– రైతుబంధు, రైతుభరోసా కంటే కేంద్రమే ఎక్కువ ఇస్తోంది
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి
హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా అనేక వరాలు ప్రకటించింది. రైతుల ఆశీర్వాదంతో భారత ప్రభుత్వం పనిచేస్తోంది. 2014 మేనిఫెస్టోలో బిజెపి చాలా స్పష్టంగా చెప్పింది. బిజెపి అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రక్రియలో భాగంగా.. ప్రతి సంవత్సరం రైతుల పంటల ఉత్పత్తులకు మద్దతు ధర పెంచుతూ వస్తోంది. ఎంఎస్పీ జాబితాలో లేని పంటలకు కూడా లాభసాటి ధరలు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
రైతుల పెట్టుబడి ఖర్చు తగ్గించడం, ప్రతి ఎకరానికి ఉత్పత్తిని పెంచడం, పంటే పంటకు లాభసాటి ధర ఇవ్వడంలో భాగంగానే ప్రతి సంవత్సరం 23 పంటలకు ఎంఎస్ పీ పెంచడం, లాభసాటి ధరలు వచ్చేలా కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరల ప్రకారం, సాధారణ రకం వరి ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 69 పెరిగి రూ. 2,369కి (81 శాతం పెరుగుదల) చేరింది. అదే విధంగా ‘ఏ’ గ్రేడ్ రకం వరి ధాన్యం ధర క్వింటాల్‌కు రూ. 2,389గా పెంచింది.
నైజర్‌సీడ్ (ఒడిసలు) ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ. 820 పెరిగింది. రాగి (రూ. 596), పత్తి (రూ. 589), నువ్వులు (రూ. 579) ఉన్నాయి. మొక్కజొన్న ఎంఎస్‌పీ రూ. 2,225 నుంచి రూ. 2,400కు పెరిగింది. నూనెగింజల విషయానికొస్తే, వేరుశనగపై రూ. 480, పొద్దుతిరుగుడు విత్తనాలపై రూ. 441, సోయాబీన్‌పై రూ. 436 చొప్పున మద్దతు ధరను పెంచారు. పప్పుధాన్యాలలో కంది మద్దతు ధర రూ. 450, పెసరపప్పు రూ. 86 పెరగ్గా, మినుములకు రూ. 400 అదనంగా లభించనుంది.
ఇలా ప్యాడీ (Common) – 81%, ప్యాడీ (Grade A) – 78% పెరిగింది, జొన్న (Hybrid) – 147%, జొన్న (Maldandi) – 147%, సజ్జ – 122% పెరిగింది. రాగి– 226%, మక్కజొన్న– 83%, మూంగ్– 95%, వేరుశెనగ– 82% పెరిగింది. కేంద్రం ఇస్తున్న మద్దతు ధర వల్ల తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 1 కోటి 50 లక్షల వ్యవసాయం సాగు జరుగుతోంది. అందులో 50 లక్షల ఎకరాలు పత్తి పంట సాగు జరుగుతోంది.
భారత ప్రభుత్వం సరఫరా చేస్తున్న విత్తనాలతో తెగుళ్లు తగ్గి పంట ఉత్పత్తి బాగా పెరిగింది. ప్రతి ఎకరానికి సరాసరిగా 15-20 క్వింటాళ్ల పత్తి సాగవుతోంది. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంపుతో రైతులకు జరుగుతున్న లాభం.. ఒక్కో ఎకరానికి గాను ఒక్క సంవత్సరానికి రూ. 5 వేల నుంచి 8 వేల రూపాయల వరకు అదనపు లాభం జరుగుతోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుభరోసా, గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు కంటే ఎక్కువే.
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 75 లక్షల టన్నుల ఉత్పత్తి కాగా, సుమారు 40 లక్షల పత్తి బేళ్లను కొనుగోలు చేయడం జరిగింది. సీసీఐ పూర్తిస్థాయిలో ఎంఎస్ పీ రేటుకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా గత వానాకాలంలో 43 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంత వడ్లు సేకరించినా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం సుమారు 2 లక్షల 29 వేల కోట్ల రూపాయలు అనేక పంటల ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు చేస్తూ ఎంఎస్పీ ధరలు ఇస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. అన్ని రకాల రైతు సబ్సిడీలు బంద్ పెట్టింది. ముఖ్యంగా రైతుల ఉత్పత్తి పెరగడానికి భూసార పరీక్షలు, పనిముట్ల వాడకం అవసరం. అందుకే వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మహిళల ఆధ్వర్యంలో వ్యవసాయ డ్రోన్ల వినియోగంతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.
లాభసాటి ధర కల్పించే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతుల ఆశీర్వాదంతో పరిపాలన అందిస్తోంది. రైతుల ఆదాయం పెంచి, దేశం యొక్క జీడీపీని పెంచి, తద్వారా అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేలా పనిచేస్తోంది.