Suryaa.co.in

Andhra Pradesh

బాబుపై పెడుతున్న కేసులను..మొగలిరేకులు, కార్తీక దీపం సీరియల్స్ తో పోలుస్తున్నారు

-ముఖ్యమంత్రి రిషికొండకు పారిపోతున్నారు
-చంద్రబాబును జైల్లోనే చంపేస్తారా?
-అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ధ్వజం

నాలుగున్నరేళ్ళు ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేసి, రాజధాని ఉన్న విజయవాడ, గుంటూరు జంట నగరాల ప్రజలకు చుక్కలు చూపించి, మిగిలిన 100 రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి విశాఖలోని రిషికొండకు పారిపోతున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ధ్వజమెత్తారు.

శుక్రవారం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వెళ్తున్నాను అన్నమాట అమరావతి కోసం తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా అన్న మాట ఒకటే అన్నారు. ఎన్నికలకు ముందు తాను మాత్రమే రాజధాని లో ఇల్లు కట్టానని రైతులను నమ్మించి, ఇల్లు కట్టుకొని రైతులను ఇళ్ళ నుంచి రోడ్లపైకి వెళ్లేలా చేశారన్నారు.

రాజధాని గ్రామాలలో పండుగలు, పబ్బాలు లేకుండా పోయాయని చెప్పారు. ప్రత్యక్షంగానో ,పరోక్షంగానో 300 మంది రైతులు రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు అని చెప్పారు. అమరావతిలో ధ్వంస రచన పూర్తి చేసుకుని, ఉత్తరాంధ్ర ధ్వంస రచన కోసం ఋషికొండపైకి ముఖ్యమంత్రి వస్తున్నట్లు ఆరోపించారు.

హైకోర్టు తీర్పులను కాలదన్ని చీకటి జీవోల ద్వారా దాదాపు 286 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి దొడ్డి దారి ప్రయాణాన్ని న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఖరికి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేయాలని పిలుపు ఇచ్చారు.

దాదాపు 35 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు డిహైడ్రేషన్, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతుంటే, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అవాక్కలు, చవాక్కులు పేలుతున్నారని బాలకోటయ్య ధ్వజమెత్తారు. చంద్రబాబును జైల్లో బతకనిస్తారా ? లేదా జైల్లోనే చంపేస్తారా ? అంటూ సజ్జలను సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుపై పెడుతున్న కేసులను, సాగుతున్న విచారణ పర్వాలను ప్రజలు మొగలిరేకులు , కార్తీక దీపం సీరియల్స్ తో పోలుస్తున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబు భద్రత, ప్రాణాలకు హాని పై ప్రజల్లో బలంగా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. వైయస్ వివేకానంద రెడ్డి, పరిటాల రవి, కోడెల శివప్రసాద్ , డాక్టర్ సుధాకర్ ను హత్య చేసిన ప్రభుత్వానికి చంద్రబాబు హత్య కూడా పెద్ద పనేమి కాదన్నారు. చంద్రబాబు ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా, వైసీపీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బాలకోటయ్య హెచ్చరించారు.

విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు మామిడి సత్యం, నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు, రెల్లి సంక్షేమ సంఘం నాయకులు శిరంశెట్టి నాగేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE