అంధత్వ రహిత సమాజమే లక్ష్యం

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని విక్టోరియా గ్రౌండ్ లో, నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని విజయనగర్ కాలనీలోని ఫుట్ బాల్ గ్రౌండ్ లలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ MLC ప్రభాకర్ రావు తో కలిసి సందర్శించారు.

శిబిరానికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించగా, కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కంటి చూపు సంబంధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని అన్నారు.

పేద, మద్య తరగతి ప్రజల ఇబ్బందులు తెలిసిన ముఖ్యమంత్రి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా చూసేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూన్ 30 వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. కంటి వెలుగు శిభిరాలకు వెళ్ళిన వారికి ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, కళ్ళద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. అవసరమైన వారికి ఆపరేషన్ లు కూడా ఉచితంగానే చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు. శిబిరాలకు వచ్చే వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

ఈ నెల 19 వ తేదీన కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 22 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 1.53 లక్షల మందికి రీడింగ్ కళ్ళద్దాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. వీరిలో 3.52 లక్షల మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని గుర్తించినట్లు వివరించారు. ప్రజలు కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ తదితరులు ఉన్నారు.

Leave a Reply