‌రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి, సీఎం కార్యదర్శి దనుంజయరెడ్డి భాగస్వాములయ్యారని ఈసీకి ఫిర్యాదు చేసింది.
పెన్షనర్లకు ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులివ్వకుండా, సచివాలయాల వద్దకు రప్పించి వారిని టీడీపీపై ద్వేషం పెంచే జగన్ కుట్రలో, ఈ అధికారులంతా భాగస్వాములయ్యారని కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఒకవేళ జవహర్‌రెడ్డిపై వేటు వేస్తే ఆయన స్థానంలో 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ సీఎస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్‌లో ఆయన పదవీకాలం ముగియనుంది. జగన్ ప్రభుత్వం ఆయనను పక్కనపెట్టిన విషయం తెలిసిందే.
ఇటీవల అంగన్వాడీలు సమ్మె చేసినప్పటికీ.. జగన్ సర్కారు వెంటనే పట్టుదలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. సచివాలయ, గ్రామ, వార్డు సిబ్బందిని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసింది. అంతకుముందు కరోనా సమయంలో వైన్‌షాపులు, సినిమా హాళ్ల వద్ద టీచర్లను కాపలా పెట్టి విమర్శల పాలయింది. మరి అత్యంత కీలకం- సున్నితమైన పెన్షన్ల అంశాన్ని మాత్రం గాలికొదిలి, ప్రత్యమ్నాయ ఏర్పాట్లను పక్కనపెట్టిన వైనం వెనుక సీఎస్, సెర్ప్ సీఈఓ ఉన్నారని ఎన్డీఏ కూటమి ఈసీకి ఫిర్యాదు చేసింది.
జగన్ ఆదేశాలు, సీఎంఓలో ధనుంజయరెడ్డి పర్యవేక్షణలోనే ఈ కుట్ర జరిగిందని ఆరోపించింది. అయితే నేరుగా ఎలాంటి బాధ్యతలు లేని ధనుంజయరెడ్డిని తప్పించడం సాధ్యం కాదని, ఈ అంశంలో సీఎస్ జవహర్‌రెడ్డి పైనే వేటు పడటం ఖాయమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డితోపాటు, సీఎస్ జవహర్‌రెడ్డి కూడా కడప జిల్లా వారే కావడం ప్రస్తావనార్హం.
ఇక కర్నూలు ఎస్పీ పైనా వేటు ఖాయంగానే కనిపిస్తోంది. కౌన్సిలింగ్ పేరుతో టీడీపీ కార్యకర్తలను ట్రైనింగ్ సెంటర్‌కు తీసుకువెళి,్ల దారుణంగా కొట్టిన ఆయనపై కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే మరికొందరు కలెక్టర్లపైనా వేటు తప్పదంటున్నారు.
ఇదిలాఉండగా.. రెండవ దశలో భారీ సంఖ్యలో డీఎస్పీల బదిలీలు ఉండవచ్చంటున్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన పలువురు డీఎస్పీలపై, కూటమి ఇప్పటికే పలు ఫిర్యాదులు చేసింది. సదరు డీఎస్పీలు బదిలీలకు ముందు తమపై జరిగిన దాడులు, దౌర్జన్యాలను ఉదహరించింది.