-గెలుపు గుర్రాలకే టికెట్లు
-పొత్తులో ఒక్క సీటూ ఓడకూడదు
– సర్వేలతో మరోసారి టీడీపీ-బీజేపీ-జనసేన కుస్తీ
– బాబు ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి షెకావత్, పవన్ కల్యాణ్
– 8 గంటలపాటు ఏకబిగిన చర్చలు
– బీజేపీకి 6 ఎంపీ-10 అసెంబ్లీ
– బీజేపీకి 1 ఎంపీ, 3 అసెంబ్లీ సీట్లిచ్చిన జనసేన
– అదనంగా మరో అసెంబ్లీ కేటాయించిన టీడీపీ
– మొత్తం 8 పార్లమెంటు, 31అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ-జనసేన పోటీ
– ఓటు బదిలీ కావడ మే ఉమ్మడి లక్ష్యం
– బాబు నివాసంలో భేటీ అయిన మిత్రపక్ష నేతలు
– ముగిసిన సీట్ల సర్దుబాటుపర్వం
– వైసీపీ అనుకూల ఐపిఎస్-ఐఏఎస్ అధికారులపై చర్చ
– వారి జాబితా తీసుకున్న షెకావత్
– బీజేపీ-జనసేన సీట్లపై ముందే చెప్పిన ‘సూర్య’
– నిజమైన ‘సూర్య’ వార్తా కథనం
( మార్తి సుబ్రహ్మణ్యం)
టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు సర్దుబాటు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన కీలకభేటీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన టీడీపీ-జనసేన సీట్ల త్యాగం చేయడం విశేషం. మొత్తం 31 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాల్లో జనసేన-బీజేపీ పోటీ చేయనున్నాయి.
అంటే బీజేపీ 10 అసెంబ్లీ-6 లోక్‌సభ స్థానాలు, జనసేన 21 అసెంబ్లీ-2 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. తాజాగా టీడీపీ తన కోటా నుంచి, ఒకటి బీజేపీకి కేటాయించింది. దీనితో సీట్ల సర్దుబాటు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. కాగా బీజేపీ-జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తాయన్న దానిపై సూర్య’ ముందే వెల్లడించడం గమనార్హం.
అమరావతిలోని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసానికి వచ్చిన కేంద్రమంత్రి షెకావత్, బీజేపీ జాతీయనేత బై జయంత్, జనసేన దళపతి పవన్ కల్యాణ్ దాదాపు 8 గంటలసేపు పొత్తు-సర్దుబాటు-ప్రచార వ్యూహం-పొత్తులో అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేశారు. ఆమేరకు మూడు పార్టీల నేతలు, తమ వద్ద ఉన్న సమాచారం- సర్వే వివరాలను పంచుకున్నారు.
పొత్తులో ఎవరికి సీటు వచ్చినా, అది గెలుపు గుర్రమే అయి ఉండాలని, ఎట్టి పరిస్థితిలో ఆ సీటు వైసీపీకి వెళ్లకూడదని మూడు పార్టీలు నిశ్చితాభిప్రాయానికి వచ్చాయి. ఈ విషయంలో పంతాలు-పట్టింపులు అవసరం లేదని, గెలుపే ప్రాతిపదిక కావాలని నిర్ణయించారు. అవసరమైతే పలు స్థానాలలో పోటీ చేసే అభ్యర్ధుల మార్పు చేర్పులకూ సిద్ధంగా ఉండాలని, కుల-మతం-ప్రాంతం ప్రాతిపదికన సీట్ల ఎంపిక ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు ఐఏఎస్-ఐపిఎస్ అధికారుల తీరుపై సమావేశంలో సీరియస్‌గా చర్చ జరిగింది. వారిలో కొందరు కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్ వచ్చిన వారి వ్యవహారశైలిపైనా చర్చించినట్లు తెలుస్తోంది. వారిపై తాము ఇప్పటికే వివిధ సంస్థలకు ఫిర్యాదు చేశామని కేంద్రమంత్రికి చెప్పారు.
ఎన్నికల సమయంలో మిత్రపక్షాలకు సదరు అధికారులు ప్రతిబంధకాలు సృష్టించే ప్రమాదం ఉందని, దానికి సంబంధించి తాము ఇప్పటికే ఒక జాబితా తయారు చేశామని చంద్రబాబు-పవన్, కేంద్రమంత్రి షెకావత్‌కు వివరించారు. అందులో కీలకస్థానాల్లో ఉన్న ఐదుగురు ఐఏఎస్, వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్న 13మంది ఐఏఎస్ అధికారులు ఉన్నట్లు సమాచారం.
దానికి స్పందించిన కేంద్రమంత్రి షెకావత్ వాటి వివరాలు ఆరా తీసి, తనకు ఆ జాబితా ఇవ్వాలని కోరారు. ఆమేరకు వారు తమ వద్ద ఉన్న వైసీపీ అనుకూల అధికారుల జాబితాను, షెకావత్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి.. వైసీపీకి ఇప్పటివరకూ పూర్తి అనుకూలంగా ఉన్న సదరు అధికారులకు, కోడ్ వచ్చిన తర్వాత స్థానభ్రంశం తప్పదని స్పష్టమవుతోంది. గత ఎన్నికల ముందు కూడా ఇలాగే డీజీపీ, ఇంటలిజన్స్ ఏడీజీ, సీఎస్‌ను తప్పించిన విషయం తెలిసిందే.