ఇప్పుడు వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమికి (2019, 2024) తెలుగుదేశం సిద్ధమౌతోంది!
తెలుగుదేశం పార్టీ చివరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి. ఆయన టీడీపీ చరిత్రలో ‘సుదీర్ఘ కాలం’ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన మామ గారైన నందమూరి తారక రామారావు గారిని అన్యాయంగా, దుర్బుద్ధితో గద్దెదించిన సమయంలోనే టీడీపీ నాయకత్వాన్ని అప్రజాస్వామికంగా గుంజుకుని, కైవసం చేసుకున్నారు నారా వారు.
ఈ దుర్మార్గం జరిగినప్పటి నుంచీ టీడీపీ ఈ ‘శాశ్వత మాజీ హైటెక్ ముఖ్యమంత్రి’ సొంత ఆస్తిగా మారిపోయింది. ఎన్టీఆర్ ఆయుష్షును హఠాత్తుగా తగ్గించేసిన ఆ సమయం 1995 ఆగస్ట్–సెప్టెంబర్ మాసాలు. అఖిలాంధ్ర ప్రజానీకానికి ‘అన్న’గా మారిన ఎన్టీఆర్ చేతుల నుంచి ముఖ్యమంత్రి పదవి, తెలుగుదేశం నాయక్వం చంద్రబాబుకు చిక్కి ఇప్పటికి 28 సంవత్సరాలు గడిచాయి.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ దేశంలో అమలులో ఉన్న కారణంగా సీఎం పదవి చంద్రబాబు చేతుల నుంచి కొనేళ్లకు పోయింది. పార్టీ పదవి మాత్రం ‘శాశ్వతంగా’ ఆయన దగ్గరే ఉండిపోయింది. ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉంటూ, 31 ఏళ్ల వయసు దాటిన చంద్రబాబు నాయుడుకు తన మూడో కుమార్తెనిచ్చి 1981 సెప్టెంబర్ 10న నాటి మద్రాస్ నగరంలో వివాహం జరిపించారు రామారావు గారు. 14 ఏళ్ల తర్వాత ‘ఫలితం’ అనుభవించి ప్రభుత్వ రాజకీయ పదవి, తాను స్థాపించిన తెలుగుదేశం అధ్యక్ష పదవిని కోల్పోయారు నందమూరి వారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ నేతృత్వంలో రెండుసార్లు టీడీపీకి వరుస విజయాలు
చంద్రబాబు నాయుడు గారు ఇంకా అధికారికంగా తెలుగుదేశంలో చేరినట్టు ప్రకటించని రోజుల్లో– అంటే ఎన్టీ రామారావు గారు తాను పార్టీ స్థాపించిన ఐదేళ్ల లోపే చరిత్రాత్మక ఎన్నికల విజయాలు నమోదు చేసుకున్నారు. టీడీపీ పార్టీ పెట్టిన 9 నెలలకే జరిగిన 1983 జనవరి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రామారావు అధ్యక్షతన ఉన్న ఈ పార్టీ 202 సీట్లతో ఘన విజయం సాధించింది.
తర్వాత 1984 ఆగస్ట్ సంక్షోభం (మొదటిది), తర్వాత కొద్ది మాసాలకు నాటి ప్రధాని ఇందిరా గాంధీ గారి హత్య కారణంగా (ముఖ్యమంత్రి పదవిని రెండోసారి అధిష్ఠించిన కొద్ది మాసాలకు) రామారావు 1984 డిసెంబర్ లో ఏపీ అసెంబ్లీని మూడేళ్ల ముందే రద్దుచేయించి 1985 ఆరంభంలో మధ్యంతర ఎన్నికలు జరిపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ నాయకత్వంలోని టీడీపీ 202 సీట్లు గెలుచుకుంది. ఇలా ఆయన వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన నేతగా చరిత్రలో నిలిచిపోయారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా టీడీపీ గెలిచిన ఏకైక ఎలక్షన్ 1999
మామ గారి నుంచి పార్టీ ప్రెసిడెంట్ పదవిని, సీఎం పదవిని అప్రజాస్వామిక పద్ధతిలో గుంజుకున్న చంద్రబాబు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు 1999 సెప్టెంబర్ 4, 11 తేదీల్లో (వాస్తవానికి మూడు నెలలు ముందు జరపించిన ఎన్నికలివి) లోక్ సభతో పాటు జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. అదీ, ఎన్టీఆర్ గెలిచిన మాదిరిగా మూడింట రెండు వంతుల మెజారిటీతో కాదు. 294 సీట్లకు 181 మాత్రమే టీడీపీ సాధించింది.
తన నాయకత్వంలో వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుందన్న చంద్రబాబు అంచనా తప్పని 2004 ఏప్రిల్–మే అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న నారా వారు మరోసారి 2009 శాసనసభ ఎన్నికల్లోనూ పరాజయం చవిచూడాల్సి వచ్చింది.
మళ్లీ అప్పటికి పదేళ్ల తర్వాత తాను విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా ఉండగా జరిగిన 2019 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తన చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరగని ఘోర పరాజయం మూటగట్టుకుని, కుప్పకూలిపోయింది.
గత నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండగలా సకలాంధ్ర ప్రజానీకానికి సంక్షేమం, సంతోషాలను అందిస్తూ సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరో చరిత్రాత్మక విజయం 2024 మే మాసంలో సాధించడానికి వేగంగా అడుగులేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరుగులేని విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని అన్ని ఎన్నికల సర్వేలూ స్పష్టంగా సూచిస్తున్నాయి.
మరి ఈ నేపథ్యంలో–చంద్రబాబు గారి నాయకత్వంలో వరుసగా రెండో ఓటమిని తన ఖాతాలో వేసుకోవడానికి టీడీపీ మానసికంగా సిద్ధమౌతున్నట్టు కనిపిస్తోందని రాజకీయ, ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకు ముందు వరుసగా 2004, 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని పరాజయం బాట నడిపించిన చంద్రబాబు గారు రెండోసారి ఆ పని చేయబోతున్నారు. 2019లో పార్టీని ఓటమి బాట పట్టించిన నారా వారు 2024 వేసవిలో కూడా అదే ఫలితం చవిచూడబోతున్నారు. ఇలా పరాజయాల్లో కొత్త రికార్డును నమోదు చేయడానికి ‘చంద్రగిరి చంద్రన్న’ సిద్ధమౌతున్నారు.
వి. విజయసాయిరెడ్డి
(రాజ్యసభ సభ్యులు)