– మోడీ సర్కార్ కు తెలంగాణ ప్రజాగ్రహం తప్పదు
– కేంద్రం వివక్షతపై దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిందే
– కేంద్రం నిధులు ఇవ్వదు.. విభజన హామీలు అమలు చేయదు
– కేంద్రంపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా నిధులు ఇవ్వకుండా, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా వివక్షత చూపుతున్న బీజేపీ నేతృత్వంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజాగ్రహం తప్పదు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం బిఆర్ అంబేద్కర్ సచివాలయ మీడియా సెంటర్ లో చిన్నారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని చిన్నారెడ్డి ఆరోపించారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిసారి అక్కసును వెళ్ళగక్కుతూనే ఉన్నారని చిన్నారెడ్డి అన్నారు.
ఆ అక్కసును మనసులో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణపై కక్ష సాధిస్తున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ పార్లమెంటులో బిల్లు పెట్టినపుడు బీజేపీ కూడా మద్దతు ఇచ్చిందన్న విషయం ప్రధాని నరేంద్ర మోడీకి గుర్తు పెట్టుకోవాలని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రూ. 15,000 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉందని, టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చిందని చిన్నారెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పాలన చాతకాక రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టివేసిందని చిన్నారెడ్డి అన్నారు.
మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేరుగా ఎందుకు చెప్పలేక పోయారని చిన్నారెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని చిన్నారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, గిరిజన, హార్టికల్చర్ యూనివర్సిటీలకు నిధులు విడుదల చేయాలని, కొత్తగా రోడ్లు, రైల్వే లైన్స్ ను ఏర్పాటు చేయాలని, నాలుగు వేల మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తిలో మిగిలిన 2,400 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తికి సహకరించాలని, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని, షెడ్యూల్ 9, 10 లోని అంశాలను అమలు చేయాలని చిన్నారెడ్డి కేంద్ర ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్.ఆర్.ఆర్. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు. కేంద్రం వివక్షత్తపై దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిందే అని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రంపై ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవాల్సిందే అని చిన్నారెడ్డి పేర్కొన్నారు.