Suryaa.co.in

Telangana

ఆ అధికారిని సస్పెండ్ చేయాలి

– బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ఓట్లు కీలకంగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ, ఈ వర్గాలకు న్యాయం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయి.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీల హక్కులను విస్మరించినందువల్ల ప్రజలు వారికి తగిన బుద్ధిచెప్పారు. అదే దారిలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కొంతమంది రైతులకు బేడీలు వేసే స్థితికి వెళ్లింది. ప్రజల వ్యతిరేకతతో ఆ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిశలో దూసుకెళ్తోంది.

ఎస్సీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కండ్లు ఉన్నా చూడలేని ప్రభుత్వంగా మారింది. దళితుల సమస్యలను పట్టించుకోడం లేదు. కామారెడ్డి, భిక్కనూరు ఎస్సీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను టాయిలెట్లు శుభ్రం చేయమని అధికారుల ఆదేశాలు ఇవ్వడం దళితుల పట్ల ఉన్న వివక్షకు పరాకాష్ట.

“విద్యార్థులు టాయిలెట్లు కడుక్కుంటే తప్పేంటి?” అనే అభిప్రాయాన్ని ఎస్సీ గురుకులాల సెక్రటరీ వ్యక్తపరచడం అత్యంత దారుణం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ అధికారిని సస్పెండ్ చేయాలని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ఆదిలాబాద్‌లో అనేక ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను లాక్కొనే ప్రయత్నం చేసిన కొంతమంది అధికారుల ప్రయత్నాలను ప్రశ్నించిన రైతులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. ఆ రైతులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తోంది.

LEAVE A RESPONSE