ఎంపి విజయసాయిరెడ్డి
నవంబర్,28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కనబడుటలేదా అని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆర్.బిఐ నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి (జిఎస్డిపి) చంద్రబాబు గారి హయాంలో (2018-19) కంటే రెట్టింపై రూ.13.2 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి ఐదో స్థానంలో నిలిచిందన్నారు.
గతంలో 15వ స్థానంలో పాతాళంలో ఉండేదని,ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదు కదా పురంధేశ్వరి గారూ! అంటూ ప్రశ్నించారు..జగన్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి…ఇందుకే ఏ.పీకి జగన్ గారే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
లోకేశ్ వి బిత్తరి సవాళ్లు
టిడిపి నాయకుడు లోకేశ్ యువగళం యాత్ర పేరుతో ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో తెలియదు కాని,నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నాడని అన్నారు. గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోవాలన్నారు. ఛాలెంజికి కూడా ఒక స్థాయి ఉండాలని లోకేశ్ కు చూరకలంటించారు..
పొత్తు లేకుండా మొదటిసారి అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
భారతదేశంలో అనేక రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రాంతీయపక్షాలూ మొదట ఇతర రాజకీయపక్షాలతో ఎన్నికల పొత్తుపెట్టుకుని మొదట అధికారంలోకి వచ్చాయని అన్నారు. ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీ తాను అధికారంలోకి వచ్చినప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేసుకున్న సందర్భాలు చాలా రాష్ట్రాల్లో కనిపిస్తాయని చెప్పారు. అలా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లకు పైగా పాలకపక్షంగా కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇతర పార్టీలతో పొత్తులేకుండా మొదటిసారి 2019లో అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.
తాను పోటీచేసిన మొదటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో (2014)లో సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ఏ ఇతర పార్టీతో పొత్తు లేకుండా పోటీచేసి తొలి ప్రయత్నంలోనే 175 సీట్లకుగాను 67 కైవసం చేసుకుందన్నారు. కిందటి ఎన్నికల్లో కూడా ఎలాంటి ఎన్నికల పొత్తు లేదా అవగాహన ఏ ఇతర పార్టీతో లేకుండా 151 అసెంబ్లీ స్థానాలు, 23 పార్లమెంటు సీట్లు గెలుచుకుందని చెప్పారు.
వైఎస్సార్సీపీ కన్నా ఎన్నో దశాబ్దాల ముందు పుట్టిన శిరోమణి అకాలీదళ్, శివసేన, బిజూ జనతాదళ్ (బీజేడీ), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ), ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) వంటి ప్రాంతీయపక్షాలు తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఎన్నికల్లో పొత్తుల ద్వారా మెజారిటీ స్థానాలు సాధించాయని తెలిపారు.
పశ్చిమ బెంగాల్ లో పన్నెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న ప్రాంతీయపక్షం తృణమూల్ కాంగ్రెస్ కూడా 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తదితర పార్టీలతో ఎన్నికల పొత్తుతోనే మొదటిసారి మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిందన్నారు.