-హవనూర్, వెంకట స్వామి, కాంతారాజ కమిషన్ నివేదికలపై సుదీర్ఘ చర్చ
-సుప్రీమ్ కోర్టు తీర్పుల దరిమిల లోతుగా అధ్యయనం
-సుప్రీమ్ కోర్టు నిర్దేశించిన ‘త్రిబుల్ టెస్ట్’ కొలమానాల దిశగా కొనసాగించిన సమాలోచనలు
-మెథడాలజీ, ప్రశ్నావళి, అవలంభించిన పద్దతులపై సమగ్ర సమాచార సేకరణ
-ఉన్నత కోర్టు వివిధ తీర్పులు, పలు కమిషన్ నివేదికల లోని సిఫార్సుల ఆధారంగా 5 గంటలకు పైగా కొనసాగిన సమావేశం
సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలు, సంప్రదాయ వృత్తులలో బి.సి.ల వాస్తవిక జీవన స్థితిగతులను, వెనుకబాటు తనాన్ని, నిర్దిష్టంగా సమాచారాన్ని సేకరించడానికి తెలంగాణ బి.సి. కమిషన్ కసరత్తు ను వేగవంతం చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులలో ఇచ్చిన “టర్న్స్ ఆఫ్ రెఫరెన్సు” కు అనుగుణంగా ఆ రాష్ట్ర బి.సి. కమిషన్ అధ్యయనం మొదలు పెట్టింది. అందులో భాగంగా బుధవారం నాడు కర్ణాటక బి.సి. కమిషన్ తో సుదీర్ఘంగా సమావేశం అయ్యింది. తెలంగాణ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు సారధ్యం లో సభ్యులు సి.హెచ్. ఉపేంద్ర, శుభప్రధ్ పటేల్ నూలి, కె. కిశోర్ గౌడ్ ల బృందం, కర్ణాటక బి.సి. కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్లే, సభ్యులు రాజశేఖర్ బి.ఎస్.., కళ్యాణ్ కుమార్ హెచ్.ఎస్., సువర్ణ కె.టి., అరుణ్ కుమార్, శ్రీమతి శారద నాయక్, సభ్య కార్యదర్శి కె.ఎ. దయానంద్, ఐ.ఎ.ఎస్. ల తో సమావేశం అయ్యారు, సుదీర్ఘ సమాలోచనలు చేశారు. ఈ సమావేశం నెం. 16- డి, 2 వ అంతస్తు, డి. దేవరాజ్ ఆర్స్ భవన్, మిల్లర్స్ ట్యాంక్ బెడ్ ఏరియా, వసంత్ నగర్, బెంగళూరు లో గల కర్ణాటక బి.సి. కమిషన్ కార్యాలయం లో జరిగింది. ఉదయం 10:30 గంటలకు ఆరంభమైన సమావేశం సుదీర్ఘంగా 5 గంటల పాటు కొనసాగింది.
గత కర్ణాటక బి.సి. కమిషన్లు అయిన హవనూర్, వెంకట స్వామి, కాంతారాజ మున్నగునవి చేపట్టిన సమగ్రసర్వే పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బి.సి. రేజర్వేషన్ల కొనసాగింపులో సుప్రీమ్ కోర్టు నిర్దేశించిన “త్రిబుల్ టెస్ట్” కొలమానాల నేపధ్యంగా ఇరు కమిషన్లు ప్రత్యకంగా చర్చించాయి. ఉత్పన్నమైన న్యాయపరమైన సమస్యలు, కార్య క్షేత్రం లో ఎదుర్కున్న ఇబ్బందులను, ఇతరత్ర అంశాలపై వివరాలను సేకరించారు. పరిష్కార మార్గాలను అడిగి తెలుసుకున్నారు. గత కర్ణాటక కమిషన్లు రూపొందించిన మెథడాలజీ, ప్రశ్నావళి, అవలంబించిన పద్దతులపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను, ఉత్తర్వులను, చట్టాలను, కర్ణాటక బి.సి. కమిషన్ నుండి సేకరించారు.
ఉదయం కమిషన్ కార్యాలయం చేరుకున్న తెలంగాణ బి.సి. కమిషన్ చైర్మన్, సభ్యులను కర్ణాటక కమిషన్ సాదరంగా ఆహ్వానించింది. సమావేశం అనంతరం తెలంగాణ చైర్మన్, సభ్యులకు శాలువాలతో, పుష్ప గుచ్చాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
మరో 3 రోజుల పాటు తెలంగాణ బి.సి. కమిషన్ చైర్మన్, సభ్యులు అధ్యయనం లో భాగంగా బెంగళూరు లోనే బస చేస్తారు. ఈ రంగం లో నిష్ణాతులైన పలువురు నిపుణులతో సమావేశం అవుతారు. ఇక్కడి ప్రభుత్వ పథకాలు, అమలు తీరు తెన్నులను పరిశీలించడానికి ఆయా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, అధికారులతో సమావేశం అవుతారు, పలువురు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటారు.