-సముద్ర రవాణా అభివృద్ధి విషయం లో మోదీపై ప్రశంసలు
-మౌలిక సదుపాయాలను భారీగా విస్తృతపరచడమే మోదీ అతిపెద్ద విజయం
-వేల కొద్దీ మైళ్ల హై వేలు
-వేగవంతమైన ఇంటర్‌సిటీ రైళ్లు
ఎప్పుడూ మోదీ ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధించే అంతర్జాతీయ ఆర్థిక పత్రిక ‘ద ఎకనమిస్ట్’ అయితే, ఈ సారి ఆశ్చర్యంగా సముద్ర రవాణా అభివృద్ధి విషయం లో మోదీ ప్రభుత్వాన్ని పొగుడుతూ పెద్ద వ్యాసం ప్రచురించింది.
ఆ వ్యాసం సంక్షిప్తంగా మీ కోసం..
“మోదీ మద్దతు దారులు మరియు విమర్శకులు ఇరువురూ కూడా అంగీకరించే ఒక విషయం ఏదైనా ఉంది అంటే అది భారతదేశ మౌలిక సదుపాయాలను భారీగా విస్తృతపరచడమే మోదీ అతిపెద్ద విజయం అని అంగీకరించవచ్చు. వేల కొద్దీ మైళ్ల హై వేలు నిర్మించబడ్డాయి, వేగవంతమైన ఇంటర్‌సిటీ రైళ్లు ఊపందుకున్నాయి, డజన్ల కొద్దీ పట్టణ మెట్రో మార్గాలు తెరవబడ్డాయి. అలాగే, ఎక్కువ మంది భారతీయులు మునుపెన్నడూ లేనంత ఎక్కువ విమానాశ్రయాల ద్వారా ఎక్కువ విమానాలలో ప్రయాణించారు. ఇవి నిజంగా ఆకట్టుకునే విజయాలు.”
చాలా మంది భారతీయులకు ప్రత్యక్ష సంబంధం లేనివి, కానీ వారి జీవితాలను ఒకే విధంగా ప్రభావితం చేసే రంగాలలో కూడా మోదీ ప్రభుత్వం లో తెర వెనుక లోతైన పరివర్తన జరుగుతోంది.
సామాన్యులకు తెలియని బయటకు అభివృద్ధి కనిపించని రంగం ఒకటి అదే “ఓడరేవుల” రంగం. ఈ రంగం సామర్థ్యం, సమర్థతలో భారీ మెరుగుదలలను సాధించింది. భారతదేశ ఆర్థిక లక్ష్యాలు చేరుకుందికి ఇది చాలా కీలకం. భారతదేశాన్ని తయారీ మరియు ఎగుమతి కేంద్రంగా, అలాగే ప్రపంచ సరఫరా గొలుసులలో (supply chain) ఒక నోడ్‌గా మార్చాలనే ఉద్దేశ్యం మోదీ ప్రభుత్వంకి ఉంది. ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ స్థాయి పోర్టులు అవసరం.
సముద్ర రంగం భారతదేశం యొక్క వాణిజ్య పరిమాణంలో 95% మరియు వాణిజ్య విలువలో 65% కలిగి ఉంది. ఈ రంగంలో మోదీ ప్రభుత్వం అపారమైన పురోగతి సాధించారు. ప్రభుత్వం “మేజర్ పోర్ట్‌లు”గా వర్గీకరించిన వాటిలో- డజను పోర్టుల సామర్థ్యం గత దశాబ్దంలో 745 మిలియన్ టన్నుల నుండి 1,600 మి. ట అంటే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. భారతదేశ వాణిజ్యంలో సగానికి పైగా నిర్వహించే ఈ నౌకాశ్రయాల వద్ద ట్రాఫిక్ గత పదేళ్లలో అంటే 2023 నాటికి 46% పెరిగి 795 మిలియన్ టన్నులకు చేరుకుంది.
షిప్పుల టర్నరౌండ్ సమయం అంటే కార్గో ఓడ రాక మరియు తిరిగి బయలుదేరే మధ్య గంటల సంఖ్య , 2010-11లో 127 గంటల నుండి పదేళ్ల తర్వాత ఇప్పుడు 53 గంటలకు పడిపోయింది (క్రిందచార్ట్ చూడండి). ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచికలో దశాబ్దం క్రింద 54వ స్థానంలో ఉన్న భారత్ గతేడాది 38వ స్థానానికి చేరుకుంది.
