కొత్త జిల్లాలు..ఎవరికి ఖిల్లాలు..?

118

వై..వైసిపి..!?

అవి కొత్త జిల్లాలా..సరికొత్త పునరావాస కేంద్రాలా…
ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ అసలు రాజధాని ఏదో తెలియని అగమ్యగోచర స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలుగా విడగొట్టి ఈ ప్రభుత్వం ఏం సాధించదలచుకుంది.దీనికి పరిపాలనా సౌలభ్యం అనే పేరు పెట్టారు..
గతంలో..అంటే ప్రస్తుత వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో ఇలాగే పరిపాలనా సొలభ్యం కోసం అంటూ మూడు రాజధానుల ప్రతిపాదనకు తెర ఎత్తారు.దాని ప్రతిఫలం ఏమిటో మనం గత మూడేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇంతా చేసి ఆ ప్రతిపాదన వాస్తవరూపం దాల్చిందే లేదు.నిజం చెప్పాలంటే..అందుకు జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చెయ్యలేకపోయింది.ఏదో చంద్రబాబు నిర్ణయం గనక..ఆ నిర్ణయం వల్ల కేవలం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారికే ప్రయోజనం అంటూ నానా యాగీ చేసి రాజధాని వివాదానికి పురుడు పోసి మొత్తానికి రాజధాని ఏదో..ఎక్కడో తెలియని
ఒక విచిత్ర సన్నివేశాన్ని ఆవిష్కరించింది జగన్ సర్కార్..!!

ఇప్పుడు అదే పరిపాలనా సౌలభ్యం పేరిట ఉన్న జిల్లాల సైజు తగ్గించి కొత్త కార్యాలయాలు..
సరికొత్త సిబ్బంది..వనరుల కల్పన..ఇత్యాది హంగామాలు నామమాత్రంగా చేసి
ఈ రోజున బుల్లి జిల్లాలకు ప్రాణం పోసేసారు..
నిజానికి ఇలాంటి ప్రక్రియ చేపట్టే ముందు చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.విస్తీర్ణం..
వనరులు..నదీజలాలు..
వ్యవసాయ భూములు..
రోడ్ల నిర్వహణ..సామాజిక
నిష్పత్తులు..ఇలా ఎన్నెన్నో అంశాలపై సమగ్ర అధ్యయనం జరిపి..ప్రతిపాదనలపై ప్రజల అభ్యంతరాలకు అవకాశం కల్పించి..తదనుగుణంగా మార్పులు చేర్పులు చేసి అప్పుడు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
అవన్నీ జరిగినట్టే ప్రభుత్వం చెబుతున్నా ఎంత పకడ్బందీగా..పటిష్టంగా..పారదర్శకంగా జరిగాయో
రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే..!
వాస్తవానికి జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేసి..పరిపాలనను ప్రజలకు మరింత దగ్గరగా చేర్చినట్టు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న గ్రామ..వార్డు సచివాలయ వ్యవస్థ ఉంటుండగా కొత్తగా మళ్లీ అదే పరిపాలనా సౌలభ్యం పేరిట చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడంలో ఔచిత్యం ఏమిటో ఏలిన వారికే తెలియాలి..ప్రభుత్వమే చెప్పుకున్నట్టు ఇప్పుడు ప్రజలు తప్పని సరి అయితేనే కలెక్టర్.. ఆర్డీవో.. అంతెందుకు దగ్గరలోనే ఉండే ఎమ్మార్వో ఆఫీసుకు సైతం వెళ్లాల్సిన పనిలేదు.అన్నిటికీ గ్రామ సచివాలయాలే.. మరి ఈ కొత్త జిల్లాల వల్ల ఒనగూరే ప్రత్యేక..అసాధారణ ప్రయోజనాలు ఏమిటో..?
గత ప్రభుత్వాలు చెయ్యని..చెయ్య లేకపోయిన అత్యద్భుత కార్యక్రమాలు మేము చేస్తున్నాము సుమీ..అని చెప్పుకునే తాపత్రయం తప్పితే ఇందులో ప్రత్యేకత గాని..ఇంత యుద్ధప్రాతిపదికన అమలులోకి తీసుకు రావాల్సిన అవసరం గాని దీని వెనక ఏమీ కనిపించడం లేదని నిపుణుల అభిప్రాయం.

ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ముందు తలకి మించిన పనులు..బాధ్యతలు చాలా ఉన్నాయి.మరో పక్క ప్రజలకి ఇలాంటి కొత్త జిల్లాలు.. డివిజన్లను మించిన అవసరాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి..రాష్ట్ర ప్రభుత్వం ఏ నెలకానెల సక్రమంగా జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలోనే లేదు..ప్రాజెక్టులు కొత్తవి రావడం సంగతి అటుంచితే ఉన్నవే ఎక్కడివి అక్కడే ఉన్నాయి. పరిశ్రమల ఊసే లేదు.విద్యుత్ సరఫరా అంతంత మాత్రమే..పన్నులు ప్రజలకు అదనపు భారంగా పరిణమించాయి.ఇక ధరల సంగతి చెప్పనే అక్కర్లేదు.

అంతా అస్తవ్యస్తం..
అన్నీ అపసవ్యం..!
జనం ఏ విషయలోనూ హ్యాపీగా లేరన్నది నిర్వివాదం..ఇంకో పక్క మంత్రివర్గ మార్పు పేరిట రాజకీయ అనిశ్చితి..ఇన్ని గందరగోళ పరిస్థితుల నడుమ సందట్లో సడేమియాలా ఇప్పుడు ఆదరాబాదరాగా కొత్త జిల్లాల ఏర్పాటు..ప్రజల దృష్టి మరల్చడానికేనా ..ఈ మాటున అన్ని జిల్లాలకు సమన్యాయం ..సామాజిక సమతౌల్యం పేరిట మరింత ఎక్కువ మంది..
అస్మదీయులకు మంత్రిపదవులు కట్టబెట్టి ఎన్నికల క్యాబినెట్ పేరిట జనాల మీదకి వదలడమేనా
దీని వెనక గల ఉద్దేశం..సందేశం..!?

ఇ.సురేష్ కుమార్
జర్నలిస్ట్