రాజధాని వివాదానికి ముగింపు పలకాలి

రాజధానిగా అమరావతినే కొనసాగిస్తూ,వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి
-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు 
ప్రజల మనోభిప్రాయాలు, న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ చట్టం (మూడు రాజధానులు), సిఆర్‌డిఏ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే రాజధాని వివాదానికి ముగింపు పలకకుండా మళ్ళీ సమగ్రమైన మూడు రాజధానుల బిల్లు తీసుకు వస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం ఆక్షేపణీయం. రాజధానికి, వికేంద్రీకరణకు ముడిపెట్టడం సమంజసం కాదు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలి. రాజధాని నిర్మాణానికి తక్షణం పూనుకోవాలి. కేంద్రం నిధులిచ్చి తోడ్పడాలి. అదే సందర్భంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర తదితర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ద్వారా నిధులివ్వాలని విభజన చట్టంలో ఉన్నా కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒకవైపున రాజధాని అమరావతికి, మరోవైపున వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు సాధించి రాష్ట్రాభివృద్ధికి పూనుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలకోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి.