తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి భగ్గుమంటోన్న భానుడి ప్రభావంతో.. అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇప్పటికే నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు.. మరో మూడు రోజులపాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పగటిపూటే కాదు.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెబుతోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండడం.. ఒక పక్క ఉక్కపోత, మరోవైపు వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగినట్లు ఇదివరకే భారత వాతావరణ విభాగం వివరించింది. అయితే.. మరో మూడు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైనే నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వేసిన అంచనా నిజమైంది. తెలంగాణలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల దాకా నమోదయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక.