నాన్నంటే..
కాదోయ్ ముసలాడు
జీవిత పర్యంతం
నీ కోసమే మసలినోడు…
తన జీతం..జీవితం నువ్వై..
నీ ఉన్నతే తన నవ్వై…!
అమ్మంటే..
కానే కాదు ముసల్ది
ఆమె నీ చిన్ననాటి చద్ది..
నీ బతుకును చక్కదిద్ది..
నీ ముఖానికి రంగులద్ది
ఇప్పుడయిందా దద్ది..
అమ్మ అవ్వయ్యాక
బువ్వ కరువై..
బతుకు బరువై!
పాశ్చాత్యులు చిన్నప్పుడే పంపేసి అమ్మానాన్నలను
ఓల్దేజి హోముకు..
ఏడాదికోసారి చూసి వచ్చే అలవాటు ..గ్రహపాటు..
అందుకే వారికి మదర్స్ డే..
ఫాదర్స్ డే..ఎల్డర్స్ డే..
ఇలాంటి సంస్కృతి..
అనుకున్న మనకి ఇప్పుడు
పట్టుకోలేదా అదే వికృతి..
ఇదేనా మన ప్రాకృతి..
మన సంస్కారానికి
పట్టిన అపశృతి..!
అమెరికా వాడు అప్పుడప్పుడూ వెళ్ళినా
నగుమోముతో…
నువ్వు..ఆ నవ్వు బలవంతంగా
పులుముకునైనా వెళ్ళవే..
నువ్వే ఆ తల్లిదండ్రుల
దుస్థితికి విరించి..
అది మరచి ముఖం చిట్లించి
కళ్ళ నిండా చిరాకుతో
ముళ్ల మీద కూర్చున్నట్టు..!
బిడ్డ వేరే దేశంలో ఎన్నారై..
ఇక్కడ అమ్మానాన్న
కన్నీరు మున్నీరై..
మావాడు అమెరికాలో
అని చెప్పుకుంటూ గొప్పగా..
ఇక్కడ వారి బతుకులు చప్పగా..!
ఏడాదికో..రెండేళ్లకో ఓసారి వస్తావేమో..
లేదంటే తీసుకెళ్తావేమో..
తాతని..బామ్మని పరిచయం చేస్తూ అప్పుడు..
తెలియనీయక వారి
గుండె చప్పుడు!
ఇదంతా ఎందుగ్గాని..
ఒకనాటి నీ అమ్మానాన్న
ఇప్పుడు నీ దృష్టిలో మమ్మీడాడి…
నీ కోసం జీవితంలో ఓడి
నిన్ను గెలిపించారని గుర్తుంచుకో…
ఇప్పుడు నువ్వేమో ఇంద్రప్రస్థం
వారేమో వానప్రస్థం..
ఇప్పటికీ నోరు తెరిచి
అడగని అమ్మ….
తన వద్ద మిగిలింది కూడా
నీకే ఇచ్చేద్ధామని
తలపోసే నాన్న…
ఒకనాటి నీ విధాతలు
ఇప్పుడు బాగుండేట్టు చూడు
ఈ వయసులో
వారి తలరాతలు..!
-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286