Suryaa.co.in

Andhra Pradesh

కష్ట కాలంలో నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు

అక్రమ కేసులపై న్యాయస్ధానాల్లో పోరాటం చేస్తా
రాష్ట్ర యువత భవిష్యత్ కోసం డ్రగ్స్ అక్రమ రవాణాపై పోరాటం కొనసాగిస్తా
– కొమ్మారెడ్డి పట్టాభిరాం
రాష్ట్ర యువత భవిష్యత్ కోసం రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాపై పోరాటం కొనసాగిస్తానని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. బుధవారం నాడు పట్టాభిరాం ఒక వీడియో సందేశం పంపారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ……..రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తోంది. రాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుగారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమంలో అనేకమంది టీడీపీ సీనియర్ నాయకులు, యువనాయకులతోపాటు నేను కూడా అత్యంత క్రియాశీలకంగా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాను.
కొద్ది రోజుల క్రితం వైసీపీకి చెందినవారు ఒక కుట్రపూరిత ధోరణితో, కక్షసాధింపు ధోరణితో నాకు కొన్ని అవరోధాలు సృష్టించారు. నా ఇంటిపై దాడులు చేసి నాకుటుంబ సభ్యుల్ని భయబ్రాంతులు గురి చేశారు. ఇలాంటి కష్టకాలంలో నాకు అండగా నిలబడి ధైర్యం చెప్పిన ‎ చంద్రబాబునాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులకు, నాకు మద్దతుగా నిలిచిన ‎ మిత్రులు, శ్రేయోభిలాషులు, ‎మీడియామిత్రులు, మహిళలు, కార్యకర్తలకు అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డ్రగ్స్ నుంచి ఒక తరాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. రాష్ట్ర యువత భవిష్యత్తు నాశనం కాకూడదు.
నేను మాట్లాడని మాటలకు లేనివి ఆపాదించారు. కుట్రపూరిత ధోరణితో ఇలా చేశారు. గత రెండున్నరేళ్లు అనేక అంశాలపై ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీశాను. వైసీపీ చేస్తున్నతప్పుల్ని, వైపల్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించాను. నేనడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నా కుటుంబంపై మూడోసారి దాడి చేశారు. నేను లేనప్పుడు మా ఇంటిపై దాడిచేసి ధ్వంసం చేయడమేకాకుండా ఆ సమయంలో మా ఇంట్లో ఉన్న నా 8 సంవత్సరాల ఏకైక కుమార్తెను భయకంపితురాలు చేశారు. ఇది చాలా అమానవీయ చర్య. చిన్నపాపను భయోత్పాతానికి గురిచేశారు. చిన్నవయసులో పసి హృదయానికి గాయమైతే దాన్ని రూపుమాపటం కష్టం. ఏమాత్రం మానవత్వం లేకుండా నా బిడ్డకు షాక్ కు గురిచేశారు.
అమితంగా ప్రేమించే బాధ్యత గల ఒక తండ్రిగా వారి మనో వికాసం కోసం నా బిడ్డని, భార్యని కొద్ది రోజులు బయటికి తీసుకొచ్చాను. దానికి కూడా విపరీతార్థాలు తీశారు. అనేక కామెంట్లు చేయడం బాధాకరం. నేను ఒక బాధ్యత గల తండ్రిగా నా బిడ్డ కోసం నాకర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. గాయపడ్డ పసి హృదయాన్ని శాంతపరచడానికి, గాయాన్ని రూపుమాపడం కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ వీడియో మెసేజ్ ద్వారా తెలుపుతున్నాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఈ ఉద్యమం లో క్రియాశీలకంగా పాల్గొంటాను.
ఈ తప్పుడు కేసులకు భయపడను. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యంగబద్ధంగా న్యాయస్థానాలలో ఈ కేసులన్నింటిని ఎదుర్కొంటాం. మరిన్ని వాస్తవాలను ప్రజలముందుకు తీసుకొస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగానే మా పోరాటాన్ని కొనసాగిస్తాం. పార్టీ ఆవిర్భావం నుండి నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు అనేక సందర్భాల్లో ప్రజల కోసం ప్రజల పక్షాన ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.
అందులో నేను క్రియాశీలకంగా పాల్గొంటాను. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాను. నాపై పెట్టిన కేసులన్నంటిని న్యాయబద్ధంగా ఎదుర్కొంటానని ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆపత్కాలంలో నాకు అండగా నిలబడిన చంద్రబాబుగారికి, లోకేష్ గారికి, మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

LEAVE A RESPONSE