Suryaa.co.in

Andhra Pradesh

స్కిల్ కేసులో ఫోరెన్సిక్ ఆడిట్ లోపభూయిష్టం

కాంట్రాక్ట్ ప్రారంభంలో జీఎస్టీ వ్యవస్థ లేదు
అమలు దశలో మధ్యలో టాక్స్ వ్యవస్థ మారడం వల్లే గందరగోళం
మాకు సప్లయ్ చేసిన వెండర్స్ కి మేము సర్వీస్ టాక్స్ చెల్లించాము
మా వెండర్స్ కి సరుకు ఇచ్చిన వెండర్స్.. సర్వీస్ టాక్స్ ఏ రూపంలో చెల్లించారో తెలియదు
అక్కడే కొంత గందరగోళం. దాని ఆధారంగా ఏదో అక్రమం జరిగిందని కథనాలు
ప్రతి రూపాయికి నిర్దేశిత ప్రొడక్ట్స్ సర్వీసెస్ సంపూర్ణంగా అందజేశాం
ఆ మొత్తానికి సంబంధిత టాక్స్ కూడా చట్టబద్ధంగా చెల్లించాం
నేనెప్పుడూ చంద్రబాబు నాయుడును కలవలేదు
చంద్రబాబు అరెస్టుపై డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖన్వీల్కర్

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు సమయంలో సీమెన్స్ సంస్థ కార్యకలాపాలను పలు సందర్భాల్లో తనిఖీ చేశాం. నిర్దేశిత లక్ష్యాలు చేరుకునేలా సీమెన్స్, మేము ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‍తో సమిష్టిగా ప్రయత్నం చేశాం. ఆంధ్రప్రదేశ్‍లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. మా కృషికి ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంచి అభినందన లభిస్తుందని ఆశించాం.

ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. పలు మీడియా సంస్థలు ఇన్ని వందల కోట్ల అవినీతి.. అన్ని వందల కోట్ల అవినీతి అంటూ కథనాలు ప్రచురిస్తున్నాయి. ఎవరైనా ఈ సెంటర్లలోకి ఒకసారి వెళ్లి పరిశీలిస్తే వాటి నిర్మాణానికి అయిన ఖర్చు.. శిక్షణకు అవుతున్న నిర్వహణ వ్యయం బట్టి వాస్తవం తెలుస్తుంది. నేను చేసిన పనిలో ఏమైనా లోపం ఉన్నా.. సదుపాయాల్లో ఏదైనా తప్పిదాలున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా దృష్టికి తీసుకురావాల్సింది.

అగ్రిమెంట్ సైన్ చేసుకున్నప్పుడు కూడా ఆర్బిట్రేషన్ కు అవకాశం ఉండింది.. అవేవీ లేకుండానే నేరుగా కేసులు దాకా వెళ్లారు. ఈ కేసులో చేసిన ఫోరెన్సిక్ ఆడిట్ చాలా లోపభూయిష్టంగా ఉంది. రూ.241 కోట్ల మోసం జరిగిందనే ఆరోపణనను ఏ సాధారణ ఆడిటర్ పరిశీలించినా, అది అవాస్తవమని తేల్చగలరు . ఏ చోట ఎన్ని కోట్ల లెక్క కావాలన్నది స్పష్టంగా చెప్తే మేము వివరణ ఇచ్చేవాళ్లం.

ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నప్పుడు కానీ.. ఆ తర్వాత కానీ.. నేనెప్పుడూ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవలేదు. ముఖ్యమంత్రి కలవమంటే సంతోషంగా కలిసే వాడిని . కానీ అది ఏ దశలోనూ జరగలేదు . మొత్తం ప్రాజెక్టుకైన ఖర్చును ఎప్పుడు ఏ వేండర్‍ కి ఎంత చెల్లించాము అన్న వివరాలు, ఇన్‍వాయిస్‍లతో స్పష్టంగా అందజేస్తున్నాం.

వివరాలు చూస్తే ఈ ప్రాజెక్టుకు మేము రూ.356 యొక్క కోట్లు వెచ్చించాము . ఒక రకంగా చెప్పాలంటే, ఈ ప్రాజెక్టు వల్ల మాకు రూ.17.8 కోట్ల నష్టం వాటిల్లింది . ఈ వివరాలన్నీ కూడా విచారణ సంస్థలకు అందజేశాం . ఈ ఆరోపణలు అన్నీ అవాస్తవం, ఎవరికి ఎలాంటి మొత్తము అక్రమంగా చెల్లించలేదు. సర్వీస్ టాక్స్ వ్యవస్థలో వచ్చిన మార్పుల తర్వాతే ఈ సమస్య తలెత్తింది.

