బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం రగిలించిన విప్లవ జ్యోతి పూలే

టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి, వారిలో చైతన్యం రగిలించిన విప్లవ జ్యోతి మహాత్మజ్యోతిరావు పూలే అని టీడీపీ నేతలు అన్నారు. పూలే వర్దంతి సంధర్బంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ నేతలు పూలే చిత్రపటానికి పూలమాళలు వేసి నివాళి అర్పించారు. అనంతరం టీడీపీ జాతీయ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మాట్లాడుతూ…..

సాంఘిక సమానత్వం,సామాజిక న్యాయం అంటూ ఆలోచించి ప్రబోధించి బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడి, సాధికారతకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతి రావు ఫూలే. దేశం ప్రగతిపధంలో నడవాలన్నా, త్వరితగతిన సమాజంలో మార్పు రావాలన్నా అది కేవలం విద్య ద్వారానే సాధ్యమని తలచి తన భార్య సావిత్రిబాయి పూలేను చదివించి బాలికల పాఠశాలను ఏర్పాటుచేశారు. ఆమె ద్వారా స్త్రీలకు విద్యను నేర్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సాంఘిక విప్లవకారుడు, రైతాంగ ఉద్యమాలను నడిపారు, మిల్లు కార్మికుల కోసం పోరాడారు. నేటి సమాజంలో ఫూలే లాంటి విప్లవ కారులు ఎంతో అవ‌స‌రం. నేను, నా కుటుంబం బాగుంటే చాలు..సమాజం ఎటు పోతే నాకేంటి అనుకునే రోజులు ఇవి. కానీ ఆరోజుల్లోనే ఫూలే మాత్రం.. నేను అంటే నా స‌మాజం కూడా అని న‌మ్మారు. అందులో భాగంగానే అట్టడుగు వర్గాల ప్రజలల్లో చైతన్యం రగిలించారు. అలాంటి మహానీయున్ని నేటి త‌రం స్ఫూర్తిగా తీసుకోవాలని అశోక్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, ప్రొఫెసర్ యామిని, హెచ్ ఆర్డీ సభ్యులు రాజేంద్రప్రసాద్, ఎస్పీ సాహెబ్, ఆహ్వాన కమిటీ సభ్యుడు హసన్ భాషా, పార్టీ సీనియర్ నేతలు దేవినేని శంకర్ నాయుడు, గోళ్ల ప్రసాద్ మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.