పెట్రోల్ బంక్ ల వద్ద వాహనాల హారన్ లతో హోరెత్తించిన టీడీపీ శ్రేణులు

– రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ శ్రేణులు నిరసనలు
– పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలని డిమాండ్
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, వాహనదారులతో కలిసి పెట్రోల్ బంకుల వద్ద వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అందరు పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని బిగ్గరగా హారన్స్ మోగిస్తూ పెట్రోలు,డీజిల్ ధరల పెంపుపై జగన్ రెడ్డి విధానాల్ని ఎండగట్టారు. అన్ని నియోజకవర్గాలలో పెట్రోలు బంకుల వద్ద ద్విచక్ర వాహనాలతో హారన్స్ మోగించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో దొంగ నిద్ర నటిస్తున్న జగన్‌రెడ్డికి వాహనాల హారన్స్ మోతతో మెలుకువ రావాలని సౌండ్స్ చేశారు. పెట్రో ధరలు ఎక్కువ ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు రావని ప్లకార్డుల ప్రదర్శిస్తూ వినాదాలు చేశారు. ప్రధాన కూడళ్ళ నుంచి పెట్రోలు బంకుల వద్దకు ర్యాలీగా వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తానని ప్రజలకు జగన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించినా ఏపీలో తగ్గించకుండా ప్రజలకు మొండిచేయి చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరల తగ్గించే వరకు ప్రజా పోరాటం ఆగదన్నారు. మన రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లు ఏ రాష్ట్రంలోనూ లేవు.. జగన్ రెడ్డి దెబ్బకి దేశంలోనే ఏపీ నెంబర్ 1.. బాదుడే.. బాదుడు అంటోందని ఆరోపించారు. అధిక డీజిల్ ధరల వల్ల ఖర్చులు పెరిగి సాగు దెబ్బతింటోందని, రవాణా ఖర్చులు పెరిగి సరకుల ధరలు పెరుగుతున్నాయన్నారు.
ఈ రోజు పెట్రోల్ ధర రూ. 110.35 ఉంటే అందులో జగన్ రెడ్డి ప్రభుత్వం రూ. 39.76 పన్ను వసూలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై 23 రాష్ట్రాలు తమ వంతుగా పన్నులు తగ్గించుకుంటే ఈ ప్రభుత్వం ఎందుకు పన్నులు తగ్గించడం లేదని ప్రశ్నించారు. దేశంలోనే పెట్రోల్, డీజీల్‌పై అత్యధిక వ్యాట్ జగన్ రెడ్డి సర్కారు మాత్రమే వసూలు చేస్తోందన్నారు. గత రెండున్నరేళ్లల్లో పెటోల్, డీజిల్‌పై రూ. 28 వేల కోట్ల పన్నులు వసూలు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు. రోడ్ డెవలప్‌మెంట్ సెస్ పేరుతో లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూపాయి అదనంగా వసూలు చేస్తున్నారు.
అయినప్పటి రాష్ట్రంలో ఎక్కడా రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవు. ఈ పెట్రో ఆదాయం మొత్తం ఏమైందని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావు, ఉద్యోగాలు, ఉపాధి రాదన్నారు. రవాణా రంగంపై ఆధారపడ్డ లక్షలాది మంది కార్మికుల జీవనం అస్తవ్యస్థం అవుతుందన్నారు. జగన్ రెడ్డి అవినీతి, దుబారా, చేతకాని విధానాల వల్లనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని విమర్శించారు.
