– చరిత్రలో ఉన్నడూ లేనంత భారీగా టెక్స్టైల్ రంగానికి బడ్జెట్ కేటాయింపు చేస్తున్న ప్రభుత్వం మాది
– దేశంలో ఏక్కడా లేని విధంగా నేత్నన్నలకు యార్న్ సబ్సీడీ ఇస్తున్న చేనేత మిత్ర ప్రభుత్వం మాది
– ప్రత్యేక పొదుపు పథకంలో నేతన్నకు చేయూత నిస్తున్నది మా ప్రభుత్వం
– మా ప్రభుత్వం వచ్చినాక నేతన్నల ఆత్మహత్యలు ఆగిన విషయం బండి సంజయ్ కి కనిపించడం లేదా?
– ముంబై, భివండి, సూరత్ వంటి ప్రాంతాల నుంచి తెలంగాణకి కార్మికులు తిరిగి వస్తున్నది నిజం కాదా?
– మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోని ఏ నేతన్నను అడిగినా చెబుతారు
– నేతన్నలకు ఉన్న భీమాను ఎత్తేసిన కేంద్ర నిర్ణయంపై బండి మాట్లాడాలి
కేంద్రం భీమా ఎత్తేస్తే… మేము ప్రత్యేక నేతన్నకు భీమా కల్పిస్తున్నాము
దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కి కేంద్రం నుంచి అందిన సాయంపై బండి సమాధానం చెప్పాలి
– నేతన్నలపై నిజమైన ప్రేమ బండి ఉంటే పార్లమెంట్లో ప్రత్యేక సాయం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలి
– రాష్ట్రంలో నేషనల్ టెక్స్ టైల్ రిసెర్చ్ ఇన్ట్సిట్యూట్ ఏర్పాటు, చేనేతల కోసం ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీ, మెగాపవర్ లూమ్ క్లస్టర్ ను ఏర్పాటుపై బండి తన డీల్లీ సర్కారును నిలదీయాలి
– కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్లే దేశంలోని రెండవ అతిపెద్ద రంగంమైన టెక్స్టైల్ కునారిల్లుతోంది
– మోడీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే మన కన్నా చిన్న దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ మనకన్నా ఎంతో ముందున్నాయి
– స్వతంత్ర భారతంలో తొలిసారి చేనేతపై పన్ను వేసిన పాపపు ప్రభుత్వం బిజెపిదే
కరోనా సంక్షోభంలోనూ టెక్స్ టైల్ పరిశ్రమపై పన్నులు భాదింది భాజపా సర్కారే
– నేతన్నల సంక్షేమంపై బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
చేనేత కార్మికుల సంక్షేమంపైన నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన మాటలు ఆయన అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని చాటేలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖర రావు నాయకత్వంలోని మా ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టి దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నది. ఇదే కోవలో దశాబ్దాలుగా నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం, ప్రభుత్వం చేపట్టని స్థాయిలో విప్లవాత్మకమైన కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం చేపట్టింది.
దశాబ్దాలుగా అరకొర బడ్జెట్ ఇచ్చి నేతన్నల సంక్షేమంపై మొసలి కన్నీరు కార్చిన గత ప్రభుత్వాలకు భిన్నంగా, వందల కోట్ల రూపాయలను ఒకేసారి బడ్జెట్లో కేటాయించి నేతన్నల సంక్షేమానికి సరి కొత్త అర్థాన్ని ఇచ్చింది మా ప్రభుత్వం. నేతన్న రుణాలను మాఫీ చేసి వారిని అప్పుల ఊబినుంచి కాపాడింది మా ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్న చేనేత మిత్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నది. నేతన్నకు చేయూత పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకము తెలంగాణలోని నేతన్నలకు కోవిడ్ సంక్షోభ కాలంలో ఒక ఆపన్నహస్తంగా మారింది.
మగ్గాల అధునీకరీరణ నుంచి వర్కర్ టూ ఒనర్ పథకం వరకు మా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వలన ఈ రోజు రాష్ట్రంలోని నేతన్నల ఆదాయం రెట్టింపై గౌరవంగా తమకాళ్లపై తాము నిలబడే పరిస్థితి తీసుకు రాగలిగామని గర్వంగా చెప్పగలను. కేవలం నేతన్నలనే కాకుండా స్థూలంగా టెక్స్ టైల్ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ టెక్స్ టైల్ పార్కు మెదలుకుని అనేక మౌళిక వసతులను అభివృద్ది చేస్తున్నాము.
చేనేత లతోపాటు పవర్లూమ్ నేతన్నలకు సైతం పెద్ద ఎత్తున సహాయం అందించిన సర్కారు మాది…. ఒకప్పుడు ఉరికొయ్యలకు వేలాడిన నేతన్నల శవాల సాక్షిగా, రాజకీయాలు చేసినా పార్టీల సంస్కృతిని తిరిగి తెలంగాణలోకి తీసుకురావాలనుకుంటున్నారు బండి సంజయ్. ఒకవైపు మా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను పట్టించుకోకుండా, నేతన్నలను మోసపుచ్చే కల్లబొల్లి మాటలు వల్లె వేస్తున్నారు. మా ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం మాత్రం సంపూర్ణ సహాయ నిరాకరణ చేస్తున్నది.
