Suryaa.co.in

Telangana

సెవన్ స్టార్ ఫాంహౌజ్ నుండి తాంత్రిక భావాలతో పాలన చేస్తున్న వ్యక్తి కేసీఆర్

-తాంత్రికులు, మాంత్రికుల సూచనలతో పాలన నడుస్తోంది
-సాయంత్రం 4 గంటల తరువాత నడిచే సర్కార్ కొనసాగుతోంది
-60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు
-35 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే… ఎందుకు భర్తీ చేయడం లేదు?
-లిక్కర్ స్కాంలో కేసీఆర్ బిడ్డ హోటల్ కు ఎందుకు వెళ్లారు?
-1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ
-బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్‌చుగ్

తెలంగాణ సీఎం కేసీఆర్ తాంత్రిక భావాలతో పాలిస్తున్నారని బీజేపీ ఇన్చార్జి తరుణ్‌చుగ్ ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాంలో కూరుకున్న కే సీఆర్ కూతురు కవిత, హోటల్‌కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ ఇంకా ఏమన్నారంటే… గత రెండ్రోజుల నుండి తెలంగాణ పదాధికారులు, కార్యవర్గ సభ్యులు బీజేపీ ప్రజల్లోకి తీసుకుపోయే అంశంపై విస్త్రతంగా చర్చించారు. ఈ క్రమంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. నేను చాలా రాజకీయ పార్టీలను చూశాను. కానీ తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పైనున్న తీవ్ర వ్యతిరేకత మరెక్కడా లేదు. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ద్వేషం ఉంది. అహంకారంతో పనిచేస్తున్నారు. సెవన్ స్టార్ ఫాంహౌజ్ నుండి తాంత్రిక భావాలతో పాలన చేస్తున్న వ్యక్తి కేసీఆర్. ఈసారి కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమనే ధీమా చిన్నా పెద్దా తేడా లేకుండా తెలంగాణ ప్రజలందరూ భావిస్తున్నారు.

కేసీఆర్ సర్కార్ లెక్కలేనన్ని హామీలిచ్చి అమలు చేయలేదు. అందుకే ప్రజలంతా బీజీపి అధికారంలోకి తేవాలనుకుంటున్నారు. తెలంగాణ, ఏపీ విడిపోయినప్పుడు ఈ రాష్ట్రం ఆర్ధిక రంగంలో పరిపుష్టి చెందింది. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలవల్ల తెలంగాణ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత 8 ఏళ్లలో 5 లక్షల కోట్లకుపైగా అప్పు చేశారు. అయినా సెవెన్ స్టార్ ఫాంహౌజ్ లో నిద్రపోతూ కేసీఆర్ ప్రజలను పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ పాలనకు పోయే కాలం దాపురించింది. ప్రజలు ముహూర్తం కూడా నిర్ణయించేశారు. ఏనాడూ సచివాలయానికి వెళ్లని కేసీఆర్ బీఆర్ఎస్ పాలన పూర్తయ్యేలోగానైనా ఆ సచివాలయానికి వెళ్లాలని జనం కోరుతున్నారు. తెలంగాణలో సాయంత్రం 4 గంటల తరువాత నడిచే సర్కార్ కొనసాగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం మత్తులో ఊగుతోంది. రాచరిక పాలన చేస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ నాయకులపై కన్నేసి ఉంచాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. బండి సంజయ్ పాదయాత్రలో ఏం జరుగుతోంది? పాదయాత్రను ఎలా అడ్డుకోవాలా? అని కుట్రలు చేస్తోంది. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా, ఒత్తిళ్లు తెచ్చినా బీజేపీని ఆపలేరు.

తెలంగాణలో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నరు. యువకులు, దళితులు, ఉద్యోగులు, డాక్టర్లు, నిరుద్యోగులు, మహిళలు, రోడ్డున పడ్డారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు. 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదు. వడ్లు కొనుగోలులో కేసీఆర్ చేసిందేమీ లేదు. కిసాన్ సమ్మాన్ నిధిని మోదీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తోంది. కేసీఆర్ ను అడుగుతున్నా… రాష్ట్రంలో 35 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే… ఎందుకు భర్తీ చేయడం లేదు? టీచర్ లేని పాఠశాల ఎట్లా నడుస్తుంది? ఉపాధ్యాయులను రోడ్లపైకి ఈడుస్తున్నారు. తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే టీచర్లపై ఇంతటి దమనకాండా?