విజయనగరం జిల్లా
పార్లమెంట్ అధ్యక్షులు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సాలూరు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్కార్పియో వాహనాన్ని తాళ్ళతో లాగి నిరసన తెలిపారు. కురుపాం నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు స్థానిక పార్టీ శ్రేణులు, వాహనదారులతో కలిసి పాల్గొన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ బేబినాయన భారీ వాహన ర్యాలీ నిర్వహించి పెట్రోలు బంకు వద్ద నిరసన తెలిపారు. మిగిలిన అన్ని నియోజకవర్గాలలో ఆయా ఇన్‌చార్జుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
విశాఖపట్నం జిల్లా
మాడుగుల నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీవీజీ కుమార్ గారి ఆధ్వర్యంలో మోటర్ సైకిల్‌కి తాడు కట్టి మనుషులతో లాగించి నిరాశ తెలియజేశారు. నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు రాజేష్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్కూటర్‌కు చక్రాలు ఊడదీసి సైకిల్ చక్రాలు బిగించి ఇక ఈ పెట్రోలు ధరలతో స్కూటర్ నడపలేమని నిరసన తెలియజేశారు. యలమంచిలి నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. భీమిలిలో కోరాడ రాజాబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా
రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం జరిగింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి 3 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ స్థానిక పెట్రోలు బ్యాంకు వద్దకు చేరుకుని భారీ ఎత్తున నిరసనలు తెలియజేశారు. మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించి స్థానిక పెట్రోల్ బంకు వద్ద నిరసన తెలిపారు. కొత్తపేట, రాజోలు, గన్నవరం, రామచంద్రపురం, ముమ్మడివరం నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. అమలాపురంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలపడానికి ప్రయత్నించగా.. స్థానిక ఎస్.ఐ, సి.ఐ అడ్డుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా
ఏలూరులో టీడీపీ ఇన్‌చార్జ్ బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సాక్షి పత్రికలో వైసీపీ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ అదే పేపర్‌తో చెత్తను సేకరించే వాహనాన్ని తుడిచి నిరసన తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులందరూ బైక్ ర్యాలీ చేస్తూ హారన్ మోగిస్తూ నిరసన తెలిపారు.
కృష్ణా జిల్లా
విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పంచుమర్తి అనురాధ, గద్దె అనురాధ, గన్నే ప్రసాద్‌లు పాల్గొన్నారు. ధర్నాచౌక్‍లో నిర్వహించిన ఆంళోనలో టీడీపీ నేత బోండా ఉమా పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేశారు. గన్నవరంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బైక్ హారన్లతో చెన్నై-కోల్‍కతా జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా టీడీపీ కార్యాలయం నుంచి పెట్రోల్ బంక్ వరకు బైక్ లను తోసుకుంటూ వెళ్లి నిరసన తెలిపారు. గుడివాడలో టీడీపీ శ్రేణులు పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించి పెట్రోల్ బంక్‍ల ముందు నిరసనలు తెలిపారు. కొండపల్లిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా గారు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని తెనాలిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి-గుంటూరు బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలిపారు. పొన్నూరులో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేమూరు నియోజకవర్గంలో మాజీ ఎంపీపీ కనకాల మధుసూధన్ వినూత్నంగా పెట్రోలు ధరలు తగ్గించాలని దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. నరసరావుపేటలో టీడీపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా.చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు వినుకొండ రోడ్ జంక్షన్ వద్ద ఉన్న పెట్రోల్ బంకు వద్ద ఎదుట రోడ్ పై బైఠాయించి నిరసన తెలియజేశారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీప పెట్రోల్ బంక్ వద్ద టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. డీజిల్‍పై వ్యాట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు లాడ్జీ సెంటర్‍లో కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి పెట్రోల్, డీజిల్‍పై వ్యాట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లా
తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పెట్రోల్, డీజిల్ పంపుకు పూలమాల వేసి టెంకాయ కొట్టి నిరసన తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
కడప జిల్లా
కడపలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని నిరసన తెలపడానికి వెళ్ళుతున్న పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ లు బి.టెక్ రవి, పుట్టా సుధాకర్ యాదవ్, అమీర్ బాబు, జీవి ప్రవీన్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శలు గోవర్ధన్ రెడ్డి, బాలిశెట్టి హరిప్రసాద్, వి.ఎస్ ముక్తియర్, రాష్ట్ర హెచ్‌ఆర్‌డి సభ్యులు భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డిలను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పార్లమెంట్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసుల రెడ్డిని నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందులలో పెట్రోల్ బంక్ వద్ద ధర్నా చేస్తున్న టీడీపీ నేతలు రామగోపాల్ రెడ్డి, ఇతర నేతలను అరెస్టు చేశారు.
నెల్లూరు జిల్లా
సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణం మేనకూరు పెట్రోల్ బంక్ ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని స్థానిక టీడీపీ నాయకులు వాహదారులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి, గూడురు, సర్వేపల్లిలో ప్రధాన కూడళ్లలోని బంకుల వద్ద నిరసన కార్యక్రమాలను నిర్వహించి పెట్రోలు ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో కొత్తచెరువు మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. హిందూపురంలో టీడీపీ నాయకులు, వాహనదారులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధర్మవరంలో స్థానిక నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి పెట్రోలు బంకు వద్ద నిరసన తెలిపారు.