– రెండు నెలల్లో ఆమోదం
– అభిప్రాయ సేకరణ మొదలు
అవును మీరు చదివింది నిజమే. ఇప్పటివరకు అమరావతి రీజియన్ మాస్టర్ ప్లాన్ కు ఆమోదం లేదు. ప్రాస్పెక్టస్ (ప్రతి పాధిత) ప్లాన్ మాత్రమే వున్నది. ఈ ప్లాన్ ను తొలి టీడీపీ ప్రభుత్వంలో సింగపూర్ కు చెందిన సుర్బానా జూరంగ్ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. దానిలో రాజధాని నగర ప్లాన్ ఆమోదం పొందింది మినహా రీజియన్ ప్లాన్ ఆమోదం పొందలేదు. దాన్ని ఇప్పుడు ఆమోదించుకొనున్నారు.
ఇప్పటి వరకూ ఉన్న ప్లాను ఆమోదం కోసం కార్యాచరణ ప్రారంభించింది. త్వరలో దీనికి ఆమోదం లభించనుంది. రీజియన్ ప్లాను ఆమోదం కోసం సిఆర్‌డిఏ అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇప్పటి వరకూ అమరావతి నగర మాస్టర్‌ప్లానుకు మాత్రమే ఆమోదం లభించింది. రీజియన్ ప్లానుకు లేదు.
2016 సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్ కన్సల్టెన్సీ అమరావతి మాస్టర్‌ప్లాను రూపొందించింది. నగరానికి ఒకటి, రీజియన్‌కు మరొక ప్లాను రూపకల్పన చేసింది. దీనిలో అమరావతిని నవనగరాలుగానూ, రీజియన్‌ను తొమ్మిది ప్రాంతాలుగానూ ప్రతిపాదించింది. దీనిలో సిటీ ప్లానును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. రీజియన్ ప్లానుకు ఆమోదం తెలపలేదు.
2004లో విజిటిఎం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ రూపొందించిన జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్లనే ఇప్పటికీ అమలు చేస్తోంది. ప్రస్తుతం అమరావతి నగరానికి వీలుగా చుట్టుపక్కల అభివృద్ధి ప్లాన్లను రూపొందించాలి. ఔటర్‌రింగురోడ్డు, ఇన్నర్ రింగురోడ్డుతోపాటు వేర్వేరు ప్రాంతాల్లో అభివృద్ధి జోన్లు పెట్టాలని నిర్ణయించారు. వీటిల్లో గన్నవరంలో ఎకనామిక్ హబ్, తెనాలిని తెనాలిలో సాంస్కృతిక రాజధానిగా పేర్కొంటూ అక్కడే లైట్ ఇండిస్టియల్ సపోర్ట్ హబ్, సత్తెనపల్లిలో హెవీ ఇండిస్టీస్ హబ్, పాత అమరావతిని పర్యాటక హబ్‌గా ప్రతిపాదించారు.
అమరావతి నుండి రీజియన్ పరిధిలో ఉన్న తొమ్మిది ప్రాంతాలకు నేరుగా వెళ్లేలా మాస్టర్‌ప్లానులోరోడ్లూ రూపకల్పన చేశారు. ఈ ప్లానుకు ఇప్పటి వరకూ ఆమోదం లభించలేదు. రీజియన్ మాస్టర్‌ప్లానుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాల్సి ఉండటంతో దాన్ని ఆమోదించాల్సి ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మాస్టర్‌ప్లాను ఆమోదించే అవకాశం ఉంది. దీనికి వీలుగా సిఆర్‌డిఏ అభిప్రాయ సేకరణ చేపట్టింది.
అలాగే జోనల్ మాస్టర్‌ప్లాన్లలోనూ స్వల్ప మార్పులు చేయాల్సి ఉంది. గత మాస్టర్‌ప్లానుకు ఇప్పటికీ 10 సంవత్సరాలు గడిచిపోవడం పెద్దఎత్తున నివాసాలు పెరడంతో గ్రీన్‌జోన్ చాలా వరకూ తగ్గిపోయింది. సింగపూర్ కంపెనీ ఇచ్చిన మాస్టర్‌ప్లానుకు ఆమోదం లభిస్తే సిఆర్‌డిఏ రీజియన్ ప్లాను అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా అమరావతి నగరాన్ని విస్తరించాల్సి ఉన్న నేపథ్యంలో రీజియన్ పరిధిలో ఉన్న పాత అమరావతి మండలాన్ని కూడా క్యాపిటల్ సిటీ పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.
రీజియన్ ప్లాను ఆమోదం సమయంలోనే దానికి వీలుగా మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే దొండపాడు వరకూ ఉన్న సీడ్ యాక్సెస్‌రోడ్డును పాత అమరావతి గుంటూరు రోడ్డులో కలిపేలా మార్పులు జరిపేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారని సమాచారం.
– వల్లభనేని సురేష్
(సీనియర్ జర్నలిస్ట్)