Suryaa.co.in

Telangana

రాష్ట్రాభివృద్ధికి నిర్మాణ రంగం వెన్నెముక

* ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం
* “గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్” యువజన విభాగం సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. “గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్(జీఈబీఏ)” యువజన విభాగం ఆధ్వర్యంలో నాగోల్ ఎక్స్ రోడ్డులోని హోటల్ జూబ్లీ పార్క్ లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

‘గతేడాది కమర్షియల్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ 56 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది దేశంలోనే అత్యధికం. రిటైల్ రంగంలో 1.8 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ ను అద్దెకు తీసుకున్నారు. ఇవి కేవలం అంకెలు కాదని, పెట్టుబడిదారుల్లో తెలంగాణపై ఉన్న విశ్వాసాన్ని చాటి చెబుతున్నాయి’ అని ఈ సందర్భంగా అన్నారు.

‘రాష్ట్ర స్థూల విలువ జోడింపు(జీవీఏ)లో నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ వాటా సుమారు 30 శాతం వరకు ఉంది. నిర్మాణ రంగంలో సుమారు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ కీలక పాత్ర పోషిస్తోంది. ఉక్కు, సిమెంట్, ఇంటీరియర్ తదితర పరిశ్రమలకు కూడా ఈ రంగం ఊతమిస్తోంది’ అని వివరించారు. ‘రియల్ ఎస్టేట్ ప్రత్యక్షంగా.. పరోక్షంగా అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. దీని వృద్ధిపైనే ఇతర రంగాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

2014 నుంచి తెలంగాణ రియల్ ఎస్టేట్ లో దూసుకెళ్తోంది. మన దగ్గర నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు. ప్రస్తుతం రెరా దగ్గర 9,679 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, 4,252 మంది ఏజెంట్లు నమోదు చేసుకున్నారు’ అని పేర్కొన్నారు. ‘సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించాల్సిన అవసరముంది.

పర్యావరణహితంగా నిర్మాణాలు జరగాలి. ఈ విషయంలో యువ బిల్డర్లే చొరవ చూపాలి. కొత్తగా ఆలోచించాలి. అప్పుడే నిర్మాణ వ్యయం తగ్గుతుంది. వినియోగదారులకు మేలు జరుగుతుంది.’ అని చెప్పారు. మీరు పేర్చే ఇటుకలు.. కట్టే భవనాలు కేవలం నిర్మాణాలు కాదు, తెలంగాణ భవిష్యత్తుకు పునాదిరాళ్లని గుర్తించాలని యువ బిల్డర్లకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, జీఈబీఏ యువజన విభాగం ప్రతినిధులు విక్రమ్ కుమార్, మేఘన, అక్షయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE