– ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నిధులు లేకుండా ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతాయి?
– రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది
– మంత్రులకు అధికారాలే లేవు.. మంత్రులకు గౌరవం లేదు
– బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్
హైదరాబాద్: ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ దాడికి 50 ఏళ్లు గడిచింది. 1975 జూన్ 25… దేశ చరిత్రలో మరిచిపోలేని చీకటి రోజు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ఇటుత తెలంగాణలోనూ బిజెపి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా ఆ చీకటి రోజుల గురించి ప్రజలకు వివరించడం జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి నుంచీ దత్తాత్రేయ , వెంకయ్య నాయుడు , జంగారెడ్డి గారు, ఇంద్రసేనా రెడ్డి , చలపతిరావు వంటి అనేకమంది ఉద్యమకారులు, కార్యకర్తలు మీసా చట్టం కింద జైళ్లకు వెళ్లారు ఆనాడు రాజనాథ్ సింగ్ ని కూడా జైలుపాలు చేశారు. ఆ సమయంలో ఆయన తల్లి మరణించినప్పటికీ, అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆ దారుణ చరిత్రపై ప్రజలకు ఏ సమాధానం ఇస్తారు?
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా గాంధీ కుటుంబానికి ఒకే ఒక ఉద్దేశం.. “ఐ, మీ, మై సెల్ఫ్” సిండ్రోమ్. రాహుల్ గాంధీ ఎప్పుడూ రాజ్యాంగ పుస్తకం పట్టుకుని ప్రజాస్వామ్యం ఖతమైపోయింది అంటారు. కానీ, ఎమర్జెన్సీ విధించిన తీరు గురించి సమర్థించాలా? వ్యతిరేకించాలా? అనే విషయంపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్.. మోదీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ విధించింది అంటూ విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు జస్టిస్ మాధవి దేవి తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. బిజెపి ఎప్పటి నుంచో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ చేస్తోంది. ఫిబ్రవరి 1, 2024 నుండి రాష్ట్రంలోని పలు గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు లేరు. గత ఆరు నెలలుగా ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఎవరు గెలిచినా .. కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులు ప్రజలకు చేరే అవకాశం ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపడం లేదు? సర్పంచ్‌లు లేకుండా గ్రామాభివృద్ధి ఎలా సాధ్యం? ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నిధులు లేకుండా ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతాయి? సమాధానం చెప్పాలి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వచ్చిన హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టే.
గతంలో తరచూ కోర్టుల తీర్పులను ధిక్కరిస్తూ.. వాయిదాలు వేయడమే రాష్ట్ర ప్రభుత్వ నైజంగా కనిపించింది. కానీ ఇకనైనా కోర్టు స్పష్టంగా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఎన్నికలు జరిపించకుండా కేంద్రాన్ని నిందించడం… అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో గ్యారెంటీలు, హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొత్త పాలన తీసుకొస్తామని, గ్యారెంటీ స్కీమ్స్ అమలు చేస్తామంటూ ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక అసలైన పరిస్థితేంటో బయటపడింది.
లంకె బిందెలు ఉన్నాయనుకుని వస్తే ఖాళీబిందెలే ఉన్నాయి. అప్పులే తప్ప మిగిలిందేమీ లేదు అంటూ రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు ప్రజలను అవమానపరచడమే. ఎక్కడికి వెళ్లినా డబ్బులు రావడం లేదు, ఎవ్వరూ అప్పు ఇవ్వడం లేదంటూ.. ఇలాంటి మాటలు చెప్పేది పాలకులు ఎలా అవుతారు? ఓటమికి భయపడే నాయకుడే కదా! ఇది రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమే. ప్రజలు చూస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు.
ఇది పూర్తిగా కీలుబొమ్మల ప్రభుత్వమని ప్రజలు ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల్లోనే ప్రధాన మంత్రిత్వ శాఖలన్నీ ఉండడంతో మంత్రులకు అధికారాలే లేవు. మంత్రులకు గౌరవం లేదు, స్వతంత్రత లేదు. అధికారులూ మంత్రుల మాట వినడంలేదు. ఇలాంటి విచిత్ర పాలన దేశంలో మరెక్కడా లేదు.
ఈ పరిస్థితుల్లో మంత్రులు సీఎం మాట వినడంలేదు. అధికారులు మంత్రుల మాట వినడంలేదు. ప్రజలు ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్తే వారు ఏం చేయాలి? హామీలు నెరవేర్చలేకపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవే మూల కారణాలు. ఇదే కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తోంది. ఎందుకంటే, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీకి భయం.
సంస్థాగతంగానూ భారతీయ జనతా పార్టీకి బలంగా ఉంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ ఎన్నికలైనా.. బిజెపి గెలుస్తుందనే నిజాన్ని కాంగ్రెస్ అంగీకరించలేకపోతోంది.
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టులాంటిదే. మూడు నెలల లోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశించింది. దీనిని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా సరే.. అది బైఎలక్షన్స్ అయినా, స్థానిక సంస్థల ఎన్నికలైనా, భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది.
హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల్లోపే పూర్తిచేయాలి అని చెప్పిన నేపథ్యంలో భవిష్యత్తులో హైకోర్టు జడ్జిమెంట్‌ను గాలికొదిలేసే ప్రయత్నాలు చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రజలకు నిధులు చేరాలి, నిధులు చేరాలంటే ప్రజా ప్రతినిధులు అవసరం, ప్రతినిధులుంటేనే సమగ్ర పాలన సాధ్యం.