ఒక ఉదాహరణ కోసం, ‘నవా షెవా’పోర్ట్ ను చూడండి. దీనినే జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA) అంటారు. 1989లో అధిక-వాల్యూమ్ కంటైనర్ ట్రాఫిక్‌ను ఒక ఆధునిక సౌకర్యంగా ప్రారంభించబడింది. ఇది భారతదేశం యొక్క అత్యంత సమర్థవంతమైన పబ్లిక్ పోర్ట్. భారత్ యొక్క కంటైనర్ ట్రాఫిక్‌లో సగం మరియు ప్రధాన నౌకాశ్రయాలలో కస్టమ్స్ ఆదాయంలో నాలుగింట ఒక వంతు వాటా గల ఈ పోర్ట్ టర్నరౌండ్ సమయాలు సగటున 21 గంటలు.
JNPA మరియు ఇతర పబ్లిక్ పోర్ట్‌లలో ఈ పాజిటివ్ మార్పుకు మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
1. 1996లో ప్రభుత్వం ఓడరేవుల నిర్మాణం మరియు నిర్వహణలో ప్రైవేట్ రంగం పాల్గొనేందుకు అనుమతించడం. దాని వల్ల ఇక్కడ 5 కంటైనర్ టెర్మినల్స్ ప్రైవేట్ వారు నిర్వహిస్తున్నారు. దుబాయ్ కి చెందిన డిపి గ్రూప్, డెన్మార్క్ కి చెందిన మస్క్, ఆదాని మొ. వారు.
2. గతంలో పోర్ట్ ప్లానింగ్ ఎంత సేపూ ఆహారాధాన్యాలు దిగుమతులను దృష్టిలో పెట్టుకుని చేసేవారు. అయితే, ఇప్పుడు మోదీ ప్రభుత్వం పోర్ట్ లతో దేశవ్యాప్తంగా త్వరగా రవాణా/గిడ్డంగి అనుసంధానం చేయడానికి దేశ వ్యాప్తంగా ఎలెక్ట్రానిక్ టోల్ గేట్లు, GST ఏర్పాటు, ప్రత్యేక రైల్వే గూడ్స్ డెడికేటెడ్ ఫ్రాయిట్ కారిడార్స్ వంటి వి ఏర్పాటు చేశారు. వస్తువు ఖరీదుల్లో ప్రస్తుతం ఉన్న 8%ఉన్న రవాణా చార్జీలను 5%కి తీసుకురావడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.
3. అలాగే కస్టమ్స్ విభాగాన్ని.పూర్తిగా ఆధునీకరించారు. ముంబై పోర్ట్ 90% సరుకులు భౌతికంగా పరీక్షించే అవసరం లేదు. అలాగే 80%వరకు సరుకులు స్కాన్ కూడా చేయనవసరం లేని విధం అవలంబిస్తున్నారు.
7500 కి.మీ సముద్ర తీరం, 200 పోర్టు లు ఇంత ఆధునీకరించిన తరువాత కూడా ప్రపంచ కంటైనర్ రవాణాలో భారత్ వాటా కేవలం 2.4% అంటే చిన్నదేశం అయిన UAE తో సుమారు సమానం, సింగపూర్ ట్రాఫిక్ లో సగం మాత్రం భారత్ కి ఉంది. ఈ చిన్న దేశాలకు అంత కంటైనర్ రవాణా వ్యాపారం ఉండటానికి అవేమీ భారీ సంఖ్యలో వస్తువులు ఉత్పత్తి చేసే దేశాలు కావు. కానీ ప్రపంచ కంటైనర్ రవాణా మార్గంలో ఉన్న తమ దేశాల పోర్ట్ లను ‘టాషిప్మెంట్’పోర్ట్ లుగా తీర్చి దిద్దారు.
అంటే ఒక దేశం నుండి ఒక షీప్ లో వస్తున్న కంటైనర్లను వేరే దేశం వెళ్లే షిప్స్ లోకి మార్చే వ్యవస్థ ఏర్పాటు చేశారు అన్న మాట. అందుకే మోదీ వచ్చాక ఈ దిశగా ఆలోచించడం మొదలు పెట్టి ప్రపంచ సముద్ర ముఖ్య రవాణా మార్గం లో ఉన్న మన అండమాన్ నికోబర్ దీవులలో ఇటువంటి ‘టాషిప్మెంట్’ పోర్ట్ ఏర్పాటు కు సన్నాహాలు చేస్తున్నారు.
రాజకీయ నాయకులు సామాన్య ఓటర్లు ఎంత సేపూ పైకి కనిపించే వాటి మీదే శ్రద్ద పెడుతున్నారు కానీ రవాణా వ్యవస్థ మెరుగు పరచడం, రూల్స్ సరళం చేయడం వంటి దీర్ఘకాలిక సంస్కరణల విలువ గుర్తించడం లేదు.
ఆర్థిక వ్యవస్థ మిగతా రంగాల్లో కూడా మంచి ఫలితాలు చూపించగలదు అనే దానికి సూచిక ఈ పోర్ట్స్ సముద్ర రవాణా విషయం లో భారత్ త్వరగా సాధించిన అభివృద్ధి.