– సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్
గుంటూరు: వస్తు సేవల పన్ను తో దేశం వేగంగా ఆర్థికంగా ముందుకు వెళుతుందని, పన్ను వ్యవస్థ పూర్తిగా చక్కబడిందని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. గురువారం గుంటూరు కన్నవారి తోట లో జీఎస్టీ భవన్ లో ప్రీ జీఎస్టీ డే వేడుక జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ సుజిత్ మల్లిక్ మాట్లాడుతూ..జీఎస్టీ తో పన్నులను అంగీకరించే సమాజం ఏర్పడిందన్నారు. పన్ను చట్టాల్లో పారదర్శకత పెరగటమే కాకుండా, పన్ను అధికారులకు, పన్ను చెల్లింపుదారుల మధ్య స్నేహభావం ఏర్పడిందన్నారు.
ఆర్థికాభవృద్ధిని ప్రోత్సహించడం, పన్ను చెల్లింపులు పెంచడం వంటి అంశాలలో జీఎస్టీ ప్రాధాన్యతను కమిషనర్ ప్రస్తావించారు. జీఎస్టీ విజయవంతంగా అమలు కావడంలో పరిశ్రమ భాగస్వాముల సహకారాన్ని ఆయన అభినందించారు.
జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మినారాయణ మాట్లాడుతూ..జీఎస్టీ ప్రయాణాన్ని గుర్తు చేసే ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఈ వేడుక నిర్వహిస్తున్నామన్నారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షులు భాస్కరరావు మాట్లాడుతూ..జీఎస్టీ ప్రారంభంలో తెలియక చాలా మంది వ్యాపారులు తమ రిటర్న్స్ లో తప్పుడు వివరాలు నమోదు చేశారని, ఇప్పుడు జీఎస్టీ ఆడిట్ లో అవన్నీ పట్టుబడుతున్నాయన్నారు. అవి కావాలని చేసిన తప్పులు కావన్నారు.
నేషనల్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు చదలవాడ హరిబాబు మాట్లాడుతూ.. ప్రాణ రక్షణ కొరకు వాడే మందులపై జీఎస్టీ ని తక్షణమే తీసెయ్యాలన్నారు. చేనేత మగ్గాలపై విధించే ఐదు శాతం పన్ను ను కూడా రద్దు చేయాలన్నారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..జీఎస్టీ పై వ్యాపారుల ఇబ్బందులను ప్రతి మూడు నెలలకొకసారి అధికారులు రివ్యూ చేయాలన్నారు.
ఇండియన్ టెక్స్ టైల్స్ అసోసియేషన్ అధ్యక్షులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ..జీఎస్టీ రేట్లలో రెండు స్లాబులే వుండాలని సూచించారు. ఇంకా పలువురు పరిశ్రమ ప్రతినిధులు జీఎస్టీ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనుభవాలు వెల్లడిస్తూ, మెరుగుదలకు సూచనలు చేసారు.
అనంతరం కమిషనర్ సుజిత్ మల్లిక్ ను ట్రేడ్ వర్గాలు వారు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవికుమార్, వి వెంకటేశ్వరరావు, మనోజ్ కుమార్, మరియదాసు, రాయలు,ఆనందరావు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.