Suryaa.co.in

Editorial

కేటీఆర్ శాఖలో కాంట్రాక్టర్ల ‘కాసుల’ కేకలు

– ‘గ్రేటర్’లో కాంట్రాక్టర్లకు 500 కోట్ల రూపాయలు బకాయి
– వ్యాక్సిన్ డ్యూటీ బిల్లులూ పెండింగే
– చితికిపోతున్న చిన్న కాంట్రాక్టర్లు
– అప్పుల పాలయి 15 మంది ఆత్మహత్య
– పెళ్లి, చావు, ఆసుపత్రి పేరు చెబితేనే బిల్లులు
– సీఆర్‌ఎంపీలో కాంట్రాక్టర్లకు అరగంటలోనే చెక్కులు
– పీపీఎం స్కీములో రెండేళ్లు పూర్తికాకున్నా మళ్లీ రోడ్డుపై రోడ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
కేటీఆర్ మంత్రిగా ఉన్న మున్సిపల్ శాఖలో కాంట్రాక్టర్లు ‘కాసుల కేకలు’ వేస్తున్నారు. మార్చి నుంచి ఇప్పటివరకూ చేసిన పనులకు, బిల్లులు రాని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లు అప్పుల పాలయి, ఆత్మహత్యల బాట పడుతున్న విషాదం. చిన్న కాంట్రాక్టర్లు ఆర్ధికంగా చితికిపోయి, బ్యాంకులకు ఈఎంఐలు, ప్రైవేటు వ్యాపారులకు వడ్డీలు చెల్లించలేక ఉన్న ఆస్తులు తెగనమ్ముకోవలసిన దుస్థితి. మార్చి నుంచి ఇప్పటివరకూ సుమారు 500 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సిన గ్రేటర్ కార్పొరేషన్ చేతలెత్తేసిన నేపథ్యంలో, బకాయిలిచ్చే దాకా కొత్త పనులు చేసేదిలేదని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్న పరిస్థితి నెలకొంది. చివరాఖరకు వ్యాక్సినేషన్ సిబ్బందికి పెట్టిన భోజనాల బిల్లులు కూడా, మూడు నెలల నుంచి చెల్లించలేని దుస్థితి ధనిక రాష్ట్రమయిన తెలంగాణలో నెలకొంది.
హైదరాబాద్ పరిథిలోని 6 మున్సిపల్ సర్కిళ్లలో దాదాపు 2 వేలమంది చిన్నా, పెద్ద స్థాయి కాంట్రాక్టర్లు నమోదయ్యారు. వీరంతా రోడ్లు, డీసిల్టింగ్, ఎలక్షను పనులు చేస్తున్నారు. రాజధాని నగరంలో ఈ కాంట్రాక్టర్లు చేసిన ఆయా పనులకు, ఇప్పటివరకూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ , గత మార్చి నుంచి సుమారు 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. మార్చి వరకూ 200 కోట్లు పెండింగ్‌లో ఉండగా, ఏప్రిల్‌లో జీరో కాగా, మేలో 17 కోట్లు మాత్రమే చెల్లించారు. జూన్‌లో 20 కోట్లు ఇచ్చారు. అయితే జులైలో 75 కోట్లు, ఆగస్టులో 80 కోట్లు, అక్టోబర్‌లో 110 కోట్లు, నవంబర్‌లో సుమారు 100 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది.
