Suryaa.co.in

Features

తెలుగు తల్లికి మరో మానని గాయం!

మా తెలుగు తల్లికి మల్లెపూదండ..
మా ఉక్కు మెడలో
గుదిబండ..

ఎందరో వీరుల త్యాగఫలంతో
ఆవిర్భవించిన తెలుగు గడ్డ
అమరజీవి ముద్దుబిడ్డ..
నేడిలా హీనమై..దీనమై…

సువిశాల ఆంధ్రావనిని
సోనియమ్మ చేసె ముక్కచెక్కలు…
ఇప్పుడు మోడీ సర్కార్
కానిచ్చె గుండె వ్రక్కలు..

తెలుగునేలంటే
గలగలా గోదావరి
కిలకిలా కృష్ణమ్మ..
అటు భద్రాద్రి..
ఇటు రామతీర్థం..
మధ్యలో సింహాద్రి అప్పన్న..
బెజవాడ కనకదుర్గ ..
శిఖరాగ్రంగా సప్తగిరి..
ఆంధ్ర విశ్వకళాపరిషత్తు
ఉస్మానియా..
నాగార్జున విశ్వవిద్యాలయం..
వీటి నడుమ
పరుగులు తీస్తూ
చదువులమ్మ..
ఉవ్వెత్తున ఎగసిపడే
నాగార్జునసాగర్..
ఈడేరిన టంగుటూరి కల
ప్రకాశం బ్యారేజి..
కళల కాణాచి రాజమహేంద్రి..
అక్షరాల గుడి బాసర..
మధ్యలో అందాల కోనసీమ..
పౌరుషానికి ప్రతీక రాయలసీమ
ఆ కొస నుంచి ఈ కొస వరకు
చక్కనైన వడ్డాణంలా..
పచ్చని చేలు
అన్నపూర్ణ చేవ్రాలు..

అలాంటి నిండు చూలాలు అమ్మ గర్భంపై దెబ్బ..
విభజన కాదది విచ్ఛిత్తి..
తెలుగు తల్లి గుండె కోత..
తీరని కడుపు శోకం..
సువిశాల ఆంధ్రావని
చిత్రపటంపై చీలికగీత..
పట్టరాని దుఖంలో ఆంధ్రమాత!

భద్రాద్రి..భాగ్యనగరి..
రెండూ పోగా గుండె చెరువై
కష్టాలకు చేరువై..
బ్రతుకు బరువై..
ఒంటిమిట్టతో శ్రీరాముని
కళ్యాణ వైభోగం..
అమరావతిలో
రాజధాని రాజభోగం..
అని సరిపెట్టుకునేలోగా
మొదలైంది వేట..
మూడు ముక్కలాట..
అస్థిరం..అభివృద్ది అస్తిపంజరం
అప్పుడు పడింది పిడుగు..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ..
మోడీ సర్కార్ పీడన..
ఇప్పటికే చిక్కి శల్యమై..
ప్రగతి శూన్యమై..
బ్రతుకు మరింత దైన్యమై..
పడుతూ లేస్తూ సర్డుకునేలోగా
నడుం విరగ్గొట్టి…
మూతి ఎండగట్టి..
ఎన్ని పోరాటాల ఫలం..
ఎందరి త్యాగాల ఫలితం..
విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు
తెలుగు గడ్డకు మణిహారం
కేంద్ర సర్కార్ కుట్రతో
ఇప్పుడు కార్పొరేట్ ఫలహారం!
ఎవరి కుట్ర..ఎవరికి రాచబాట..
కర్మాగారాలు..రైల్వే స్టేషన్లు..
విమానాశ్రయాలు..
ఊళ్లు వాడలు..
అన్నీ ప్రైవేటుకు గుత్తం..
కాదంటే మోడీ చేతిలో బెత్తం..
ఎగ్గొట్టే వీరులు
ఎంచక్కా విదేశాల్లో విలాసాలు
తలవంచే పౌరులకు
ఎడతెగని విలాపాలు..

దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్
అన్న గురజాడ గేయం
బట్టీ పట్టిన మోడీ
తెలుగు ప్రజల గుండెలకు
ఎలా చేస్తున్నాడో
మానని గాయం..!
ఈ ప్రైవేటు జాతర
నిజంగా ఎంత హేయం!?

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE