చదువు ప్రాధాన్యాన్ని వివరించిన గొప్ప సంఘసేవకురాలు సావిత్రిబాయి ఫూలే. మహిళల హక్కుల కోసం వందేళ్ల క్రితమే పోరాడిన తొలి తరం మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి. మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3 న ఒక రైతు కుటుంబంలో జన్మించారు. నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య.
ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు భావించారు.
సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో బోధన్ నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో, ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్ ప్రాంతపు మున్నూరు కాపులు వీరికి చుట్టాలు. నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. ఆయన ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848 మే 12న భర్తతో కలిసి కింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి బహుజన పాఠశాలను ప్రారంభించారు.
కేవలం నాలుగేళ్లలోనే గ్రామీణ ప్రాంతాల్లో 27 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. తన జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. మానవ హక్కులు, ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవామండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది.
జెండర్ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ కృషి చేసింది. 1873లో తన భర్త మహత్మా పూలేతో కలసి సత్యశోధక్ సమాజ్‌ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాలు కోసం బలమైన ఉద్యమం నడిపారు.
తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యశోధక్ సమాజ్’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యాన్ని శోధించడానికి ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్ సమాజ్ మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది.
1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాధ బాలలను దాదాపు 3,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే కాదు, రచయిత్రిగా కూడా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా ‘కావ్యఫూలే’ను ప్రచురించారు.
మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుభోధ్ రత్నాకర్’ను 1891లో ప్రచురించారు. భర్త జ్యోతీరావు పూలే 1890 నవంబరు 28న మరణించినప్పుడు ఆ దుఃఖంలో నుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. దేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. ఫూలే మరణానంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతనీ స్వీకరించి నడిపించింది.
1897 లో ప్లేగు వ్యాధి, పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. సావిత్రీబాయి పూలే తన కుమారుడు యశ్వంత్‌తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు. 1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులకు, పేదలకోసం ఆమె జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు.
ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890 వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్లేగు వ్యాధి సోకిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడారు. చివరికి ఆ గిప్లేగు వ్యాధే ఆమెకు సోకి 1897 మార్చి 10న మరణించారు. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించారు.