Suryaa.co.in

Andhra Pradesh

డ్రోన్లు వదిలారు.. గంజాయి పట్టేశారు!

– ఫలిస్తున్న చంద్రబాబు సాంకేతిక ఆలోచన
– డ్రోన్ల ద్వారా 5 ఎకరాల గంజాయి పంట గుర్తింపు
– జీ మాడుగుల మండలంలో ప్రయోగం సక్సెస్
– విజయవాడ వరదల్లో డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం పంపిణీ
(వాసు)

సీఎం చంద్రబాబునాయుడు ఎప్పుడూ టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటారేమిటన్నది చాలామంది సందేహం. టెక్నాలజీ కూడుపెడుతుందా అన్నది మరికొందరి వాదన. అయినా ఆయన వాటిని పట్టించుకోరు. తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. ఆ తర్వాత ఆవిషృ్కతమయ్యే అద్భుతాలు చూసి, అదే విమర్శలు నోరెళ్లబెడుతుంటారు.

ఉమ్మడి రాష్ట్రంలో టెక్నాలజీని ప్రోత్సహించేందుకు అనేక సంస్థలకు భూములు కేటాయించారు. తర్వాత అక్కడ నెలకొల్పిన అనేక ఐటీ సంస్థలు, వేలాదిమంది తెలుగు నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చాయి. లక్షల ప్యాకేజీలతో వేలమంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు బాటలు వేశారు. ఇప్పుడూ ఇంతే. బాబుకు వయసు పెరిగినా.. దానితోపాటే పెరుగుతున్న అనుభవంతో తెలుసుకున్న కొత్త టెక్నాలజీ, ఇప్పుడు నేరపరిశోధనలో కొత్త పుంతలు తొక్కేందుకు కారణమవుతోంంది.

ఇటీవల విజయవాడను వరదలు ముంచెత్తిన సమయంలో.. ఇళ్లల్లో చిక్కుకుని ఆహారం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు, డ్రోన్ల సాయంతో ఆహారం అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. డ్రోన్లను అలా కూడా వాడవచ్చా అని కేంద్రబృందం నోరెళ్లబెట్టింది. ఇప్పుడు మరో అడుగుముందుకేసి.. అడవుల్లో గంజాయిసాగు చేస్తున్న వారిని అవే డ్రోన్లు పట్టించిన వైచిత్రి ఇది.

కొద్ది రోజుల క్రితం అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. డ్రోన్ల టెక్నాలజీ ఓ గేమ్‌ ఛేంజర్‌ అని, డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు, అసాంఘిక శక్తులకు చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు.

డ్రోన్ల ద్వారా విజిబుల్ పోలీసింగ్ తగ్గిస్తామని, ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారా అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్ల ఆట కట్టిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విజన్ ను పోలీసులు రియాలిటీలో చేసి చూపించారు. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి గంజాయి పంటను ఏపీ పోలీసులు ధ్వంసం చేసిన వైనం.. చంద్రబాబు విజన్ కు తాజా నిలువెత్తు తార్కాణంగా నిలిచింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా సాగు చేస్తున్న గంజాయి పంటను డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి పోలీసులు ధ్వంసం చేశారు. డ్రోన్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీని ఉపయోగించిన అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు…5 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న గంజాయి పంటను గుర్తించారు. జీ మాడుగుల మండలంలోని డేగలరాయి గ్రామంలో గుర్తించిన ఆ గంజాయి పంటను పోలీసులు తగులబెట్టారు. ఆ గంజాయి పంటను పండిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

తాజా ఘటన నేపథ్యంలో చంద్రబాబుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. టెక్నాలజీని వాడడంలో, ఆ టెక్నాలజీని సమాజహితం కోసం ఉపయోగించడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

విజన్ 2020 అంటూ ఆనాడు ఐటీ రంగంలో జరగబోయే డెవలప్ మెంట్ ను చంద్రబాబు 20 ఏళ్ల ముందే గుర్తించారని, అదే తరహాలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం గురించి విజన్ 2047 అంటూ చంద్రబాబు 20 ఏళ్ల ముందే చెప్పారని అంటున్నారు. అమరావతిని డ్రోన్ క్యాపిటల్ చేస్తే ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తుందని చెబుతున్నారు.

LEAVE A RESPONSE