రాజుగారికి ఉన్న రోషము …పువ్వు పార్టీకి ఏది?

– పెద్దిరెడ్డి ‘ పెయిడ్ ఆర్టిస్ట్’ వ్యాఖ్యలపై పెదవి విప్పని ‘కమలం’
-సోము, సునీల్, జీవీఎల్ మౌనం
-అమిత్షా ఆదేశాలను ధిక్కరించిన సునీల్ పై ‘కమలం’లో చర్చ
(మార్తి సుబ్రహ్మణ్యం)
కనుమూరి రఘురామకృష్ణంరాజు సాంకేతికంగా వైసీపీ ఎంపీ. అలాంటి ఆయనే అమరావతి రైతుల పాదయాత్రను, సొంత పార్టీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్ ఉద్యమంగా విమర్శిస్తే.. ఇంత ఎత్తున లేచి, సొంత పార్టీ అయినప్పటికీ, మంత్రి పెద్దిరెడ్డిని కడిగిపారేశారు. రైతుల పాదయాత్రలో పాల్గొన్న ఎంపీ సుజనా చౌదరి, సీఎం రమేష్ ,కన్నా లక్ష్మీనారాయణ కూడా మీ దృష్టిలో పెయిడ్ ఆర్టిస్టు లేనా ? అని మంత్రి పెద్దిరెడ్డిపై మాటల కవాతు చేశారు.
పరాయి పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు , అమరావతి రైతులపై తన సొంత పార్టీ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన చేశారు. మరి ఉద్యమానికి అనుకూలంగా తీర్మానం చేసి, స్వయంగా పాదయాత్రలో పాల్గొన్న ‘పువ్వు పార్టీ ‘ నాయకత్వం ఇంకెంత రెచ్చిపోవాలి? మంత్రి వ్యాఖ్యలను ఏ స్థాయిలో తిప్పికొట్టాలి? ఎంతగా విరుచుకు పడాలి? … అదే ఆశ్చర్యం! పెద్దిరెడ్డి వ్యాఖ్యలను అటు పార్టీ చీఫ్ సోము వీర్రాజు గాని, కో ఇంచార్జ్ సునీల్ దియోధర్ గాని, ఏపీ వ్యవహారాల్లో చురుకుగా ఉండే ఎంపీ జీవీఎల్ నరసింహారావు గాని, ఖండించకపోవడం బీజేపీ వర్గాలను విస్మయపరిచింది. సోము గాని, సునీల్ గాని, ఈ అంశంలో కనీసం ట్వీట్ కూడా చేయకపోవడమే ఆశ్చర్యం.
మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటిదాకా జాతీయ నేత కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి రమేష్ మాత్రమే స్పందించి, పెద్దిరెడ్డిపై దాడి చేయడం గమనార్హం. ట్వీట్లు చేయటంలో అందరికంటే ముందు ఉండే ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి కూడా, మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను ఖండించకపోవడం ప్రస్తావనార్హం. నాయకులందరూ ట్విట్టర్ లో చురుకుగా ఉండాలని హితబోధలు చేసే సునీల్ గాని, కీలక అంశాల్లో అప్పటికప్పుడు స్పందించే రాష్ట్ర బిజెపి ట్విట్టర్ అకౌంట్ లో గాని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై ఎదురుదాడి కనిపించలేదు.
అమిత్ షా ఆదేశాలతో ,అమరావతి ఉద్యమంలోకి రాష్ట్ర బిజెపి ఉరకలు వేస్తే… కో ఇన్ చార్జి సునీల్ , ఎంపీ జీవీఎల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం కావలి పట్టణంలో జరిగిన బిజెపి పాదయాత్రలో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. స్వయంగా అమిత్ షా ఆదేశించినప్పటికీ.. సునీల్ పాదయాత్రలో పాల్గొనకపోవడం, అమిత్ షా ఆదేశాలను బేఖాతరు చేయడమేనని , పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం , అమరావతిపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కనపెట్టి పాదయాత్రలో పాల్గొంటే… పరాయి రాష్ట్రానికి చెందిన సునీల్ ఎందుకు పాల్గొన లేదన్న ప్రశ్నలు, పార్టీ వర్గాల్లో గత రెండు రోజుల నుంచి ప్రముఖంగా చర్చనీయాంశమయ్యాయి. ‘కావలి రైతు పాదయాత్రలో పాల్గొనేందుకు ఎంపీలంతా హైదరాబాద్ నుంచి వస్తే ,ఇక్కడే ఉన్నా సునీల్ ఎందుకు హాజరు కాలేదు? ఏపీలో ఏం జరిగినా వచ్చి ప్రెస్‌మీట్లు పెట్టే జీవీఎల్ ఎందుకు పాల్గొనలేదు? ఇది అమిత్ షా ఆదేశాలను ధిక్కరించడమే. మేం రాయలసీమ నుంచి పాదయాత్రకు వెళితే, విజయవాడలో ఉండే సునీల్ రాకపోవడం ఏమిటి’ అని కడప జిల్లాకు చెందిన ఓ నేత ప్రశ్నించాడు.
చివరకు మంత్రి పెద్దిరెడ్డి రైతుల పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ అగ్ర నాయకులను సైతం, పెయిడ్ ఆర్టిస్టులు అంటూ విమర్శించిప్పటికీ , అటు సోము ఇటు సునీల్ ఇప్పటిదాకా ఖండించి ఎదురుదాడి చేయకపోవడం బట్టి… అమరావతి పై అమిత్ షా ఆదేశాలు, ఒక వర్గానికి రుచించడం లేదని స్పష్టమవుతోం దన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Leave a Reply