తిట్లు.. వాపసు.. ఒక తలసాని!

– రేవంత్‌, బీజేపీపై తలసాని తిట్ల దండకం
– రేవంత్‌ను పొట్టోడన్న తలసాని
– పిసికితే పోతాడని వ్యాఖ్య
– బొట్టు పెట్టుకునే తాను హిందుత్వం నేర్చుకోవాలా అని పైర్‌
– ఆ తర్వాత దిద్దుబాటుకు దిగిన తలసాని
– తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానన్న తలసాని
– ఆవేదనతోనే ఆగ్రహించానని వివరణ
– తలసాని హుందాతనంపె సర్వత్రా ప్రశంసలు
– రాజకీయాల్లో పాతరోజులు గుర్తుకు తెచ్చిన తలసాని వైఖరి
– తర్వాత తలసానిపై రేవంత్‌ విసుర్లు
– తలసానికి పేడ పిసుక్కునే అలవాటుందని ఎద్దేవా
– తెలుగురాష్ర్టాల్లో అలవాటుగా మారిన తిట్ల రాజకీయం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇది కొడాలి నాని కాలం. అంటే తిట్ల కాలం. ఎదుటివాడిని ఎంత తిడితే అంత గొప్ప అనుకునే కాలమిది. టీవీ చానెళ్లలో కూడా చెప్పులతో కొట్టుకునే కాలం వచ్చింది. అయితే మారిన వాడే మనిషన్నది సామెత. అలాంటి దిద్దుబాటు ఈ తిట్ల యుగంలో భూతద్దం వేసి వెతికినా కనిపించదు. ఆవేశంలో ప్రత్యర్థిని తిట్టిపోసిన ఒక మంత్రి.. కొన్ని గంటల తర్వాత.. తమ నేతను కించపరిచారన్న ఆగ్రహంతో, నిగ్రహం కోల్పోయి.. తాను కూడా తిట్టడం జరిగిందని వివరణ ఇచ్చారు. తన మాటలు ఉపసంహరించుకుంటున్నట్లు హుందాగా ప్రకటించారు. అలా హుందాగా వ్యవహరించిన ఆయనేమీ.. ఆరుపదులు, ఏడుపదులున్న రాజకీయవేత్త కాదు. మంత్రిగా ఉన్న యువనేత. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న తెలంగాణ సీనియర్‌ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌.

టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలపై, తెలంగాణ సీనియర్‌ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ మాటలతో విరుచుకుపడ్డారు. ప్రధానంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పేరెత్తకుండానే ఆయనపై ఫైరయ్యారు. ‘‘ఆ పొట్టోని నోటికి బట్టనే లేదు. ఎమ్మెల్యే లేదు. మంత్రులు లేదు. అందరినీ వాడు వీడు అని సంబోధిస్తున్నాడు. పిసికితే పోతాడు’’అని తలసాని చేసిన వ్యాఖ్యలు మీడియా-సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

అయితే ఉదయం తన రాజకీయ ప్రత్యర్ధులపై, వీరావేశంలో విరుచుకుపడ్డ తలసాని.. సాయంత్రానికి దిద్దుబాటుకు దిగారు. ‘నా పార్టీ నేతలపై రేవంత్‌రెడ్డి పాదయాత్రలో చేసిన అనుచిత వ్యాఖ్యలు, వాడిన భాష, చేసిన విమర్శలకు ఆవేదన చెందా. బాధ్యతగల మంత్రిగా, నేను ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. పార్టీలు వేరైనా విమర్శలు అర్ధవంతంగా ఉండాలి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం సరైంది కాదు. ఇకనైనా బాధ్యతగా మాట్లాడుతూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. విమర్శకు ప్రతి విమర్శ కూడా అంతే కఠినంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాల’ని.. తలసాని తాను చేసిన వ్యాఖ్యల ఉపసంహరణకు కారణాలు వివరించారు.

దానితో తిట్లపర్వానికి తెరపడిందనుకున్న సమయంలో.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మళ్లీ తిట్ల దండకం అందుకుని, తిట్ల ఎపిసోడ్‌ను పొడిగించడం చర్చనీయాంశమయింది. పేడ పిసికే అలవాటున్న తలసాని, పిసుగుడు గురించే మాట్లాడతారని రేవంత్‌ మళ్లీ మాటలతుట్టెను కదిలించారు.

‘ఆయనకు అంత కోరికగా ఉంటే ఏం పిసకాలనుకుంటున్నారో తేదీ చెబితే వస్తా. ఎవరేం పిసుకుతారో చూద్దాం.కేసీఆర్‌ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా.. రేవంత్‌రెడ్డిని పిసకడమంటే? నేను పీసీసీ అధ్యక్షుడిని. తలసాని జీవితకాలం కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నా, కేటీఆర్‌ సంక నాకినా నా స్థాయికి రాలేరు’’ అని రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. ఆవిధంగా తిట్లు.. ఎదురుతిట్లు రాజకీయాలకు సోషల్‌మీడియా వేదికయింది.