అయితే అనధికారికంగా ఎలక్షన్ డ్యూటీలను కూడా, సర్కిళ్ల అధికారులు ఆయా సర్కిళ్ల పరిథిలోని కాంట్రాక్టర్లకే అప్పగిస్తున్నారు. టెంట్లు, కుర్చీలు, భోజనాల వంటివి కూడా కాంట్రాక్టర్లకే అప్పగిస్తున్నట్లు సమాచారం. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సైతం కాంట్రాక్టర్లే జీతాలు చెల్లిస్తున్నారు. వారికి అధికారులు దాని తాలూకు బిల్లులు ఎప్పుడోగానీ ఇవ్వరు. ఇక కరోనా నేపథ్యంలో, వ్యాక్సిన్ కార్యక్రమానికి వచ్చే సిబ్బందికి భోజనాలు పెట్టే బాధ్యతను సైతం, అధికారులు కాంట్రాక్టర్లకే అప్పగిస్తున్నారు. ఆ ప్రకారంగా వాటి బిల్లులు కూడా అన్ని సర్కిళ్లకు కలిపి, 50 నుంచి 60 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
ghmc7కాగా బిల్లుల కోసం గ్రేటర్ హెడ్డాఫీసు చుట్టూ తిరుగుతున్నా, ఫలితం ఉండటం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కమిషనర్‌ను కలిసినా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదనో, ప్రాపర్టీ టాక్సులు వసూలయిన తర్వాత ఇస్తామనో చెబుతున్నారని కాంట్రాక్టర్లు వెల్లడించారు. గ్రేటర్‌లో పెద్ద స్థాయి కాంట్రాక్టర్ల కంటే చిన్న స్థాయి కాంట్రాక్టర్ల సంఖ్యనే ఎక్కువ. 30-50క్షల రూపాయల పనులు చేసే, చిన్న-మధ్య తరహా కాంట్రాక్టర్ల జీవనం దుర్భరంగా మారింది. 50 లక్షల నుంచి కోటిరూపాయల వరకూ పనులు చేసే కాంట్రాక్టర్లది మరో దయనీయం. అయితే పెళ్లిళ్లు, చావులు, ఆసుపత్రి ఖర్చులున్నాయంటూ లెటర్ పెట్టుకున్న వారికి మాత్రం అంతో ఇంతో బిల్లులు ఇస్తున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ‘గుడ్డిలో మెల్లగా పెళ్లిళ్లు ఉన్నాయనో, ఆసుపత్రి ఖర్చులున్నాయని దరఖాస్తు పెట్టుకుంటే కొంత డబ్బులిస్తున్నారు. అదే మాకు దక్కేది‘ అని ఓ కాంట్రాక్టరు వ్యాఖ్యానించారు.
ghmc-road1‘‘మేం 3 రూపాయల వడ్డీలకు తీసుకువచ్చి పనులు చేయిస్తున్నాం. మాకు బిల్లులు రాకపోయినా వర్కర్లు, స్టాఫ్‌కు కచ్చితంగా జీతాలివ్వాల్సిందే. ఇక బ్యాంకు ఈఎంఐలు కట్టి చాలాకాలమయింది. ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పులతోనే మా పరువు పోతోంది. ఇళ్ళదగ్గరకొచ్చి వడ్డీవాళ్లు గొడవ పెట్టుకుంటుంటే తలకొట్టేసినంత పనవుతోంది. అటు చూస్తే కార్పొరేషన్ ఆఫీసులో బకాయిలు ఎప్పుడిస్తారో చెప్పరు. ఇటు చూస్తే ఇళ్ల దగ్గరకొచ్చి పరువు తీస్తున్న వడ్డీవ్యాపారులు. ఈ ఒత్తిళ్లు, అవమానాలు తట్టుకోలేక ఇప్పటిదాకా 15 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు.ఇప్పుడు వాళ్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అందులో కొంతమంది తమ భర్తలు చనిపోయినా, ఆస్తులు అమ్మి వడ్డీ వ్యాపారులకిచ్చిన విషాద సంఘటనలున్నాయి. మాతో కలసి పనులుచేసిన వాళ్లు ఆత్మహత్య చేసుకుంటుంటే, భవిష్యత్తులో మా గతి ఏం కావాలో అర్ధంకాకుండా ఉంద’’ని ఓ మధ్య తరహా కాంట్రాక్టరు ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఈ వయసులో మాకు మరో పనిచేతకాదు. కొత్త వ్యాపారాలు చేయలేం. అలాగని ఉన్న వ్యాపారం మానుకోలేం. మామీద వందలమంది ఆధారపడి జీవిస్తున్నారు. మా బిల్లులు రాకపోతే మేం రోడ్లు పనులు చేసే కూలీలు, స్టాఫ్‌కు జీతాలు ఎలా చెల్లించాలి? కరోనా తర్వాత కూలీలు దొరకని పరిస్థితిలో మేం ఊళ్ల నుంచి కూలీలను తెచ్చుకుని పనిచేయించుకుంటున్నాం. మరి వారికి డబ్బులెలా ఇవ్వాలి? రోడ్డు పనులు చేసే మిషన్ల సంగతేమిటి? బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐల పరిస్థితి ఏమిటి? పనుల కోసం తెచ్చిన వడ్డీ డబ్బెలా తీర్చాలి? సమాజంలో కాంట్రాక్టర్లంటే అంతా ధనికులనే అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. బిల్లులు రాకపోయినా పరువు కోసం అప్పులు తెచ్చి కూలీలు, రోడ్లకు కావలసిన మెటీరియల్ కొనాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించకపోతే మాకు ఆత్మహత్యలే గతి’’ అని గ్రేటర్ హైదరాబాద్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హన్మంత్ సాగర్ అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని స్థాయిల్లోని కాంట్రాక్టర్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
