Suryaa.co.in

Andhra Pradesh

నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే రోజ్ గార్ మేళా లక్ష్యం

– కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

విశాఖపట్నం: లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే రోజ్ గార్ మేళా ముఖ్య ఉద్దేశమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. విశాఖ డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో సిరిపురంలో గల వీఎంఆర్ డీఏ బాలల థియేటర్ లో మంగళవారం నిర్వహించిన రోజ్ గార్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనుల్లో పారదర్శకత, రాజకీయ జోక్యానికి ఆస్కారం లేకుండా చేయడం, సిఫార్సుల నుంచి విముక్తి కల్పించడం నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాతే సాధించామన్నారు. రోజ్ గార్ మేళా ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతకు నియామక పత్రాలను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

దేశవ్యాప్తంగా నేడు 40 ప్రాంతాల్లో రోజ్ గార్ మేళాను కేంద్ర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. ఇప్పటి వరకు దేశంలో 8 లక్షల మందికి ఉపాధి కల్పించామని త్వరలో మరో 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. దేశంలో అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు గుర్తించి ఉద్యోగాలు ఇస్తున్నాం అని స్పష్టం చేశారు. దేశంలో డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం అన్నారు. ముద్రా రుణాలు ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగు పరిచారని గుర్తు చేశారు. కేంద్ర ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సమానంగా అభివృద్ది సాధించేలా కేంద్రం కృషి చేస్తుందన్నారు. టెంపుల్ టూరిజం పేరిట ప్రవాస భారతీయులు దేశానికి వచ్చేలా మోడీ కృషి చేశారన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామన్నారు.

ఎం.పీ. శ్రీ భరత్ మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఉపాధి అవకాశాలు తగ్గుతాయన్నారు. కర్మ యోగి ప్రారంభ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగులు సక్రమంగా పని చేస్తే ప్రజా ప్రతినిధులు వద్దకు ఫిర్యాదులు తగ్గిపోతాయన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రసంగం చేశారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ 110 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ.వీ.ఎన్. మాధవ్ , కర్నూల్ రీజియన్ తపాలా శాఖ సీనియర్ సూపరెంటెండెంట్ వెన్నం ఉపేంద్ర, విశాఖ డివిజన్ తపాలా శాఖ సీనియర్ సూపరెంటెండెంట్ గజేంద్ర కుమార్ మీనా, తదితరులు, పాల్గొన్నారు.

LEAVE A RESPONSE