సిక్కోలే నీ వ్యాపకం..అదే నీ జ్ఞాపకం..!

అందరం ఒకనాటికి పోయేవాళ్ళమే గాని
ఈ ఎర్రన్నాయుడు అనే వ్యక్తి
ఇంకొన్నాళ్ళు బ్రతికి ఉంటే
ఎక్కడికి వెళ్ళిపోయేవాడో..?

రాజకీయాల్లోకి అడుగుపెట్టేనాటికే
ఓ ఫిగర్..
ఉన్నన్నాళ్ళు టైగర్..
ప్రత్యర్థులకు డేంజర్..
మనిషేమో అసలు సిసలైన
వజ్రాల ఖైజర్..!

రాజకీయాన్ని రాజకీయంగా
అరాచకీయంగా
చేయని నైజం..
ముక్కుసూటితనమే ఇజం..
మంచి అనిపిస్తే అడగడం
చెడ్డని భావిస్తే అడ్డుపడడం
లేదంటే తానే అడ్డుకోవడం..
తప్పని తలపోస్తే కడిగేయడం..
అదే ఎర్రన్నాయుడు మార్కిజం..
కింజరపు వారి
మార్క్సిజం..!

హరిశ్చంద్రాపురం ఏరికోరి ఎన్నుకున్న హరిశ్చంద్రుడు
సిక్కోలు రాజకీయ వినీలాకాశాన అప్పటికీ
ఇప్పటికీ ఎప్పటికీ
చుక్కల్లో చంద్రుడు..
ఎన్టీఆర్ సభలో దేవేంద్రుడు
పార్టీలకు అతీతంగా
వాజపేయి మెచ్చిన ఆమాత్యుడు..!

ఎన్నికల బరిలో
నిలుచుంటే గెలుపే..
ఏ గెలుపైనా
వాపు కాదు బలుపే..
ప్రత్యర్థుల పలుకులన్నీ
గురివింద నలుపే..
స్వతంత్రుడైనా గెలుపు
నల్లేరుపై బండి నడకే..!

ఎర్రన్నాయుడు ముందు వెనక ఎందరినో
చూసినా సిక్కోలు..
ఆయనకే ఘనమైన మెచ్చుకోలు..
ఆయన సాధించిన అభివృద్ధికి కృతజ్ఞతే
నభూతో నభవిష్యతి రీతిలో
ఆ మహానేతకు
లభించిన వీడుకోలు..
మళ్లీ రమ్మంటూ
మనఃపూర్వకంగా
ఓ వేడుకోలు..!

ఔను..ఎర్రన్నాయుడు
మరలి రాలేకపోయినా
తనకు మారుగా..
తన కుమారుడు..
సిక్కోలు రాజకీయ యవనికపై ఆధునిక రాకుమారుడు..
తండ్రితో పోలిస్తే
పొడుగు తక్కువైనా పిడుగే
ఇప్పుడు లోక్ సభకే గర్వం
సిక్కోలుకేమో సర్వం
విపక్షంలో ఉన్నా
ఉత్తరాంధ్రలో నడుస్తున్నది
రామ్మోహనుడి పర్వం..!

రామ్మోహనా..సమ్మోహనా..
నాన్న వేసేశాడు బాట
నువ్వేమో అగ్గిబరాటా..
మొదలెట్టేసావు ఆట..
నాన్నలా నీకూ
ఆగడం తెలియదు..
ఆగడాలు ఎరుగవు..
చెడుపై జగడం మానవు..
మంచి అనిపిస్తే ఎవరు చెప్పినా మారవు…
అదే కోవ..
నాన్న చూపిన త్రోవ..
నడిస్తే..జనాన్ని నడిపిస్తే..
ఉందిలే మంచి కాలం
ముందూ ముందూనా..!

జననాయకుడు..
ప్రియమిత్రుడు..
కింజరపు ఎర్రన్నాయుడు
జయంతి సందర్భంగా
నివాళి అర్పిస్తూ..

– ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

Leave a Reply