పోరాడితే స్వరాజ్యమే వచ్చింది.. సురాజ్యం ఎందుకు రాదు?

CIGARETTE SMOKING IS INJURIOUS TO HEALTH..
ALCOHAL CAUSES CANCER..!

ప్రభుత్వాలు చేసే
ఈ ప్రకటనల కంటే పెద్ద జోకు ఇంకేదైనా ఉంటుందా..
సినిమా హాళ్ళలో..
రేడియోల్లో..
టీవీల్లో..
సినిమాల టైటిల్స్ లో..
న్యూస్ పేపర్లలో..
పాంప్లెట్లలో..
గోడల మీద..
ఇవే ప్రకటనలు..
మొహమాటం లేకుండా
ఇది ప్రభుత్వం ప్రజలను చేస్తున్న దగా..
అమాయకులతో ఆడుకుంటున్న ఆట..
జీవితాలతో చెలగాటం..
ప్రజలను..ముఖ్యంగా యువతను పెడత్రోవ పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం..
తాను చేయాల్సింది చెయ్యకుండా ప్రజలకు పనికిరాని హెచ్చరికలు చేసే అతి భయంకరమైన బాధ్యతారాహిత్యం..!!
ఒకడు కిరాణా కొట్టు పెట్టుకుని నా దగ్గర సరకులు కొనకండి..అవి చాలా ప్రమాదకరమైనవి..వాటితో మీరు ఆహార పదార్థాలు తయారు చేసుకుంటే
మీ ప్రాణాలకే ప్రమాదం..అని చెప్పుకుంటాడా..?
ఇలా చెప్పుకునే వ్యాపారి అసలు ఉంటాడా..??
అలాగే ఓ మందుల దుకాణం వాడు…బాబోయ్..
మా షాపులో మందులు కొని వేసుకుంటే మీ ప్రాణాలు హరీ..ఇలా చెప్పే సాహసం చేస్తాడా..
మాది ఘన సిమెంట్..
అంటాడు కాని ఏ సిమెంట్ కంపెనీ వాడైనా
మా సిమెంటుతో నిర్మాణం చేస్తే మీ భవనం మర్నాటికే ఖతమైపోవడం ఖాయం..
కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి పబ్లిసిటీ ఇచ్చుకుంటాడా..
బుర్రున్న ఏ వ్యాపారి ఇలాంటి ప్రకటనలు చెయ్యడు..
ఏ సంస్థ ఈ తరహా పబ్లిసిటీ చేసుకోదు..కాని ప్రభుత్వం నిస్సిగ్గుగా ఈ తరహా ప్రకటనలు సిగరెట్లు..మద్యం విషయంలో చేస్తూ ఆ ఉత్పత్తుల మీదనే కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ పబ్బం గడుపుకుంటోంది.ఇలాంటి ప్రకటనలు ఎన్ని చేసినా ప్రజలు వ్యసనం మానరని నమ్మకం..ప్రజల బలహీనతలను ఇలా సొమ్ము చేసుకునే వ్యాపారాలు కల్తీ వ్యాపారాల కంటే..ఎక్స్పైర్ అయిపోయిన మందులు అమ్మడం కంటే.. బ్లాక్ మార్కెట్లో సరకులు విక్రయించడం కంటే నీచం..హేయం..!

అన్ని అధికారాలు.. అవకాశాలు చేతిలో ఉంచుకుని మద్యం..సిగరెట్ల అమ్మకాలు నిషేదించకుండా
యధేచ్చగా అమ్మకాలు సాగడానికి అనుమతులిస్తూ ఆయా ఉత్పత్తులు ఎంత హానికరమో ప్రకటన ద్వారా తెలియజేయడం అంటే..దానర్థం..అనర్థం ఏమిటి..!? మందయితే కొన్ని రకాలు స్వయంగా ప్రభుత్వమే ఉత్పత్తి చేసి మరీ అమ్ముతుంది కూడా..మద్యం ప్రకటనలు ఇవ్వడం టీవీల్లో నిషేధించిన ప్రభుత్వం అవే పేర్లతో మంచి నీళ్ళు..లేదా సోడాలు తయారు చేసి ప్రకటనలు జారీ చేస్తుంటే కిమ్మనకుండా ఊరుకుంటుంది..ఇది ఎవరితో ఆడుతున్న ఆట.. ఏమిటీ దొంగ వేషాలు..నిజానికి ఇవన్నీ ప్రభుత్వ ప్రాయోజిత రాక్షస క్రీడలు!