అయితే.. ఈ ‘కొడాలినాని తిట్ల కాలం’లో కూడా, తాము చేసిన విమర్శలకు రియలైజయి.. తమ వ్యాఖ్యలు ఉపసంహరించుకునేంత హుందా రాజకీయాలు, మళ్లీ కనిపించడమే ఇక్కడ గొప్ప విషయం. మర్చిపోయిన ఆ సంస్కృతిని మళ్లీ ఆచరణలో పెట్టి, గుర్తుచేసిన తలసానిని ఎవరైనా అభినందించాల్సిందే. అది ఆహ్వానించదగ్గ పరిణామం కూడా. ఈ సాంప్రదాయం-హుందాతనం ఉమ్మడి రాష్ర్ట రాజకీయాల్లో ఒకప్పుడు కనిపించేవి. ఇప్పుడవి భూతదత్దం వేసి వెతికినా కనిపించడం లేదు. అదే దౌర్భాగ్యం.

ఓసారి అసెంబ్లీలో సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. నాటి విపక్ష నేత చంద్రబాబునుద్దేశించి, ఆయన తల్లిపై చేసిన వ్యాఖ్య అలజడి సృష్టించింది. ‘నేను నా తల్లి కడుపు నుంచి ఎందుకు వచ్చానా అని అనుకులేనా నిన్ను కడిగేస్తా చంద్రబాబూ’ అని వ్యాఖ్యానించారు. తర్వాత సభలో టీడీపీ సభ్యులు వైఎస్‌ వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు. దానితో వైఎస్‌ దిద్దుబాటుకు దిగి క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు హుందాగా ప్రకటించారు. ఈవిధంగా ఎంతోమంది మంత్రులు-ఎమ్మెల్యేలు, నిండుసభలో తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న సందర్భాలు లేకపోలేదు.

సభలో అధికార-విపక్షాలు ఎన్ని తిట్టుకున్నా.. సభ ముగిసిన తర్వాత, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఒకరి భుజంపై, మరొకరు చేతులు వేసుకునే దృశ్యాలు కనిపించేవి. సభలో కాంగ్రెస్‌పై విరుచుకుపడే నాటి టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, నాటి కాంగ్రెస్‌ సీఎంలు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్‌ఫండ్‌ మంజూరు చేసేవారు.

అసెంబ్లీ లాబీ-బయట కాంగ్రెస్‌-టీ డీపీ ఎమ్మెల్యేలు సభ బయట కులాసాగా కబుర్లు చెప్పుకునే దృశ్యాలు కనిపించేవి. కిరణ్‌కుమార్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ్ల నరేంద్ర, అమర్‌నాధ్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, దయాకర్‌రావు, శ్రీధర్‌బాబు, వేం నరేందర్‌రెడ్డి వంటి కాంగ్రెస్‌-టీడీపీ యువనేతలంతా ఒకరిపై మరొకరు జోకులు వేసుకునే దృశ్యాలు దర్శనమిచ్చేవి.

సభలో ఉద్రిక్త వాతావారణం ఏర్పడినప్పుడు, దానిని చల్లబరిచేందుకు ఇరుపక్షాల సీనియర్లు ప్రయత్నించే సంస్కృతి ఉండేది. ముఖ్యమంత్రి నుంచి కొందరు రాయబారులు, విపక్ష నేత నుంచి మరికొందరు రాయబారులు లాబీలో మాట్లాడుకుని, ఉద్రిక్త పరిస్థితిని చ ల్లబరిచే సంస్కృతి కనిపించేది.

సీఎంలు కూడా తమ వద్దకు వచ్చిన విపక్ష ఎమ్మెల్యేల వినతిపత్రాలపై స్పందించేవారు. వైఎస్‌ సీఎం, సురేష్‌రెడ్డి స్పీకర్‌గా ఉండగా.. విపక్షనేత చంద్రబాబును, నాటి సీనియర్‌ మంత్రి ఎం. సత్యనారాయణరావు పక్కన కూర్చోపెట్టి వైఎస్‌-బాబు మాట్లాడుకునే అవకాశం కల్పించడం ద్వారా, వారిద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం సృష్టించేవారు.

చంద్రబాబు సీఎంగా ఉండగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ.. తమ జిల్లా టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో వస్తున్న సమస్యల గురించి, ఫిర్యాదు చేసిన సందర్భాలు లేకపోలేదు. ఆరోగ్య సమస్యలు, ఆపరేషన్లకు సంబంధించి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇచ్చిన అర్జీలపై, చంద్రబాబు వెంటనే సంతకం చేసేవారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులయినా, టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడయినా.. రాజకీయాల్లో ఉన్న ప్రముఖుల కుటుంబాలకు గౌరవం ఇచ్చేవారు. వారికి ఏదైనా కష్టం వస్తే, పార్టీల బేధం చూడకుండా సాయం చేసేవారు. ఇది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పటిరాజకీయ స్వర్ణయుగం. ఇప్పుడు ముఖ్యమంత్రులు-ప్రధాన ప్రతిపక్షనేతలు ఎదురుపడితే, ముఖం తిప్పుకుని పక్కకువెళుతున్న పరిస్థితి.

విభజన తర్వాత, రెండు తెలుగు రాష్ర్టాల్లో బూతులు-తిట్లే.. రాజకీయమయిన దురదృష్టకర సంస్కృతి ప్రారంభమైంది. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ విషయంలో ప్రధమ స్థానంలో ఉండగా, తెలంగాణలో ఒకరికొకరు పోటీ పడే పరిస్థితి వచ్చింది. గతంలో కేసీఆర్‌ కూడా పవన్‌ సహా అందరిపైనా మాటల దాడి చేసిన వారే.

ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు చేసిన రాజకీయ హుందాతనాన్ని ఈతరం నేతలు అనుసరిస్తే మంచిదన్నది రాజకీయ విశ్లేషకుల ఉవాచ.

Leave a Reply