నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే,టీ న్యూస్ ఛానళ్లపై చర్యలు తీసుకోండి

– తెలంగాణ ఉద్యమకారులతోపాటు గిట్టని పార్టీలు, పత్రికలు, టీవీలపై విషం చిమ్ముతున్నాయి
– చట్ట సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలనే వక్రీకరిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నయ్
– యాడ్స్ పేరుతో రూ.వందల కోట్లు ఆ పత్రిక, ఛానల్ కు కేటాయిస్తూ సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారు
– పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం వినతి

భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో తెలంగాణ ఉద్యమకారులు, గిట్టని రాజకీయ పార్టీలు, పత్రికలు, ఛానళ్లపై విషం చిమ్ముతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ ఛానల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు.

బండి సంజయ్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను, టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న తెలంగాణ ఉద్యమకారులపైనా, రాజకీయ పార్టీలపైనా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ ఛానల్ అడుగడుగునా విషం చిమ్ముతున్నాయని ఈ సందర్భంగా వారు వివరించారు.

తెలంగాణ సెంటిమెంట్ పేరుతో రెచ్చగొడుతూ భౌతిక దాడులకు పురిగొల్పేలా పచ్చి అబద్దాలతో కథనాలు రాస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను
bjp-team1 కూడా, ఆయా పత్రిక, ఛానల్ వక్రీకరిస్తూ ప్రధానమంత్రి గౌరవానికి, పార్లమెంట్ పవిత్రకు భంగం కలిగించేలా వ్యవహరించాయని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివ్రుద్ది, ప్రజల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పాటుపడుతుంటే ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అభ్యంతరం వ్యక్తం చేశారు.

అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొనసాగిస్తున్న దోపిడీకి, అవినీతికి రక్షణ కవచంగా నిలిచిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఛానల్ కు కేసీఆర్ ప్రభుత్వం గత ఏడేళ్లలో అడ్వయిర్జైజ్ మెంట్ల పేరుతో వందల కోట్లను కేటాయించిందన్నారు. ఈ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ప్రభుత్వ ఖజనాకు గండి కొడుతున్నారని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే టీ న్యూస్ నడుస్తోందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే టీ న్యూస్ నడుస్తోందని తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ ఛానళ్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్ర మంత్రిని కలిసిన వారిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్రరావు, కేంద్ర జలవనరుల విభాగం సలహాదారు వెదిరె శ్రీరాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కోశాధికారి శాంతికుమార్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్.విఠల్, రాష్ట్ర సమన్వయకర్త నూనె బాలరాజ్ ఉన్నారు.

Leave a Reply