-కులాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు కుట్ర
-ఒకరి భుజం మీద తుపాకీ పెట్టి మరొకరిని కాల్చడం చంద్రబాబు నైజం
-చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి..
-స్పీకర్‌పై, దళిత ఎమ్మెల్యేపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా..
-సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున
అసెంబ్లీ: రాష్ట్రంలో అలజడి సృష్టించాలని, కులాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని, ఒకరి భుజం మీద తుపాకీ పెట్టి మరొకరిని కాల్చడం చంద్రబాబు నైజమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాజ్యాంగ మీద ప్రమాణం చేసి మరీ ఆ స్ఫూర్తికి విరుద్ధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి ఏడ్చి వెళ్లిపోయి.. బయట ఉండి అమాయకుడైన టీడీపీ దళిత శాసనసభ్యుడిని అడ్డంపెట్టి స్పీకర్‌పైనే దాడికి పురిగొల్పాడని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, వైయస్‌ఆర్ సీపీ దళిత శాసనసభ్యుడు సుధాకర్‌బాబుపై శాసనసభలో టీడీపీ సభ్యులు చేసిన దాడిని మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి నాగార్జున మాట్లాడారు. ‘‘చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలి. ప్రభుత్వ తప్పిదాలు ఉంటే ధైర్యంగా నిలదీస్తే దానికి సమాధానం చెబుతాం. కానీ, తన పార్టీ శాసనసభ్యులను పంపించి పోడియం మీదకు ఎక్కించి చివరకు స్పీకర్‌పైనే దాడికి పురిగొల్పాడంటే.. ఏదో రకంగా ఘర్షణ సృష్టించాలని, రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే కుట్ర తప్ప వేరే ఏమీ లేదు.
అధికారం అప్పనంగా కాజేయాలని చంద్రబాబు ఆలోచన, ఆకాంక్ష. దానిలో భాగంగానే ఈ కుయుక్తులు పన్నుతున్నాడు. స్పీకర్‌పై దాడిని అడ్డుకున్న అధికార పార్టీ దళిత ఎమ్మెల్యేలపై దాడి చేయించాడు. సుధాకర్‌బాబు ఏం తప్పుచేశాడని దాడి చేశారు..? స్పీకర్‌పై దాడిని అడ్డుకున్న సుధాకర్‌బాబును కిందపడేసి కొడతారా..? ఉపముఖ్యమంత్రిని బూతులు తిడతారా..? టీడీపీ సభ్యులు ఏ ఆలోచనతో చట్టసభలకు వచ్చారో.. ఏ దుర్బుద్ధితో సభలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో.. ప్రజలంతా గమనించాలి. టీడీపీ సభ్యులు రాజ్యాంగ వ్యవస్థనే అపహాస్యం చేశారు.
చంద్రబాబు కుయుక్తులు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు.. రానున్న ఎన్నికల్లో తిప్పికొడతారు. చట్టసభలో ఈరోజు జరిగిన దారుణాన్ని ప్రజలు గమనించాలని కోరుతున్నాను. దళితులకు, బీసీలకు మధ్య చిచ్చుపెడుతున్నాడు. అది గమనించాలని రాష్ట్ర ప్రజలకు, టీడీపీలోని నేతలను కోరుతున్నా’’ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.