కాంట్రాక్ట్ ప్రారంభంలో జీఎస్టీ వ్యవస్థ లేదు. అమలు దశలో మధ్యలో టాక్స్ వ్యవస్థ మారడం వల్లే గందరగోళం ఏర్పడింది. మాకు సప్లయ్ చేసిన వెండర్స్ కి మేము

సర్వీస్ టాక్స్ చెల్లించాము. కానీ మా వెండర్స్ కి సరుకు ఇచ్చిన వెండర్స్.. సర్వీస్ టాక్స్ ఏ రూపంలో చెల్లించారో తెలియదు. అక్కడే కొంత గందరగోళం ఏర్పడింది. దాని ఆధారంగా ఏదో అక్రమం జరిగిందని పలు కథనాలు ప్రారంభమయ్యాయి.

2018లోనే ఈ ఆరోపణలపై నేను పూర్తి వివరాలు ఇచ్చాను. ఎలాంటి షెల్ కంపెనీలు లేవు. 2017లో ఈ గందరగోళం తలెత్తితే ఇప్పటికీ ఆరేళ్లు గడుస్తున్నా, టాక్స్ సంబంధిత విచారణ బృందాలు, మాపై ఎలాంటి వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఏ తప్పు చేయలేదు కాబట్టి మాపై ఎలాంటి వ్యతిరేక నిర్ణయం ఉండదు.

నాకు చెల్లించిన ప్రతి రూపాయికి నిర్దేశిత ప్రొడక్ట్స్ సర్వీసెస్ సంపూర్ణంగా అందజేశాం. ఆ మొత్తానికి సంబంధిత టాక్స్ కూడా చట్టబద్ధంగా చెల్లించాం. చంద్రబాబు నాయుడుపై ఆరోపణ చేసేందుకు మాపై దుష్ప్రచారం చేయడం విచారకరం . ఒకరకంగా గత కొంతకాలంగా మాపై మీడియా ట్రయల్ జరుగుతోంది . బలవంతమైన వ్యక్తులు మాలాంటి చిన్న కంపెనీల బాధ్యులను అరెస్టు చేయించడం.. మాపై ఆరోపణలు గుప్పించడం మాలాంటి కంపెనీల ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

ఈ చర్యల ద్వారా మార్కెట్లో మా కంపెనీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా రేటింగ్ పడిపోతోంది . మా ఉద్యోగులు వెళ్లిపోతున్నారు, బ్యాంకులు రుణ పరపతి తగ్గిస్తున్నాయి. ఏ తప్పు చేయకుండానే , కంపెనీగా మా గొంతు నొక్కడమే మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేలోగా మా కంపెనీ ప్రాణం పోతుంది. దానికి బాధ్యులు ఎవరు? ఇంత అద్భుతమైన ఫలితాలు చూపించిన తర్వాత కూడా, ఏ కారణం చూపకుండానే మాపై ఈ రకమైన కక్ష సాధింపు బాధాకరం.

డొల్ల ఆరోపణలు చేస్తూ.. గత ప్రభుత్వానికో కొందరు వ్యక్తులకు లబ్ది చేకూర్చామని అసత్య ఆరోపణలు చేస్తూ, మమ్మల్ని శిక్షించడం సరికాదు. చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు ఆయన అరెస్టు అంశంపై, ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. ఎవర్ని నిందించగలను.. కానీ జరుగుతున్న పరిణామాలన్ని చాలా విచారకరం .

అంకెలను సరితూచి చూస్తే ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఈ తరహా పరిణామాలేవి జరగకుండా ఉండాల్సింది . వాటి ద్వారా ఓ పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉండగలరేమో, దానిపై నేనేమీ మాట్లాడలేను. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నా.. మేము స్థాపించిన సెంటర్లను సమర్థవంతంగా నిర్వహిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తద్వారా ఇతర రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి. వాటి ద్వారా రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం వారికి చెప్పగలను.

LEAVE A RESPONSE