– 16 పథకాలతో తొమ్మిదో స్థానంలో నిలిచిన తెలంగాణ
– అటవీ శాఖ తరపున పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి
26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాలు హర్యానా, పంచకులలో జరిగాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతీయ క్రీడోత్సవాల్లో తెలంగాణ తరపున క్రీడాకారులుగా బరిలోకి దిగిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మంచి ప్రతిభ కనపరచారు. మొత్తం 16 పథకాలను సాధించగా, తెలంగాణ జాతీయ స్థాయిలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది.
క్రీడా స్ఫూర్తిని చాటి, జాతీయ స్థాయిలో పథకాలు గెలుచుకున్న అటవీశాఖ ప్రతినిధులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ ఏ. శాంతి కుమారి అభినందించారు. తెలంగాణ తరపున పాల్గొన్న క్రీడా కారులు ఎనిమిది బంగారు, రెండు రజితం, ఆరు కాంస్య పథకాలను సాధించారు. చత్తీస్ ఘడ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అటవీశాఖలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. బిలియడ్స్ లో రెండు బంగారు పథకాలు సాధించిన ఐఎఫ్ఎస్ అధికారిణి సోనీ బాలాదేవిని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అభినందించారు. బీఆర్ కే భవన్ లో చీఫ్ సెక్రటరీని కలిసిన బాలాదేవి, జాతీయ అటవీ క్రీడోత్సవాల వివరాలు తెలిపారు.
అథ్లెటిక్స్ లో బీ.ఖాజా, ఎం. సునీత, వీ.సాంబయ్య, స్విమ్మింగ్ లో జీ. కిష్టా గౌడ్, బీ. సక్రు, క్యారమ్స్ లో ఘాజీ కమాలుద్దిన్ లతో పాటు చెస్, వాలీ బాల్, బ్యాడ్మింటన్ తదితర ఆటల్లో తెలంగాణ అటవీ శాఖ ఉద్యోగులు పథకాలు సాధించారు. క్రీడా పోటీలకు హాజరైన పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, రాష్ట్ర క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎం.సీ. పర్గెయిన్ తెలంగాణ అటవీశాఖ తరపున సమన్యయకర్తగా వ్యవహరించారు.