మొత్తం దేశంలో ఉత్పత్తులు నిలిపి వేస్తే తప్ప ప్రయోజనం ఉండదు..కేంద్ర ప్రభుత్వం ఆ పని చెయ్యదు..కొన్ని రాష్ట్రాలు అప్పుడప్పుడూ మద్య నిషేధానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.
అందుకు కారణం ఇతర రాష్ట్రాల నుంచి దొంగచాటుగా మద్యం రావడం..దేశం మొత్తం మీద ఉత్పత్తులు నిషేధిస్తే తప్ప సంపూర్ణ మద్యనిషేధం సాధ్యపడదు..ఇవే కారణాల వల్ల నిషేధం అమలు విఫలమైన రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది..
ఇదే ప్రతిబంధకం ప్లాస్టిక్ నిషేధం అమలుకు కూడా వర్తిస్తుంది.ప్రభుత్వం ఆయా ఉత్పత్తుల తయారీని నిషేధించకుండా విక్రయించే వ్యాపారులను,వినియోగించే చిన్న తరహా వర్తకులను వేధించడం మనం
నిత్యం చూస్తున్న వికృత కృత్యం..!

ఇవి మాత్రమేనా..ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తూ ఎన్నో సంసారాలను చిన్నాభిన్నం చేస్తున్న
మాదక ద్రవ్యాల ఉత్పత్తి ..రవాణా..వినియోగంపై కూడా ప్రభుత్వాలకు అదుపు లేకుండా పోయింది.. వాస్తవానికి ఇది పెద్ద కష్టమైన పని కాదు..అయితే మన సర్కార్లకు..వాటిని నడిపించే పెద్దలకు చిత్తశుద్ధి లేకపోవడం..కొందరికి వీటి వల్ల భారీగా ముడుపులు అందడం..ఇవన్నీ బహిరంగ రహస్యాలే..ఇలాంటి మహమ్మారుల వల్ల ఎదురవుతున్న పరిణామాల వికృతరూపాన్ని సాక్షాత్తు మన హైదరాబాదులోనే చాలాసార్లు చూస్తున్నాం.ఎప్పుడో ఒకటో రెండో దాడులు జరపడం ..అదే సమయంలో పేపర్లు.. టీవీలు హడావుడి చెయ్యడం..మళ్లీ మర్చిపోవడం..మాదక ద్రవ్యాల కారణంగా యువత పెడదారి పట్టేసి ఎంతగా నాశనం అయిపోతున్నా ప్రభుత్వాలు ఈ విషయంలో అవసరమైనంత తీవ్ర స్ధాయిలో చర్యలు తీసుకోవడం లేదు.

నానాటికీ పెచ్చుమీరిపోతున్న బార్లు.. పబ్బులు..అశ్లీల నృత్యాల సంస్కృతికి అడ్డుకట్ట వేయడంలో కూడా ప్రభుత్వాలు అలవిమీరిన ఉదాసీనతను ప్రదర్శిస్తున్నాయి..ఇలాంటి ప్రభుత్వాలను..విష సంస్కృతులను ప్రదర్శిస్తున్న నాయకులను ఎన్నుకుంటున్న మనల్ని మనమే తిట్టుకోవాలి..
ఇప్పటికైనా మించిపోయింది లేదు..ప్రభుత్వాలు..వాటిని నడిపే పెద్దల వికృత క్రీడలకు చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది..అందుకు ఇప్పుడే బీజాలు వెయ్యి..నాయకులను నిలదియ్యి ..పాలకులు పడేసే ఎంగిలి మెతుకులకు ఆశపడ్డం మాని,నేటి నీ బ్రతుకును..రేపటి తరాల జీవితాలను బాగుచేసుకునే దిశగా అడుగులు వేయడం ప్రారంభించు..ఓటు అడగడానికి వచ్చే నేతలు నీకు వాగ్దానాలు చెయ్యడం కాదు..వారికి నువ్వే షరతులు విధించే స్థాయికి ఎదుగు.. అలా నిన్ను నువ్వు మలచుకో..అన్నిటి కంటే నీకు నువ్వుగా నిబద్ధత అలవాటు చేసుకో..ఇదంతా జరిగేదేనా..నీ వల్ల…నా వల్ల సాధ్యమయ్యేదేనా అని వెరవకు..
పోరాడితే స్వరాజ్యమే వచ్చింది…సురాజ్యం ఎందుకు రాదు!?

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

Leave a Reply