రాష్ట్రంలో వైద్యం అందడం లేదు. మోదీ ప్రభుత్వం దేశమంతా ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మందికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం కేంద్రం కల్పిస్తుంటే.. తెలంగాణలో మాత్రం అమలు చేయడం లేదు. డాక్టర్లు లేరు, నర్సులు లేరు. 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్య, వైద్య ఏమాత్రం అందడం లేదు. మహిళలపై, బాలికలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వాహనాల్లోనే అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో 50 శాతంపైగా మహిళలు రక్తహీనతతో జీవిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ మహిళల్లో 58 శాతం నిరక్షరాస్యులే. మహిళలపై అత్యాచారాలు చేస్తున్న వారిని కేసీఆర్ పాలనలో రక్షిస్తున్నారు. కేసీఆర్ పాలన తెలంగాణను అధ్వాన్న స్థితిలోకి తీసుకొచ్చింది. తెలంగాణ ఉద్యమంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మీరిచ్చిన బంగారు తెలంగాణ హామీ అమలు కాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. 26 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ. యువకులు రోడ్లపై తిరుగుతున్నారు. వాళ్లకు మొండిచేయి చూపుతున్న కేసీఆర్ తమ కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు ఇఫ్పించుకోవడంలో విజయవంతమయ్యారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఒక యువరాజు ఉంటే… కేసీఆర్ కుటుంబంలో యువరాజుతోపాటు యువరాణి ఉన్నారు.. కుటుంబ పాలనప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. కేసీఆర్ ను అడుగుతున్నా… తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నీ కొడుకు, నీ కూతురు, అల్లుడు, బంధువులు ఎక్కడ ఉన్నారు? నీ రాచరిక పాలనలో యువరాజు, యువరాణి నడిపిస్తున్న పాలన ఇది. తెలంగాణను లూటీ చేస్తున్నరు. ఎట్లా దోచుకోవాలి? దాచుకోవాలని చూస్తున్నరు. రాష్ట్రంలో తాంత్రికులు, మాంత్రికుల సూచనలతో పాలన నడుస్తోంది. తాంత్రికుడు చెప్పారని టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని జనం చర్చించుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఝులు. కేసీఆర్ సర్కార్ ను కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుల మద్యం కుంభకోణం తెలంగాణ బయట కూడా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు అర్ధం తెలంగాణతోపాటు ఢిల్లీలో, పంజాబ్ లో, దేశమంతా దోచుకోవడమే. లిక్కర్ స్కాంలో కేసీఆర్ బిడ్డ హోటల్ కు ఎందుకు వెళ్లారు? ఎవరితో మాట్లాడింది? మొబైల్ లో ఏయే వివరాలున్నాయి? ఆ ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారో ప్రజలకు తెలియాలి. దళిత బస్తీల్లో చదువుకున్న యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. దళిత బంధు పేరుతో దళితులను, గిరిజన బంధుతో గిరిజనులను మోసం చేస్తున్నారు. కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ మొదలైంది. బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకునే సమయం ఆసన్నమైంది.

తెలంగాణ ప్రజలంతా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని కోరుతున్నారు. దేశమంతా కాంగ్రెస్ పార్టీ ముగింపు దశలో ఉంది. వెంటిలేటర్ పై కొనసాగుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీంగా మారింది. జమ్మూ నుండి కాశ్మీర్ దాకా కాంగ్రెస్ నేత రోజుకొకరు బయటకు వెళుతున్నారు. కేసీఆర్ పట్ల ద్వేష భావం ప్రజల్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలి. బీజేపీ ప్రతి కార్యకర్త తెలంగాణ ప్రజల గొంతుకు కావాలి. ప్రతి బూత్ కు, బస్తీకి వెళ్లాలి. రాష్ట్రకార్యవర్గ సమావేశంలో 11 వేల కేంద్రాల్లో బీజేపీ బహిరంగ సభలు నిర్వహించాలి. కేసీఆర్ కుటుంబ అవినీతి, కుటుంబ, నియంత పాలననుండి విముక్తి కల్పించాలి.

ప్రజాసంగ్రామ యాత్రకు అద్బుత స్పందన వస్తోంది. పాదయాత్రను ఆపకండి. 6వ విడత యాత్రను ప్రారంభించండి. 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనూ యాత్ర కొనసాగాలి. అట్లాగే ప్రజల గోస-బీజేపీ భరోస, శక్తి కేంద్రాల్లో బహిరంగ సభల ద్వారా కేసీఆర్ పాలనను తరిమికొట్టాలి. కేసీఆర్ బైబై అని ప్రజలు నిర్ణయించుకున్నారు. తెలంగాణను కేసీఆర్ అవినీతి కుటుంబ పాలననుండి విముక్తి కలిగించాలి. బీజేపీ ఒక్కో కార్యకర్త 9 నెలలు నిద్రపోకుండా నిర్విరామంగా కృషి చేయాలి.

LEAVE A RESPONSE