ఇప్పటికే అనేక సార్లు కేంద్రంలోని మంత్రులను, ప్రధాన మంత్రిని సైతం కలిశాం. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలన్న మా విజ్ఞప్తిని కేంద్రం పక్కన పెట్టింది. రాష్ట్రంలో నేషనల్ టెక్స్ టైల్ రిసెర్చ్ ఇన్ట్సిట్యూట్ ఏర్పాటు, చేనేతల కోసం ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీ, మెగాపవర్ లూమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని కోరిన డిమాండ్ సైతం కేంద్రం పట్టించుకోవడం లేదు.
మరోవైపు ప్రజలపై తన అబద్ధాలతో దండయాత్ర చేస్తున్న బండి సంజయ్, తన కపట పాదయాత్రలో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని మాట్లాడుతున్న బండి సంజయ్ కేంద్రంలో అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి అవకాశవాదంగా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం వారి భవిష్యత్తు కోసం పార్లమెంట్లో ఒక మాట అయినా మాట్లాడారా…?
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం మా ప్రభుత్వం తరఫున అనేక విజ్ఞప్తులు చేసినా, అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేసిన అంశంపై ఒక రోజు అయినా నోరు విప్పారా చెప్పాలి. మా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వలన వ్యవసాయ రంగంతో పాటు టెక్స్టైల్ రంగంలోనూ రివర్స్ మైగ్రేషన్ జరుగుతున్న విషయం బండి సంజయ్ కళ్లకు కనిపించకపోవడం ఆయన గుడ్డితనానికి నిదర్శనం.
ముంబై, భివండి, సూరత్ వంటి ప్రాంతాల నుంచి వేలాది మంది తెలంగాణకు తిరిగివచ్చి ఇక్కడ తమ వృత్తిని ప్రారంభించుకుంటున్న పరిస్థితులు బండి సంజయ్ కి కనిపించడం లేదా..? నేతన్నకున్న అన్ని భీమా పథకాలను మీరు రద్దుచేస్తే మా ప్రభుత్వం నేతన్నలకు భీమా కల్పిస్తున్నది వాస్తవం కాదా?ఇలా నేత కార్మికుల కండ్లల్లో కారం కొట్టి…ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారా?? ఇన్నాళ్ళు మీకు ముందుచూపే లేదు అనుకున్నాం.. కనీసం మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసే చూపు కూడా లేదని అర్థమైపోయింది.
నేతన్నల భవిష్యత్తు పట్ల తన దొంగ బేంగని చాటుకుంటు, ముసలి కన్నీరు కారుస్తున్న బండి సంజయ్ తమ కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వలన ప్రపంచంలోనే అత్యధికంగా కాటన్ పండించే దేశం మన భారత దేశం, టెక్స్టైల్ ఉత్పత్తుల విషయంలో తమ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి చిన్న దేశాల కన్న వెనుకబడిన విషయం అసలు సోయిలో ఉన్నదా?
కేవలం కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వలన దేశంలోనే వ్యవసాయ రంగం తరువాత అత్యధిక మందికి ఉపాధినిచ్చే టెక్స్టైల్ రంగంలో ఉపాధి కల్పన జరగని పరిస్థితిని బండి సంజయ్ తెలుసుకుంటే మంచిది. టెక్స్టైల్ ఉత్పత్తులపైన భారీగా జీఎస్టీ పన్ను వాసులు చేస్తూ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం బిజెపిది కాదా?
స్వతంత్ర భారత దేశంలో తొలిసారి చేనేత రంగంపై పన్నులు మోపిన పాపపు ప్రభుత్వం మీదే కదా… ఇదే జీఎస్టీ తగ్గించాలని, చేనేతపైన జీఎస్టీని సంపూర్ణంగా ఎత్తివేయాలని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిన స్పందించని కేంద్ర ప్రభుత్వం మీదే కదా… మీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నలు, టెక్స్టైల్ పారిశ్రామిక వర్గాలు ధర్నాలు బంద్ లు నిర్వహించినా, పన్నులు తగ్గించని, కనికరంలేని కేంద్ర ప్రభుత్వం మీది కాదా?
ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉంటూ దేశంలోని నేతన్నల ఉసురు తీస్తూ, పరిశ్రమను సంక్షోభంలోకి నెడుతూ, మరోవైపు పరిశ్రమను ఆదుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్న మమ్మల్ని విమర్శించే మీ వైఖరికి ఊసరవెల్లులు సైతం సిగ్గు పడుతున్నాయి. తన కపట పాదయాత్రలో నేతన్నల కోసం పాటుపడుతున్న మా ప్రభుత్వంపైన విమర్శలు చేసే బదులు ధైర్యం ఉంటే ఢిల్లీలో ప్రధానమంత్రి నిలదీసి, రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక టెక్స్టైల్ పార్కును సాధించి తీసుకువచ్చే దమ్ము ఉన్నదా?
కేవలం ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలోని అంశాలపైన అబద్ధాలు మాట్లాడుకుంటూ, కేవలం మీడియా కవరేజ్ కోసం చేస్తున్న వాదనలను రాష్ట్రంలోని ప్రజలు, ముఖ్యంగా నేతన్నలు గుర్తిస్తున్నారు. బండి సంజయ్ ఇప్పటికైనా నేతన్నల పైన అభిమానం ప్రేమ ఉంటే తమ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే మంచిది. ఇలానే అసత్యాలతో మోసం చేయాలని చూస్తే రాష్ట్రంలోని నేతన్నలు బీజేపీ నేతలకు బుద్ది చెప్పడం ఖాయం.