Home » కాకాణిపై సర్వేపల్లి ప్రజల్లో తిరుగుబాటు

కాకాణిపై సర్వేపల్లి ప్రజల్లో తిరుగుబాటు

-కల్తీ మద్యంతో ఏడుగురి ప్రాణాలు పోయినా మార్పు లేదు
-ఇప్పుడు మళ్లీ మద్యం కేసుల్లో 15 మంది జైలుకు పోయారు
-ఇంటి బిడ్డలా ఆదరిస్తున్న ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటా
-టీడీపీ రాగానే రీ సర్వేతో పాటు ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ రద్దు
-సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పనబాక లక్ష్మితో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పర్యటించారు. వారి ప్రచారానికి చిన్నచెరుకూరు వాసులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించేందుకు ఎన్నడూ లేని విధంగా ప్రజలే ప్రచారం చేస్తున్నారు. ఇంటి బిడ్డలా ఆదరిస్తున్న సర్వేపల్లి ప్రజలకు రుణపడి ఉంటా. నెలరోజుల నుంచి నిరాటంకంగా టీడీపీలోకి చేరికలు జరగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి 5 వేల కుటుంబాలు చేరాయి. సర్వేపల్లి నియోజ కవర్గంలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీ, కక్ష సాధింపులు, అక్రమ కేసులే అందుకు కారణం.

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు
ప్రజల పాలిట శాపంగా మారిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం. రీ సర్వే పేరుతో అన్న ఆస్తిని తమ్ముడి పేరుతో, తమ్ముడి ఆస్తిని అన్న పేరుతో మార్చేశారు. 2 ఎకరాల పొలముంటే రికార్డుల్లో 1.60 ఎకరాలే చూపుతున్నారు. ఇదేందయ్యా అంటే తమకు సంబంధం లేదని సమాధానమిస్తున్నారు. వైఎస్సార్‌ జగనన్న భూరక్ష పేరుతో మన పొలాల్లో వారి పేర్లున్న రాళ్లను హద్దులుగా నాటుతున్నారు. మనకు తాతలిచ్చిన భూములు, కష్టపడి కొనుగోలు చేసిన పొలాల పాసు పుస్తకాల్లో జగన్మోహ న్‌ రెడ్డి ఫొటోలు వేసుకుంటున్నారు. ప్లాట్లు, భూములు కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే స్టాంప్‌ పేపర్లు వాళ్ల దగ్గర పెట్టుకుని మనకు జెరాక్స్‌ కాగితాలు ఇస్తారంట. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదు. ఐదేళ్లుగా రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది.

నియోజకవర్గంలో మాఫియా రాజ్యం
ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే కొందరు తహసీల్దార్ల సహకారంతో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇద్దరు తహసీల్దార్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. భూకుంభకోణాల్లో ఐదుగురు జైళ్లకు పోయారు. 2014లో కల్తీ మద్యంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయేం దుకు కారణమైన కాకాణిలో మార్పు కరువైంది. అప్పట్లోనూ ఆయన జైలుకు పోకుండా అనుచరులను, సహచ రులను పంపాడు. ఈయన కేసుల్లోనే ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌ అప్పూ జైలులోనే చనిపోయాడు. ఇప్పుడు మళ్లీ అక్రమంగా మద్యం నిల్వ చేసి 15 మందిని జైలుకు పంపాడు. ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తి ప్రజాజీవితం లోకి రావడం దురదృష్టకరం. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. రాక్షసపాలనపై సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సరైన తీర్పు ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాగానే రీ సర్వేను రద్దు చేయడంతో పాటు పొలాల్లో నాటిన రాళ్లను పీకిపారేస్తాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేయడంతో పాటు జగన్మోహన్‌ రెడ్డి ఫొటోలున్న పాసుపుస్తకాల స్థానంలో కొత్త పుస్తకాలిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply