Suryaa.co.in

Telangana

బీజేపీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా

– కేంద్రం మిథ్య
– గద్దరన్న ను మరోసారి కించపరిస్తే ఆ పార్టీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది
– నక్లెస్ రోడ్ లో గద్దర్ మెమోరియల్ ఏర్పాటు
– గద్దర్ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ప్రజా యుద్ధ నౌక గద్దర్. గద్దర్ కుటుంబం సర్వం కోల్పోయింది. వారు ఏ నాడు కంటి నిండా నిద్ర పోలేదు.నిరంతరం గద్దర్ ప్రజల్లో ఉన్నారు. గద్దర్ తన గళంతో సమాజానికి స్పూర్తినిచ్చారు. గద్దరన్నతో నాకు ఎంతో అనుబంధం ఉంది. గత పదేళ్లలో రాజకీయ పరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు, ఒంటరిగా అనిపించినప్పుడు గద్దరన్నతో మాట్లాడేవాన్ని. పోరాటానికి ప్రజల గుర్తింపు ఉంటుందని నాలో స్పూర్తి ని నింపేవారు.

చరిత్రపుటల్లో గద్దర్ కు ఒక పేజీ ఉండేలా నిర్ణయం తీసుకోవాలని భావించాం. గద్దర్ కు లక్షలాది మంది అభిమానులున్నారు. ఒక గొప్ప వ్యక్తి గద్దర్ ను గుర్తించడం ద్వారా భవిష్యత్తు తరాలకు స్పూరినివ్వాలని ప్రభుత్వం ఆయన జయంతి, వర్ధంతి ని అధికారికంగా నిర్వహిస్తోంది. గద్దర్ అవార్డు ఏర్పాటు చేసి భట్టి విక్రమార్క కు బాధ్యత అప్పగించాం. గద్దర్ మరణం సమాజానికి చేరకుండా ఆ నాటి ప్రభుత్వం ప్రయత్నించింది.

గద్దర్ ఒంటరి కాదు… అందరం ఉన్నామని చెప్పి ఎల్బీ స్టేడియానికి ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శన కోసం తీసుకెళ్లాం. ప్రభుత్వం ఎల్బీ స్టేడియం గేట్లకు తాళాలు వేస్తే అధికారులను హెచ్చరించి తెరిపించాను. ఒక వీరుడి మరణం స్పూర్తిని అందరం తీసుకున్నాం. లక్షలాది మంది యోధులను , పోరాట స్పూర్తిని ఇచ్చిన సిద్ధాంతకర్తగా గద్దర్ ను చూడాలి. గద్దర్ సైద్దాంతిక కట్టుబాటు తో చివరి శ్వాస వరకు కొనసాగారు.

చుక్కా రామయ్య, అందె శ్రీ, జయధీర్ తిరుమల్ రావు, గోరేటి వెంకన్న , గద్దర్ కు పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించాం. వీరెవ్వరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య. రాష్ట్రాల కలయికనే దేశం. నాతో విభేదించినా నాలుగు కోట్ల సమాజం కోసం మమేకం అయినవారిని గుర్తించాలన్నదే మా అభిమతం. పక్క రాస్ట్రంలో ఐదు గురికి పద్మ అవార్డులు ఇచ్చారు.. తెలంగాణ ప్రతిపాదించిన ఐదుగురు ఎందులో తక్కువ? ప్రధానమంత్రికి మా నిరసన తెలియజేస్తు లేఖ రాశాం.భవిష్యత్తులోనైనా తమ తప్పును సరిదిద్దుకుంటారని భావించాం.

కేంద్ర మంత్రి ఒకరు ఇష్టానుసారంగా మాట్లాడాడు. గద్దరన్న ను మరోసారి కించపరిస్తే ఆ పార్టీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది. నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది గుర్తు పెట్టుకో. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా.. ఏం చేస్తారు? గద్దర్ ను గేటు బయట కూర్చొపెట్టిన ఆయన గేట్లు బద్దలు అయ్యాయి. గేటు బయట కూర్చొపెట్టిన ఆయన కు పట్టిన గతే బీజేపీ నాయకులకు పడుతుంది. కేంద్రాన్ని ఇక అడగం. మేమే సంతకం పెడతాం.

సైద్దాంతిక విభేదాలపైన చర్చ చేసే వాళ్లు , గౌరవించే వాళ్లు లేరా? నన్ను విమర్శించే వారి మాటల్లోని మంచిని తీసుకుంటా. ప్రభుత్వం నిరంతర ప్రక్రియ. ఈ ప్రభుత్వం ప్రజలది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధానాలను కొనసాగిస్తాం. వందేళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఏ నాడు దళితుడిని వైస్ ఛాన్స్ లర్ గా నియమించ లేదు.. మేము నియమించాం. సామాజిక న్యాయాన్ని గుర్తు పెట్టుకొని యూనివర్సిటీ వీసీలను నియమించాం.

గద్దర్ ను వ్యక్తులు గుర్తించనంత మాత్రాన విలువ తగ్గదు.

కోహినూర్ వజ్రం విలువ ఏ నాడు తగ్గదు. గద్దర్ స్పూర్తి మన దగ్గరుంది. మహాత్మా గాంధీనే గుర్తించని వారు గద్దర్ గుర్తిస్తారని ఎలా అనుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వ్యక్తుల గౌరవం తగ్గకుండా చూస్తుంది. జీవో ఇచ్చేంత వరకు గద్దర్ కూతురు వెన్నెలకు పదవి ఇస్తున్నట్లు తెలియదు. గద్దర్ స్పూర్తి ని కొనసాగించడానికి ప్రభుత్వాన్ని ఆశ్వీరదించండి.

కంచె అయిలయ్య సూచన మేరకు మహిళా యూనివర్సిటీ కి చాకలి ఐలమ్మ పేరు పెట్టాం. ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. సలహాలు, సూచనలను పాటిస్తుంది. గద్దర్ గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. నక్లెస్ రోడ్ లో గద్దర్ మెమోరియల్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకుంటాం.

LEAVE A RESPONSE