బిల్లుల కోసం ధర్నాలు
dharna-file-photoచేసిన పనులకు బిల్లులు చెల్లించకపోతే కొత్త పనులు చేసేదిలేదని కాంట్రాక్టర్లు గతంలో ధర్నాలకు దిగారు. సర్కిళ్ల వారీగా జీహెచ్‌ఎహసీ ఆఫీసుల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీనితో నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. నిధులు లేకపోవడంతో కొత్త పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ఉన్న మొహమాటాల కారణంగా, కొంతమంది కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నప్పటికీ, అవి నిదానంగా కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారం అటు ఎమ్మెల్యేలకూ ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్యేలు చేస్తున్న సిఫార్సులు కూడా చెల్లడం లేదు. అయితే పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్లు ‘పైనుంచి’ సిఫార్సు చేయించుకుంటే మాత్రం బిల్లులు మంజూరవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి తెలంగాణలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వ్యవహారంపై ‘సింగిల్‌విండో విధానం’ అమలవుతోందని, భారీ బిల్లులు సీఎంఓ నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే తప్ప, మంజూరు కావడం లేదన్న వ్యాఖ్యలు కొన్నేళ్ల నుంచి బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
ఆ కాంట్రాక్టర్లకు అరగంటలోనే చెక్కులెందుకు?
contractors-unionఇదిలాఉండగా.. చేసిన పనులకు నెలల తరబడి బిల్లులు రాక ఆందోళన వ్యక్తమవుతుంటే, మరోవైపు సీఆర్‌ఎంఎఫ్, ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు కింద రోడ్లు, ఫైఓవర్లు, సిటీ కనెక్టింగ్ రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు మాత్రం..పనులు పూర్తయిన అరగంటలోనే చెక్కులిస్తున్న వైనంపై, కాంట్రాక్టర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతా చేసేది ఒకే రకమైన పని అయినప్పుడు, ఈ పక్షపాతమేమిటని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకురుణాల ద్వారా వారికి చెల్లిస్తున్నామంటున్న అధికారులు, అదే సూత్రం తమ విషయంలో ఎందుకు పాటించటం లేదని నిలదీస్తున్నారు. అన్ని పనులనూ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని, కాంట్రాక్టర్ల అసోసియేషన్ చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్నా వినే దిక్కులేదు. పెద్ద కంపెనీలకు చెందిన కాంట్రాక్టర్లపై అధికారులు ప్రేమ చూపిస్తూ, తమపై మాత్రం పక్షపాతం చూపించడం ధర్మం కాదంటున్నారు.
రెండేళ్లు కాకుండానే రోడ్ల మీద రోడ్లా?
ghmc-roadకాగా అసలే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుని, చేసిన పనులకే బిల్లులివ్వలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో.. గడువు తీర కముందే రోడ్లపై రోడ్లు వేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నగరం, శివారు ప్రాంతాల్లో పిపిఎం, సీఆర్‌ఎంపీ స్కీం కింద రోడ్లు నిర్మిస్తున్నారు. వీటికి 1850 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక ప్యాకేజీ కింద 300 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద ఇప్పటివరకూ 650 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా. అయితే ఈ పథకం కింద వేసిన రోడ్ల నాణ్యత, రెండేళ్ల వరకూ ఢోకా ఉండదు. ఆ విధంగా వేసిన చాలారోడ్లు ఇప్పటికీ శుభ్రంగానే ఉన్నాయి. కానీ మూసారాంబాగ్-అంబర్‌పేట, మలక్‌పేట టీవీటవర్-చాదర్‌ఘాట్, మరికొన్ని ప్రాంతాల్లో మళ్లీ కొత్త రోడ్లు వేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వాటిని నిర్మించి ఇంకా రెండేళ్లు కూడా కాలేదని, బాగా ఉన్న రోడ్లపై మళ్లీ రోడ్లు వేయడం ఎవరి కోసం? ఎందుకోసం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE