– మన పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లేదు
– విశాఖ స్టీల్ ప్యాకేజీ మన ఒత్తిడి ఫలితమే
– అయినా మీరు సరిగా ప్రచారం చే యలేకపోయారు
– మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలపై మాట్లాడరేం?
– మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలేదా?
– మీ మౌనం వల్ల అవి నిజమనుకునే ప్రమాదం లేదా?
– కౌంటర్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలం
– 14-19లో కష్టపడినా ఫలితం లేకపోవడానికి అదే కారణం
– మీరు నిరంతరం జనంలోనే ఉండాలి
– ప్రభుత్వ పథకాలు జనంలోకి వెళ్లకపోతే ఎంత చేసినా ఏం ప్రయోజనం
– ఖజానా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది
– ఊహించిన దానికంటే భయంకరకంగా ఉంది
-ఎఫ్‌ఆర్‌బీఎం సున్నా అయిపోయింది
– కొత్త అప్పులు కూడా పుట్టేలా లేదు
– కేంద్ర సహకారంతో నెట్టుకొస్తున్నాం
– 95-99 మాదిరిగా పనిచేస్తేనే ఫలితాలు
– మే-జూన్ నుంచి అన్నదాన, సుఖీభవ అమలు
– కడపలో రెండు రోజుల పాటు మహానాడు
– మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి
– కార్యకర్యలపై కేసులు క్రమంగా తొలగిస్తున్నాం
-అచ్చెన్నాయుడుపై కేసు ఎత్తేశామన్న లోకేష్
– దావోస్ ప్రచారంలో విఫలమయ్యామన్న యనమల
– నేను ఆ రాత్రి వచ్చేయడం వల్ల మిస్సయ్యానన్న బాబు
– టీడీపీ పోలిట్‌బ్యూరో భేటీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
అమరావతి: ‘‘పార్టీ నేతల పనితీరు ఏ మాత్రం బాగోలేదు. పదవులు తీసుకున్నవారు పనిచేయడం లేదు. ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా మనం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లకపోతే ఎలా? 2014-2019 లో మనం అద్భుతంగా పనిచేశాం. కానీ పార్టీ నేతలు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయినందుకే మనం ఓడిపోయాం. ఈసారి అలా జరగడానికి వీల్లేదు. మనం 1995-1999 మోడ్‌లోకి వెళ్లి పనిచేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి’’ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.
చాలాకాలం తర్వాత జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరోలో మాట్లాడిన బాబు పార్టీ నేతల పనితీరు, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లని వైనంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ అజెండా గురించి ప్రస్తావిస్తే, చంద్రబాబునాయుడు దానిపై ప్రసంగించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గతంలో తాను ఊహించినదానికంటే భయంకరంగా ఉందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎహ జీరో అయినందున, కొత్తగా అప్పులు పుట్టే అవకాశం కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తున్నందున గట్టెక్కుతున్నామని, దానితో కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు తీసుకురాగలుతున్నామన్నారు. అయినా వాటిని కూడా ప్రచారం చేసుకోవడంలో, పార్టీ నేతలు విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్‌కు ప్యాకేజీ కోసం తాను ఎంతో కష్టపడి, ఆర్ధికమంత్రితో అర్ధరాత్రి మీటింగు పెట్టి 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ సాధించినా, దానిని సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు విఫలమయ్యామని అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘కేవలం నా ఒత్తిడి వల్లే కేంద్రం విశాఖ స్టీల్‌కు ప్యాకేజీ ప్రకటించింది. ఆర్దికమంత్రి, ఉక్కుమంత్రిని ఒప్పించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. దానితో ప్రధాని ప్యాకేజీ ప్రకటించారు. దానివల్ల వేలాదిమంది ఉద్యోగులకు మేలు జరిగింది. అయినా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. కొంతమంది మాత్రమే మాట్లాడారు. మనం సాధించిన విజయాలు కూడా జనాలకు చెప్పకపోతే ఎలా? మీరంతా ఎందుకింత నిర్లిప్తంగా ఉన్నారో నాకు అర్ధం కావడం లేద’ని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
పార్టీ-ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలను మంత్రులు-ఎమ్మెల్యేలు ఖండించకపోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రుల శాఖలు, వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న వాటిపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. వాటిని ఖండించకపోవడం వల్ల ప్రజలు అవి నిజమనుకునే ప్రమాదం ఉంది. దానివల్ల అంతిమంగా పార్టీకేకదా నష్టం’’ అని ప్రశ్నించారు. ఇకపై మీడియాలో వచ్చే వ్యతిరేక కథనాలపై స్పందించాలని ఆదేశించారు.
కాగా పార్టీ కార్యకర్తలు తమపై వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను తొలగించాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని మాజీ మంత్రి ఒకరు సూచించారు. డిజిపీని సమన్వయం చేసుకుని, తమతో ఎస్పీతో అనుసంధానం చేసేలా చూస్తే, ఈ సమస్య త్వరగా పరిష్కారమవుతుందని సూచించారు. అయితే దానిపై స్పందించిన లోకేష్.. కార్యకర్తలపై కేసు వ్యవహారాన్ని తాము సీరియస్‌గానే తీసుకుంటున్నామన్నారు. పార్టీ కార్యకర్తలపై కేసులు ఐదారు దశల్లో ఉన్నాయని, వాటిని తమ ఆఫీసు నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుపై వైసీపీ సర్కారు పెట్టిన అక్రమ కేసును తొలగించామని చెప్పారు.
ఇక మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవలి చంద్రబాబు-లోకేష్ దావోస్ పర్యటన గురించి ప్రస్తావించారు.
దావోస్ పెట్టుబడుల అంశాన్ని ప్రచారం చేసుకోవడంలో మనం విఫమలయ్యామని, అదే తెలంగాణ-మహారాష్ట్ర సీఎంలు మీడియాకు చెప్పడంలో సక్సెస్ అయ్యారని యనమల అన్నారు. దానికి స్పందించిన చంద్రబాబు.. ఆరోజు రాత్రి తాను ఢిల్లీ నుంచి వచ్చేయడం వల్ల ఆవిధంగా జరిగిందని, లోకేష్ ఆఫీస్ దానిని మానటరింగ్ చేసిందని వివరించారు. మళ్లీ స్పందించిన యనమల.. మీరు దావోస్ నుంచి వచ్చి, అమరావతిలో ప్రెస్‌మీట్ పెట్టడం వల్ల అది కవర్ అయిందని వ్యాఖ్యానించారు.
మహానాడును మే 27,28న కడపలో నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కడప అయితే అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా వారికి దగ్గరలో ఉంటుందని, వసతి సౌకర్యాలు కూడా బాగా ఉంటాయని వివరించారు.
కాగా మే-జూన్ నుంచి అన్నదాత, సుఖీభవ పథకాలు ప్రారంభించబోతున్నట్లు చంద్రబాబు పార్టీ నేతలకు వె ల్లడించారు. ఆర్దిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఒక్కో పథకాన్ని ప్రారంభిస్తాం. ప్రజలకు ఇచ్చిన మాట కచ్చితంగా నిలబెట్టుకుంటామని బాబు స్పష్టం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక తర్వాత, రాష్ట్ర-జాతీయ కమిటీల ఎన్నికలు ఉంటాయని చెప్పారు.