Home » తెలంగాణ ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా..

తెలంగాణ ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా..

* ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌
* ముగ్గురు కేంద్ర మంత్రుల‌తో భేటీ
* వైద్యారోగ్య‌, గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణాభివృద్ధి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి..
* లోక్‌స‌భ‌లో తెలంగాణ ఎంపీల ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌రు
* స‌మాఖ్య స్ఫూర్తిని చాటుతున్న ముఖ్య‌మంత్రి

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ముఖ్య‌మంత్రి ముగ్గురు కేంద్ర మంత్రుల‌తో స‌మావేశం కావ‌డంతో పాటు తెలంగాణ నుంచి ఎంపీకైన లోక్‌స‌భ స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌ర‌య్యారు.

కేంద్రంలో కాంగ్రెస్‌కు వైరి ప‌క్ష‌మైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం కొలువుదీరిన‌ప్ప‌టికీ తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలే ప్రాధాన్యంగా స‌మాఖ్య స్ఫూర్తిని అనుస‌రించి కేంద్ర మంత్రుల‌ను క‌లిసి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో తొలి రోజైన సోమ‌వారం ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు అవ‌స‌ర‌మైన ర‌క్ష‌ణ శాఖ భూములు రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని కోరారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలినాళ్ల‌లోనే ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిసిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి న‌గ‌రంలో ఎలివేటెడ్ కారిడార్ల‌కు అవ‌స‌ర‌మైన ర‌క్ష‌ణ శాఖ భూముల బ‌ద‌లాయించాల‌ని కోరారు.

నాడు ముఖ్య‌మంత్రి చేసిన విజ్ఞ‌ప్తికి స్పందించిన ర‌క్ష‌ణ శాఖ మంత్రి ప‌లు ప్రాంతాల్లో భూముల బ‌ద‌లాయింపున‌కు అంగీక‌రించ‌డంతో న‌గ‌రంలో ప‌లు ఎలివేటెడ్ కారిడ‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న చేశారు. ప్ర‌స్తుత ప‌ర్య‌ట‌న‌లో మ‌రో 2,450ఎక‌రాల భూముల బ‌ద‌లాయింపు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.

ఆ భూములు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ద‌క్కితే న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌తో పాటు ఇత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంది. అనంత‌రం కేంద్ర గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌తి పేద‌వాని ఇంటి క‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే ల‌క్ష్యంగా ఇందిర‌మ్మ ఇళ్ల‌కు శ్రీ‌కారం చుట్టినట్లు కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు.

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న (ప‌ట్ట‌ణ‌)-పీఎంఏవై (యూ) కింద కేంద్రం ఇళ్ల‌ను మంజూరు చేస్తున్నందున, తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని కోరారు. పీఎంఏవై (యూ) కింద గ్రాంటుగా తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ.784,88 కోట్ల బ‌కాయిలు విడుద‌ల చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

మూసీ రివ‌ర్ ఫ్రంట్‌… మెట్రో రైలు..
హైద‌రాబాద్ న‌గరానికి ఒక‌నాడు జీవ‌నాడిగా ఉన్న మూసీ న‌ది ప్ర‌స్తుతం మురికి కూపంగా మారిపోయింది. మూసీ కాలుష్యంతో న‌గ‌రంతో పాటు ఉమ్మ‌డి న‌ల్గొండ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసీ ప్ర‌క్షాళ‌న‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మూసీ రివ‌ర్ ఫ్రంట్‌కు కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు. ఇప్ప‌టికే లండ‌న్‌లో థేమ్స్ న‌ది రివ‌ర్ ఫ్రంట్‌ను ప‌రిశీలించారు.

మూసీని ప్ర‌క్షాళ‌న చేయ‌డంతో పాటు న‌ది ఒడ్డున అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి స్థానికుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేలా తీర్చిదిద్దుతామ‌ని, ఇందుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. న‌గ‌రంలో మెట్రో రైలు విస్త‌ర‌ణకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. పాత‌బ‌స్తీ మీదుగా మెట్రో రైలు విస్త‌ర‌ణ‌కు సంబంధించిన అంశాల‌పై కేంద్ర మంత్రితో ఆయ‌న చ‌ర్చించారు. ఈ విష‌యంలో త‌మ‌కు చేయూత‌నివ్వాల‌ని కోరారు.

వ‌రంగ‌ల్‌.. క‌రీంన‌గ‌ర్ స‌మ‌స్యల‌పైనా…
హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఇత‌ర న‌గ‌రాలైన వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ స‌మ‌స్య‌ల‌పైనా కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌ర్చించారు. స్మార్ట్ సిటీ మిష‌న్ కింద వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణాల్లో చేప‌ట్టిన ప‌నులు పూర్తికాలేద‌ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప‌నులు పూర్త‌య్యే వ‌ర‌కు స్మార్ట్ సిటీ మిష‌న్ కాల‌ప‌రిమితిని పొడిగించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

ఎన్‌హెచ్ఎం బ‌కాయిలు రాబ‌ట్టేందుకు కృషి….
తెలంగాణ‌లో ప్ర‌జారోగ్య రంగంపై త‌మ ప్ర‌భుత్వం పెడుతున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.న‌డ్డాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వివ‌రించారు. ముఖ్య‌మంత్రి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో రెండో రోజైన మంగ‌ళ‌వారం కేంద్ర మంత్రి న‌డ్డాతో భేటీ అయ్యారు. జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన బ‌కాయిలు రూ.693.13 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఙ‌ప్తి చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా కేంద్రం వాటా నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే విడుద‌ల చేసింద‌ని, ఆ మొత్తాన్ని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

లోక్‌స‌భ‌లో….
లోక్‌స‌భ‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎంపీల ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల్లో ఏ పార్టీ నుంచి గెలుపొందినా, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా లోక్‌స‌భ‌లో పోరాడాల‌ని ఎంపీల‌కు సూచించారు. ప్ర‌మాణ స్వీకారం చేసిన ఎంపీలంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. రాజ‌కీయ వైరుధ్యాలు వేరు, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు వేరు అనే గుర్తించి ముందుకు సాగాల‌ని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల సాధ‌న‌కు పార్ల‌మెంట్‌ను వేదిక‌గా చేసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఎంపీల‌కు సూచించారు.

Leave a Reply