Suryaa.co.in

Telangana

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో తెలంగాణ ముందంజ

-త్వరలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
-లాభాపేక్షలేని సంస్థలతో 26 అవగాహన పత్రాలు
-గ్లోబల్ ఏఐ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2024, తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యమివ్వగా, హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ )లో గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షత వహించారు. తెలంగాణ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో ప్రపంచ లీడర్ గా ఎదుగుతున్న తరుణంలో సదస్సు ఒక కీలక ఘట్టంగా నిలుస్తోంది.

ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ముందంజలో ఉందని స్పష్టం చేశారు. “తెలంగాణ ఈ విప్లవంలో కేవలం పాల్గొనడం మాత్రమే కాదు, దానిని నడిపిస్తోంది,” అని అన్నారు. రాష్ట్రం సంవత్సరానికి 11.3% ఆర్థిక వృద్ధిని సాధించడంతో, మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తి 176 బిలియన్ డాలర్లుగా చేరింది. త్వరలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నట్టు చెప్పారు.

తెలంగాణ AI వ్యూహానికి కేంద్రబిందువు హైదరాబాదు సమీపంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడిన AI సిటీ. ఇది AI పరిశోధన, అభివృద్ధికి అంకితం చేయబడిన హబ్‌గా రూపొందుతుంది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణను గ్లోబల్ AI చుక్కానిగా నిలబెట్టడానికి, అత్యాధునిక కంప్యూట్ ఫెసిలిటీస్, విస్తృత డేటా సెంటర్లు, సుస్థిర కనెక్టివిటీని అందిస్తోంది. “ఈ AI సిటీ నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లు అవుతుంది, మా టెక్నాలజీ శక్తిసామర్థ్యాన్ని దృఢంగా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. AI సిటీలో ఒక స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ప్రారంభించడానికి కూడా మేం ప్రణాళికలు సిద్ధం చేశాం,” అని మంత్రి ప్రకటించారు.

ఏఐ సిటీ నిర్మాణం పూర్తయ్యేంత వరకు శంషాబాద్ తెలంగాణ ప్రపంచ వాణిజ్య కేంద్రం 2 లక్షల చదరపు అడుగుల అన్ని సౌకర్యాలతో కూడిన కార్యాలయ స్థలాన్ని AI ఆధారిత కంపెనీల కోసం అందిస్తుంది, తద్వారా AI సిటీ రూపకల్పన జరుగుతున్నప్పుడు వారు కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంటుంది.

‘AI ఆధారిత తెలంగాణ’ కింద పేర్కొన్న లక్ష్యాలను సాధించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థలు, విద్యాసంస్థలు, దిగ్గజ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, లాభాపేక్షలేని సంస్థలతో 26 అవగాహన పత్రాలు కుదుర్చుకుంది. ఈ అవగాహన పత్రాలు తెలంగాణను దేశంలో AI పరంగా బలమైన శక్తిగా మార్చడానికి ఉపకరిస్తాయి. ఈ అవగాహన పత్రాలను ప్రధానంగా 7 విభాగాల్లో కుదుర్చుకున్నాం: కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్‌లెన్స్ కేంద్రం, స్కిల్లింగ్, ఇంపాక్ట్ అసెస్‌మెంట్, స్టార్టప్ ఇన్నొవేషన్, జనరేటివ్ AI, పరిశోధన సహకారం, డేటా అనోటేషన్.

AI అభివృద్ధిని సమర్థవంతంగా నిర్వహించడానికి తెలంగాణ AI పాలన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించిందని చెప్పారు. AI తప్పుదోవ పట్టించే సందర్భాలు, డీప్ ఫేక్స్, మరియు AI ఆధారిత తప్పుడు సమాచారాన్ని నిరోధించడానికి నియంత్రణలను కలిగి ఉండే విధంగా ఈ పద్ధతిని రూపొందిస్తామని వెల్లడించారు.
ఈ అంశాలన్నింటిని సమన్వయం చేసి, AI ద్వారా తెలంగాణను ప్రపంచ మేధోశక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రణాళికలు పటిష్టంగా రూపొందిస్తున్నట్టు తెలిపారు.

LEAVE A RESPONSE